విశాలాంధ్రహైదరాబాద్ : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని తాండూర్, వికారాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీల్లో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయిన మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రూపురేఖలను మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. పట్టణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా అడుగు ముందుకేస్తోందన్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పెడుతూనే... మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రైతులు, మహిళలు, యువత... ఇలా అన్ని వర్గాల సంక్షేమం, సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామన్నారు. ఇప్పటికే 70 వేలకు పైగా ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేశామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి ‘తెలంగాణ రైజింగ’ లో భాగస్వామ్యం చేశామన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ‘రెడీ టూ వర్క్ ఫోర్స’ గా తెలంగాణ యువతను తీర్చిదిద్దే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి వారిని అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అన్ని రంగాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణాను తీర్చిదిద్దుతుంటే కొందరు ఓర్వలేక తమ స్వార్థ రాజకీయాల కోసం, ఈ ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అంతకు ముందు పరిగిలో శనివారం నిర్వహించనున్న ‘ప్రజా పాలనప్రగతి బాట’ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి, ధారాసింగ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే పట్టణాల సమగ్రాభివృద్ధి : మంత్రి
- Advertisement -
RELATED ARTICLES


