డా॥ సూర్యదేవర రామకృష్ణ
భారతీయ సామాజిక, రాజకీయ వ్యవస్థలో కులం ప్రభావవంతమైన అంశం. ఓటు బ్యాంకు నుంచి మొదలుకొని ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, ప్రభుత్వ పథకాల రూపకల్పన, మంత్రివర్గాల కూర్పు వరకు కుల రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐతే ఒకవైపు, దళిత సమాజానికి దక్కాల్సిన నిజమైన రాజ్యాధికారం కాగితాలకే పరిమితమైందని, తెర వెనుక ఇప్పటికీ అగ్రవర్ణాల ఆధిపత్యమే శాసిస్తోందనే అభ్యుదయవాదుల గళం బలంగా వినిపిస్తోంది. దీనికి భిన్నంగా, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్లు, అంటరానితనం నిరోధక చట్టాల అండతో దళిత వర్గాలకు ఇప్పటికే వ్యవస్థలో తగినంత రక్షణ, సమాన ప్రాతినిధ్యం లభిస్తోందనే భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. భావోద్వేగాలకు తావులేకుండా, సామాజిక-రాజకీయ విశ్లేషణల అంతర్దృష్టితో అధికారిక గణాంకాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. భారత స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్.అంబేద్కర్ మార్గదర్శకత్వంలో రూపొందిన మహోన్నత రాజ్యాంగం, సమాజంలో శతాబ్దాలుగా అణచివేతకు గురైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సామాజిక, రాజకీయ విముక్తి కోసం విప్లవాత్మక రక్షణను పొందుపరిచింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 నిబంధనల ప్రకారం, దేశ అత్యున్నత చట్టసభ మొత్తం 543 స్థానాల్లో 84 స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు, 47 స్థానాలను షెడ్యూల్డ్ తెగలకు చట్టబద్ధంగా కేటాయించారు. ఇది మొత్తం స్థానాల్లో 24 శాతానికి సమానం. 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా ఎస్‌సీ జనాభా 16.6 శాతం, ఎస్‌టీ జనాభా 8.6 శాతంగా ఉంది. ఈ జనాభా నిష్పత్తికి అనుగుణంగానే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు. అంటే సంఖ్యాపరమైన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దళితులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం లభించిందనేది అక్షర సత్యం. విద్య, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, ఆర్థిక సహాయక పథకాలు, సామాజిక వివక్ష నిర్మూలన చట్టాలు వంటివి వెనుకబడిన వర్గాల సాధికారతకు బాటలు వేసినప్పటికీ, కాగితంపై మాత్రమే కనిపించే ఈ హక్కులు క్షేత్రస్థాయిలో నిజమైన అధికార వికేంద్రీకరణకు, ఆత్మగౌరవానికి దారితీశాయా అన్నదే ప్రస్తుత మేధావుల ముందున్న ప్రశ్న. ఇటీవలి రాజకీయ ముఖచిత్రాన్ని, ఎన్నికల సరళిని పరిశీలిస్తే, దళిత వర్గాలకు కేటాయించిన రిజర్వ్డ్ నియోజక వర్గాల్లో ఒక కొత్త తరహా అంతర్గత వైరుధ్యం స్పష్టమవుతోంది. దళిత సమాజంలోనే విద్యాపరంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్న కొన్ని నిర్దిష్ట ఉప కులాలే దశాబ్దాలుగా రాజకీయ ప్రయోజనాలను, అధికార పీఠాలను కైవసం చేసుకుంటున్నాయనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల అదే వర్గాల్లోని అట్టడుగున ఉన్న ఇతర ఉపకులాలకు రాజకీయ ప్రాతినిధ్యం అందని ద్రాక్షలా మారుతోంది. క్షేత్రస్థాయి ఉదాహరణలు చూస్తే ఉత్తరప్రదేశ్‌లోని 17 ఎస్‌సీ రిజర్వ్ స్థానాల్లో జాతవ్, పాసీ వంటి సామాజిక వర్గాలే రాజకీయంగా ఆధిపత్యం చలాయిస్తుండగా, వాల్మీకి, ముసహర్ వంటి ఉప కులాలు నేటికీ రాజకీయ ముఖచిత్రంలో నామమాత్రంగానే మిగిలిపోయాయి. బిహార్‌లో ఇక్కడ కూడా దుసాద్, రవిదాస్ వర్గాలు రాజకీయ చైతన్యంతో దూసుకుపోతుండగా, వెనుకబడిన ముసహర్ వంటి సమాజాలు తీవ్రమైన ప్రాతినిధ్య లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ అసమానతలను పరిగణనలోకి తీసుకునే, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల్లో ఉప-వర్గీకరణ చేసుకునే చారిత్రాత్మక హక్కును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. దళితులందరినీ ఒకే సమూహంగా పరిగణించడం వల్ల లోపల ఉన్న బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని న్యాయస్థానం గుర్తించింది. కాబట్టి, దళితులకు అధికారమే లేదు అనడం ఎంత ఏకపక్షమో, అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి అనడం కూడా అంతే భ్రమ అవుతుంది. రాజకీయ రంగంలో పదవులు దక్కడం ఒక ఎత్తయితే, నిత్య జీవితంలో దళిత సమాజం ఎదుర్కొంటున్న సామాజిక భద్రతా రాహిత్యం మరో ఆందోళనకరమైన అంశం. జాతీయ నేర గణాంకాల బ్యూరో విడుదల చేసిన 2022 నాటి నివేదిక దేశంలోని సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలపై నమోదైన నేరాల సంఖ్య 57,582 కు చేరింది, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 13.1 శాతం అసాధారణ వృద్ధిని సూచిస్తోంది. అలాగే షెడ్యూల్డ్ తెగలపై దాడులు 14.3 శాతం పెరిగి 10,064 కేసులుగా నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా విశ్లేషిస్తే, ఉత్తరప్రదేశ్ (15,368 కేసులు), రాజస్థాన్ (8,752), మధ్యప్రదేశ్ (7,733), బిహార్ (6,509) రాష్ట్రాలు దళితులపై జరుగుతున్న దాడుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. అత్యంత విచారకరమైన విషయమేమిటంటే, ఈ కేసుల్లో నేరస్థులకు శిక్ష పడే రేటు కేవలం 34 నుండి 36 శాతం మధ్యే ఊగిసలాడుతోంది. అంటే మూడింట రెండొంతుల కేసుల్లో నిందితులు చట్టం నుంచి సులభంగా తప్పించుకుంటున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా, వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల బాధితులకు తగిన న్యాయం జరగడం లేదని, దేశంలోని జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో దళితులు, గిరిజనుల సంఖ్యే వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని మానవ హక్కుల సంఘాలు గళమెత్తుతున్నాయి. సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్న సామాజిక వర్గాల నుంచి భిన్నమైన వాదనలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న రిజర్వేషన్ల విధానం వల్ల, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన యువతకు ఉన్నత విద్యావకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం లేదని, దీనివల్ల వారు తీవ్రమైన నిరుద్యోగాన్ని, మానసిక వేదనను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సామాజిక సమతుల్యతను సాధించేందుకే, 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల 10శాతం రిజర్వేషన్ల చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. కులంతో నిమిత్తం లేకుండా పేదరికం ఏ వర్గంలో ఉన్నా అది నిర్మూలించాలనే సత్యాన్ని ప్రభుత్వం గుర్తించిందని వారు వాదిస్తారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కులాల మధ్య కుంపట్లు పెడుతున్నాయని, దీనివల్ల దేశ ప్రగతి, నిజమైన అభివృద్ధి సంక్షేమ ఎజెండాలు పక్కదారి పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండు వాదనల మధ్య సత్యం : ఈ సంక్లిష్టమైన సామాజిక చర్చలో ఏ ఒక్క పక్షానిది సంపూర్ణ సత్యమని తీర్పు చెప్పలేం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిధిలో దళితులకు సంఖ్యాపరమైన ప్రాతినిధ్యం లభిస్తున్నప్పటికీ, ఆయా స్థానాల నుండి గెలిచిన ప్రజాప్రతినిధులు ఆచరణలో స్వతంత్ర నిర్ణయాధికారాలు చెలాయించలేకపోతున్నారు. అంతిమంగా వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల అధిష్టానాలపై, అగ్రవర్ణాల నియంత్రణలో సాగే నాయకత్వ నిర్మాణాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. చట్టసభల వెలుపల కార్పొరేట్ రంగం, న్యాయవ్యవస్థ, భూ యాజమాన్యం, జాతీయ మీడియా వంటి కీలకమైన రంగాలు, నిర్ణయాత్మక శక్తి కేంద్రాలలో నేటికీ దళిత, బహుజన వర్గాల భాగస్వామ్యం నామమాత్రంగానే ఉంది. ఇది కేవలం రాజకీయ సంఖ్యాబలమే కాకుండా, సమాజంలో ఆర్థిక, పంపిణీ అధికారాలు కూడా ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది.
సెల్ : 9490754169


