. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోదీ చర్చలు
. రఫేల్ డీల్ సహా 20 ఒప్పందాలపై సంతకాలు
. రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని నిర్ణయం
. కర్నాటకలో హెచ్-125 హెలికాప్టర్ల తయారీ ప్రారంభం
ముంబై: భారత్-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని, భారత్-ఫ్రాన్స్‌లు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచాభివృద్దికి ఏఐ ఎంతో దోహదం చేస్తుందన్నారు. కర్నాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. ఫ్రాన్స్ సాయంతో ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్‌ను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని లోక్‌భవన్‌లో సమావేశమైన ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియా ముందు ఆ వివరాలు వెల్లడించారు. ఫ్రాన్స్ భారతదేశపు పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటి అని మోదీ అన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ నుంచి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అపూర్వమైన సహకారం అందుతుందని వెల్లడించారు. ‘భారత్, ఐరోపా సంబంధాల్లో ఈ ఏడాది ఎంతో కీలకం. కొన్నిరోజుల క్రితమే ఐరోపా కూటమితో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న వేళ.. ప్రపంచ స్థిరత్వానికి ఇరు దేశాల భాగస్వామ్యం ఓ శక్తిగా మారుతుంది. బహుళ ధ్రువ ప్రపంచాన్ని మేం విశ్వసిస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రఫేల్ జెట్‌ల నుంచి సబ్‌మెరైన్ వరకు రక్షణ రంగంలో ఇరు దేశాలు సహకారం అందించుకుంటున్నా యని… ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్లను ఫ్రాన్స్ సహకారంతో భారత్‌లోనే తయారు చేయనున్నట్లు మోదీ వెల్లడించారు. యావత్ ప్రపంచానికి ఇక్కడ నుంచే అవి ఎగుమతి అవుతాయని తెలిపారు. ఉగ్రవాదం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలపై పొంచి ఉన్న యుద్ధ ముప్పు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “అది ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా, ఇండో-పసిఫిక్ అయినా, ప్రతి ప్రాంతంలో శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తూనే ఉంటాం. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో నిర్మూలించడం మా ఉమ్మడి నిబద్ధత. త్వరలో ఫ్రాన్స్‌లో స్వామి వివేకానంద సంస్కృతి కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ఈ రోజు సంయుక్తంగా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం” అని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. భారత్ తమకు ఎంతో విశ్వసనీయ భాగస్వామి అన్నారు. ఇరు దేశాలు చట్టబద్ధ పాలనను బలంగా నమ్ముతాయని, కొన్నేళ్లుగా దీన్ని రెండు దేశాలు నిరూపించాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సహకరిస్తామన్నారు. ఆత్మీయ స్వాగతం పలికినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్` ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగింపుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదవ తరం విమాన ఇంజిన్లపై కలిసి పనిచేస్తామని మాక్రాన్ పేర్కొన్నారు. రాఫెల్, జలాంతర్గాములు, హెలికాప్టర్ల సరఫరాకు గాను ఒప్పందాలపై సంతకం చేశామన్నారు. ఐదవ తరం యుద్ధ విమానాలపై భాగస్వామిగా ఉంటామన్నారు. సాంకేతిక బదిలీపై ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రెండు దేశాలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయని మాక్రాన్ తెలిపారు. జులైలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఆహ్వానించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా రఫేల్ డీల్‌తో సహా 20 ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. మొత్తంగా 20 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. కాగా 19న దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మాక్రాన్ హాజరవుతారు.


