డా॥సూర్యదేవర రామకృష్ణ
ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పట్టుకుని, కళ్ల నిండా ఆశతో ఆసుపత్రి తలుపుల ముందు నిలబడిన ఒక నిరుపేద రైతుకు డబ్బులు కట్టలేకపోతే వెళ్లిపోండి అనే మాట గుండె పిండేసినట్టు ఉంటుంది. ఇది ఒక్కరి కథ కాదు, రెండు రాష్ట్రాల్లో వేలాది మంది పేద రోగులకు నిత్యం ఎదురవుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఉచిత వైద్యం అని మైకులు పగిలిపోయేలా గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఆచరణలోకొచ్చేసరికి ఆ హామీ అమలులో సాధ్యం కావడం లేదు. మరి ఈ వైద్య వ్యవస్థ అసలు ఎవరి కోసం పనిచేస్తోంది ? నిరుపేదల ప్రాణాలను నిలబెట్టడానికా లేక బడా ఆసుపత్రుల దందా లాభాలను పెంచడానికా ? ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ ప్రశ్నకు సూటిగా, భయంకరమైన సమాధానం ఇస్తున్నాయి. శ్రీకాకుళం మొదలు అనంతపురం దాకా అనేక గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ, ఎన్‌టీఆర్ వైద్యసేవలను నిలిపివేయడంతో రోగులకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అనుమతి పొందిన 600కు పైగా ప్రభుత్వేతర ఆసుపత్రులకు ప్రభుత్వం సుమారు 2700 కోట్ల రూపాయల బకాయిలు నిలిపివేసింది. రోజులు గడుస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆసుపత్రి యాజమాన్యాలు ఉచిత సేవలకు ముగింపు పలికాయి. ఐతే నష్టపోయింది ఆసుపత్రి యజమానులు కాదు, జేబులో రూపాయి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొచ్చిన సామాన్యులే,తెలంగాణలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద గుర్తింపు పొందిన ఆసుపత్రులకు 300కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో, గాంధీ ఆసుపత్రిలో కనీసం గ్లౌజులు, కేన్సర్ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిల కోసం ఆసుపత్రులు తరచూ సేవలు నిలిపివేస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి కొంత మొత్తం విడుదల చేసి చేతులు దులుపుకుంటోంది. ఇదొక ముగింపు లేని విషవలయంగా మారిపోయింది. ప్రభుత్వం నిధులు ఇవ్వదు, ప్రైవేటు ఆసుపత్రులు ఉచిత చికిత్స చేయవు. వీటి మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోయేది నిరుపేదలే. ఈ దారుణ దుస్థితిని గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యం కోసం ప్రజలు సగటున ఒక వ్యక్తికి రూ.53,303ల చొప్పున సొంత జేబు నుంచి ఖర్చు చేస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు కాగితాలపై మాత్రమే మెరుస్తున్నాయి తప్ప పేదల బతుకుల్లో వెలుగులు నింపడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలైన సూది, దూది కూడా దొరకవు. ఇలాంటప్పుడు ప్రైవేటు ఆసుపత్రి గుమ్మం తొక్కడం తప్ప మరో దారి ఉందా? అక్కడ అడుగు పెడితే చాలు, ఖర్చు కొండంత అవుతుంది. ప్రాణం కాపాడుకోవాలంటే ఉన్న కాస్త ఆస్తి అమ్ముకుని, అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పదు. ఇది కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం మాత్రమే కాదు, పక్కా ప్రణాళికతో జరుగుతున్న ఒక వ్యవస్థాగత దోపిడీ. వరంగల్ వంటి పట్టణాల్లో అనేక ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తుండగా, కొన్నింటికి అసలు వైద్య ఆరోగ్య శాఖ అనుమతులే లేకపోవడం గమనార్హం. రోగులతో అనవసరమైన పరీక్షలు చేయించడం, చిన్న రోగానికి కూడా పెద్ద బిల్లులు వేస్తుండడంతో పేద, మధ్యతరగతి రోగులు అల్లాడిపోతున్నారు. నష్టపోయేది ఎప్పుడూ పైసల్లేని సామాన్యుడే, లాభపడేది మాత్రం ఆసుపత్రుల యాజమాన్యాలు, బీమా కంపెనీలే. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాల్సిన చోట నిధులు కోత పడుతున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న వైఫల్యమా లేక బడా శక్తులకు పేదల ప్రాణాలను తాకట్టు పెట్టే కుట్రనా? అయితే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన విషయమే అని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు సిబ్బంది కొరత, కనీస మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం వ్యాపార వస్తువుగా మారిపోతే, రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కుకు అర్థం ఏమిటి ? ఆరోగ్యశ్రీ బకాయిలు సకాలంలో చెల్లించి ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారానే పేదవాడికి నిజమైన భరోసా లభిస్తుంది. ఈ వైకల్యం ఉన్న వ్యవస్థ మారేది ఎప్పుడు ? పేదవాడి ప్రాణానికి నిజమైన విలువ ఎప్పుడు దక్కుతుంది ? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది ప్రజాపాలకులే. వారు ఇప్పటికైనా పేదవాడి ఘోష వింటారా? ఉచిత వైద్యం అనేది పాలకుల భిక్ష కాదు. ప్రజల ప్రాథమిక హక్కు ! పాలకుల మొద్దునిద్ర వదిలేలా, ప్రజారోగ్యం పట్ల బాధ్యతతో స్పందించేలా జనం రోడ్డెక్కి నిలదీసి వినేలా చేయాలి! నిరుపేద కంటినీరు తుడవని, ప్రాణానికి విలువ ఇవ్వని ఏ పాలనా వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యం అనిపించుకోదు.
సెల్ : 9490754169


