కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20వేల ఎకరాలు తగ్గించేలా 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని లేఖలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కొల్లేరు అభయారణ్య సరిహద్దుల మార్పుపై సీఈసీ అనుమతి కోరాలని తీర్మానం చేసినట్లు వెల్లడించింది. కొల్లేరు లేక్ మేనేజ్‌మెంట్ అథారిటీ తన రెండు సమావేశాల్లోనూ ఎన్‌బీడబ్ల్యూఎల్ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచన చేసింది. ఈ నేపధ్యంలోనే 2018 నుంచి సరిహద్దుల మార్పుపై ఉన్న స్టేను ఎత్తివేసి, తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని సీఈసీకి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే లేఖ రాశారు.
కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి
- Advertisement -


