. బీజేపీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ
. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా వామపక్షాల ఆందోళన
విశాలాంధ్ర-తిరుపతి: ‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెంచే విధంగా ఉంది. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలు, రైతులకు ఏమాత్రం సానుకూలంగా లేదు. బీజేపీ విధానాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం’ అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఏనాడూ సామాన్య ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతున్నప్పటికీ ఎన్టీయే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, గిట్టుబాటు ధర కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడం వలన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరమయ్యే ప్రమాదం ఉందన్నారు. మోదీ సర్కారు అంబానీ, అదానీ ఆస్తులు పెంచడానికి కృషి చేయడం తప్ప సామాన్య ప్రజలు గురించి పట్టించుకోవడం లేదని రామకృష్ణ విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ధరలు తగ్గించ లేదని… ఉద్యోగాలు ఇవ్వలేదని… రైతుల సమస్యలు పరిష్కరించలేదని… నల్లధనం వెనక్కు తెప్పించలేదన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. కేంద్రబడ్జెట్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలోనూ అదానీకి మోదీ తొత్తుగా వ్యవహరించారని రామకృష్ణ ఆరోపించారు. భారతీయులకు సంకెళ్లు వేసి భారత్‌కు పంపిస్తున్నా పట్టించుకోని మోదీ… అదానీ కోసం ట్రంప్ వద్ద మోకరిల్లారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పాలకులు అన్ని మతాలను గౌరవించాలన్నారు. పాలన పక్కన పెట్టి సన్యాసుల మాదిరిగా తిరగరాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ తన పార్టీ అజెండా పక్కనపెట్టి… బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అయిన సనాతన వాదాన్ని నెత్తికెత్తుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆలయాలపై చూపే శ్రద్ధ ప్రజాప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధిపై చూపాలని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ విధానాన్ని టీడీపీ, జనసేన పార్టీలు అమలు చేస్తున్నాయ న్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి.మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్, రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, జయచంద్ర, లక్ష్మి, సుబ్రహ్మణ్యం, సాయిలక్ష్మి, సీపీఐ (ఎంఎల్) నాయకులు హరికృష్ణ, వెంకటరత్నం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.