Tuesday, February 4, 2025
Homeవిశ్లేషణకార్మికులపై ప్రభుత్వ కత్తి

కార్మికులపై ప్రభుత్వ కత్తి

వెలుగూరి రాధాకృష్ణమూర్తి

29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి బదులు నాలుగు లేబర్‌ కోడ్‌లను ఏప్రిల్‌ 1వ తేదీనుంచి అమలులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. కోట్లాది మంది కార్మికుల ఐక్య ప్రతిఘటన కారణంగా, ఇప్పటివరకు కార్మిక కోడ్‌లు అమలు చేయలేదు. ఈ కోడ్‌లు యజమానులకు అనుకూలం. కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా కార్మిక కోడ్‌లు ఉండాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.

కార్మికవర్గం మరో పోరాటానికి సిద్ధమవు తోంది. ఫిబ్రవరి 5న దేశవ్యాప్త నిరసనలకు 10 కేంద్ర కార్మిక సంఘాలు, వందలాది స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపుని చ్చాయి. కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య పోరాటా నికి సంయుక్త కిసాన్‌ మోర్చా సంఫీుభావాన్ని ప్రకటించింది. కార్మికులు, కర్షకులు భుజం భుజం కలిపి పోరాడాలని నిర్ణయిం చారు. కార్పొరేట్‌ అనుకూల, మతప్రచారాన్ని సాగించే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగించడానికే నిర్ణయించుకుంది. మోయలేని తీవ్ర భారాలను మోపు తోంది. ఉపాధి అవకాశాలు శూన్యం కావటమేగాక, ఉన్న ఉద్యోగాలుకూడా ఊడిపోతున్న పరిస్థితిని, పెరుగుతున్న పేదరికాన్ని ప్రజలపైన రుద్దుతోంది. మరొకవైపు పాలక వర్గం తమ విధానాలను ప్రతిఘటించే వారి ప్రజాస్వా మిక, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూనే ఉంది. మొత్తం రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ విలువలపైన దుర్మార్గమైన దాడికి పాల్పడుతోంది. రైల్వే, రక్షణ, బొగ్గు, ఇతర గనులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రహదారులు, విద్యుత్‌, టెలికాం, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు వంటి అనేక రంగాల ప్రైవేటీకరణ, లేదా పెట్టుబడుల ఉపసంహరణ విధానాలను కొనసాగిస్తూనే ఉంది. నూతన పెన్షన్‌ పథకాన్ని రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి తీసుకురావడానికి మొండిగా నిరాకరిస్తూ ఉంది.
కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా చేసిన వాగ్ధానాల ప్రకారం, వ్యవసాయ పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధరకోసం, మూడు వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన అమలు జరిపే ప్రయత్నాలకు వ్యతిరేకంగా, రైతాంగం ఇతర సమస్యలపై సంయుక్త కిసాన్‌ మోర్చా చేస్తున్న ఆందోళనలకు కేంద్ర కార్మిక సంఘాలు తమ తోడ్పాటును, సంఫీుభావాన్ని ప్రకటించాయి. కార్మికులకు సంబంధించిన సమస్యల ఎజెండాపై కార్మిక సంఘాల అభిప్రాయాలు, సూచనలు తీసుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలన్నిటినీ ఒకేసారి ఆహ్వానించే సంప్రదాయం ఉండేది. దానికి భిన్నంగా, ఇప్పుడు కార్మిక సంఘాలను విడివిడిగా చర్చలకు ఆహ్వానించే కేంద్రప్రభుత్వ విధానాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి బదులు నాలుగు లేబర్‌ కోడ్‌లను ఏప్రిల్‌ 1వ తేదీనుంచి అమలులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. కోట్లాది మంది కార్మికుల ఐక్య ప్రతిఘటన కారణంగా, ఇప్పటివరకు కార్మిక కోడ్‌లు అమలు చేయలేదు. ఈ కోడ్‌లు యజమానులకు అనుకూలం. కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా కార్మిక కోడ్‌లు ఉండాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌ కూడా, కార్మికులపై దోపిడీని తీవ్రతరంగావించే, కార్పొరేట్‌ అనుకూల విధానాలకే, పెద్దపీట వేసేదిగా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక శాఖామంత్రితో జరిగిన ‘‘2025-26 బడ్జెట్‌ ముందరి’’ సంప్రదింపులలో కేంద్ర కార్మికసంఘాలు సంయుక్త విజ్ఞాపనను సమర్పించాయి. తమ దీర్ఘకాలిక డిమాండ్లపై ఒత్తిడిని పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలోని ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలనీ, నూతన ఉద్యోగాల నియామకాలపైగల నిషేధాన్ని ఎత్తివేయాలనీ, కార్మిక శ్రమపై ఆధారపడే పరిశ్రమలైన ఎంఎస్‌ఎమ్‌ఇలలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాలను రద్దు చేయాలనీ, స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించేందుకు జీవనోపాధి పథకాలను ప్రవేశపెట్టా లనీ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించడంతో పాటు, దినసరి కూలీని రూ.600లకు పెంచాలనీ, నూతన పట్టణ ఉపాధి హామీ పథకంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర కార్మికసంఘాలు తమ విజ్ఞాపనలో డిమాండ్‌ చేశాయి.
లేబర్‌ కోడ్‌ల పై వ్యతిరేకత ఎందుకు:
కార్మిక సంఘాల ఏర్పాటు, నిరసనలు, సమ్మెలు లాంటి సమిష్టి కార్యాచరణలపై ఆచరణ సాధ్యంకాని అసంబద్ధమైన అనేక షరతులను కార్మిక ‘కోడ్‌లు’ విధిస్తున్నాయి. కార్మికుల హక్కుల మీద నిషేధం విధించి, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఆమోదించిన ఐఎల్‌ఓ విధించిన, కీలకమైన శ్రామిక ప్రమాణాలను సైతం ఉల్లంఘిస్తున్న నిబంధనలు కార్మిక కోడ్‌లలో చోటుచేసుకున్నాయి. పార్లమెంట్‌ లేదా శాసనసభల అనుమతులు లేకుండానే కార్మిక కోడ్‌లలోని వివిధ అధికరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పించే నిబంధనలను వీటిలో పొందుపరి చారు. భారతదేశంలోని ఐఎల్‌ఓ శాఖ లేబర్‌ కోడ్‌లలోని వివిధ అంశాలపై కేంద్ర కార్మిక సంఘాలతో చర్చించి ఒక అవగాహనకు తీసుకురావటం జరిగింది. అవగాహనను సైతం అమలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం మొండిగా తిరస్కరించింది. ‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’’ పేరుతో, యజమానులకు అనుకూలంగా కోడ్‌లు తయారుచేశారు. దాదాపు150 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, త్యాగాలు చేసి కార్మికవర్గం సంపాదించుకున్న హక్కులన్నిటిపై ‘‘లేబర్‌ కోడ్స్‌’’ పేరుతో దాడిచేయటమే తప్ప, ఇది మరొకటి కాదు. సమ్మె హక్కు, యూనియన్ల రిజిస్ట్రేషన్లు కష్టతరం గావించటం, యూనియన్ల గుర్తింపు విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం, ‘కన్సిలియేషన్‌, ‘ఎడ్జుడికేషన్‌’ లాంటి ప్రక్రియలను కార్మికులకు అందుబాటులో లేకుండా చేయటం, లేబర్‌ కోర్టులను రద్దుచేయటం, యూనియన్ల రిజిస్ట్రేషన్‌లను ఏకపక్షంగా రద్దు చేసేందుకు వీలు కల్పిస్తూ ట్రేడ్‌ యూనియన్ల రిజిస్ట్రార్లకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టడం, ‘‘వేతనం’’ నిర్వచనాన్ని మార్చివేయటం, కనీస వేతనాల నిర్ణయానికి ఇప్పుడు అమలులో గల వివిధ వృత్తుల షెడ్యూళ్లను రద్దు చేయడంలాంటి పచ్చి కార్మిక వ్యతిరేక నియమాలు ఈ కోడ్‌లలో పొందు పరిచారు. ‘‘ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ కోడ్‌’’ పరిధి నుంచి కోట్లాదిమంది కార్మికులను తప్పించి, ఆ చట్టం వర్తించకుండా చేయటానికి అవసరమైన నియమాలను విధించారు. ఈ చట్టం వర్తించాలంటే, ఒకానొక సంస్థలో కనీసం పనిచేస్తుండాల్సిన కార్మికుల సంఖ్యను 100 నుంచి 300కు ఏకపక్షంగా పెంచారు. ఆ విధంగా కోట్లాదిమంది కార్మికుల భద్రతకుగల హక్కులపై దాడి చేశారు. పరిశ్రమలలోనూ, ఫ్యాక్టరీల లోనూ కార్మికశాఖ అధికార్ల ఇన్స్‌పెక్షన్లను రద్దు చేశారు. దీనికి బదులుగా యజమానుల చట్టబద్ధ మైన బాధ్యతలను ఉల్లంఘించ డంలో వారికి సహకరించేం దుకు వీలుగా, ‘ఫెసిలిటేటర్ల’ నియామకానికి నాంది పలుకుతున్నారు. కార్మికచట్టాలు వర్తించాలంటే, ఆయా పరిశ్రమలలో కనీసం 100 మంది కార్మికులు పనిచేస్తుండాలి. ‘ఫిక్స్డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌’, పరిమితులు లేని సంఖ్యలో అపరిమిత కాలానికి అప్రెంటీస్‌ల అక్రమ నియామకా లకు అవకాశం కల్పిస్తున్నారు. వీరిని ‘రెగ్యులరైజ్‌’ చేసే నిబంధనల ఊసేలేకుండా, కొత్తతరహా దోపిడీకి తెరలేపుతున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలకు విధించే శిక్షలు పూర్తిగా నిర్వీర్యం గావించేశారు. కానీ, కార్మిక సంఘాల నాయకులపై మాత్రం చిన్న చిన్న ఘటనలకు సైతం, భారీ జరిమానాలు విధించే నియమాలను తీసుకు వస్తున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిపై కార్మికులను నియమించే కాంట్రాక్టర్లకు ‘‘లేబర్‌ లైసెన్స్‌’’ కావాలంటే, అతనిదగ్గర కనీసం 20 మంది కార్మికులు ఉండాలి. ఆ సంఖ్యను ఇప్పుడు 50కి పెంచుతున్నారు. అంటే ఎటువంటి లైసెన్స్‌ అక్కరలేని, చట్టబద్ధత లేని, కాంట్రాక్టు విధా నానికి ప్రోత్సహం లభిస్తోంది. శాశ్వత స్వభావంగల ఉద్యోగాలలో సైతం కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు సర్వసాధా రణం గావిస్తున్నారు. మంజూరైన ఉద్యోగాలకు సైతం రిక్రూట్మెంట్‌ ఉండదు. పైగా నూతన ఉద్యోగాల సృష్టిపై నిషేధం విధించి, నిరుద్యోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నారు. సంపద సృష్టికర్తలైన కార్మికులు, కర్షకులు తమ సమస్యల పరిష్కారం కోసం మరింత ఐక్యతతో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధం కావడం తప్ప మరో మార్గంలేదు.
ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు