. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షిద్దాం
. వ్యవసాయానికి అనుసంధానం సరికాదు: జల్లి విల్సన్
. నేడు అనంతపురంలో బహిరంగ సభ
విశాలాంధ్రశింగనమల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తున్నదని విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించు కోవాలని, ప్రతి కూలీకి ఉపాధి భృతి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని, కనీసం 200 రోజులు పని దినాలు కల్పించి... రోజు కూలి రూ.700 ఇవ్వాలని, గ్రామగ్రామాన పనులు కల్పించి వలసలు ఆపాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయరాదని, ఉపాధి హామీకి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో కష్టజీవుల పాదయాత్రను జల్లి విల్సన్ సోమవారం జెండా ఊపి ప్రారంభిం చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సీ జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, సహాయ కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగయ్య, కేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదా గాంధీ, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వైఎల్ రామాంజనేయులు హాజరయ్యారు. జల్లి విల్సన్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాల ఉద్యమాల ఫలితంగా నాటి యూపీఏ
1 ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, రాష్ట్ర మంత్రులు దేశంలోనే ప్రప్రథమంగా ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. అయితే మోదీ సర్కారు పేదల ఉపాధిని దెబ్బతీయాలని చూస్తోందన్నారు. వ్యవసాయానికి ఈ పథకం అనుసంధానం చేయడం ద్వారా నిధుల్ని పక్కదారి పట్టించే ఆలోచన చేస్తున్నారన్నారు. ఈ పథకాన్ని అదృశ్యం చేయడమే బీజేపీ పాలకుల ఉద్దేశంగా ఉందన్నారు. ఉపాధి హామీ చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారన్నారు. చట్టాన్ని మనమే పుట్టించి మనమే చంపుకుంటామా? ఇది న్యాయమా? పేదల నోటి కాడ కూడు తీసేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉపాధి పనులు చేసే ప్రాంతంలో కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. మంచి నీరు, నీడ, మందులు, మజ్జిగ, క్యాలిక్యులేటర్, టేపు, సమ్మర్ అలవెన్స్, ఉపాధి కూలీలకు బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజుకు రూ.700 కూలి చెల్లించి, ఏడాదిలో 200 పని దినాలు కల్పించాలని, ప్రతి కూలికి ఉపాధి భృతి ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జగదీశ్ మాట్లాడుతూ ఉపాధి కూలి మేట్కి గౌరవ వేతనం ప్రతికూలీపై ఐదు రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కూలీ మృతి చెందితే రూ.5 లక్షలు పరిహారం, గాయపడితే నయమయ్యేంతవరకు వైద్యం చేయించాలని, మరణించిన వ్యక్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సి జాఫర్, వేమయ్య యాదవ్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని పరిరక్షించు కోవడంలో ఉపాధి కూలీల నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పనికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపో వడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కేటాయించలేకపోవ డం చూస్తుంటే కూలీలపై ఇంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని దుయ్యబట్టారు.
ఉపాధి హామీ పరిరక్షణకై నేడు బహిరంగ సభ
ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాల సిద్ధమవుతున్నామని నేతలు తెలిపారు.
బండ్లపల్లి నుండి ప్రారంభమైన పాదయాత్ర 22వ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అనంతపురం చేరుకోనుంది. కృష్ణ కళామందిర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ బహిరంగ సభకు ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నాయకులు వీ రాంభూపాల్ తదితరులు హాజరవుతారని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి డీపెద్దయ్య, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, బుక్కరాయసముద్రం మండల కార్యదర్శి మర్రి స్వామి, నార్పల మండల కార్యదర్శి గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, కిష్టప్ప, సుబ్రహ్మణ్యం, ఎం. నబీరసూల్, సీహెచ్ ప్రభాకర్, ఏఐటీయూసీ నేత రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ కుళ్లాయి స్వామి, శ్రీరాములు, కదిరప్ప, అప్పారావు, బాల యేసు, రామమూర్తి, తులసి రాజన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.