ఆర్వీ రామారావ్
గోవా విముక్తి కోసం సీపీఐ నిర్వహించిన సత్యాగ్రంలో మొదటి బృందానికి నాయకత్వం వహించింది విష్ణు దామోదర్ చిటాలే. ఈ బృందంలో వెయ్యి మంది పాల్గొన్నారు. ఇందులో అప్పటికి విద్యార్థిగా ఉన్న గోవింద్ పన్సారే కూడా పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహంలో భగత్‌సింగ్ సన్నిహిత సహచరుడైన కమ్యూనిస్టు నాయకుడు పండిత్ కిశోరీలాల్ కూడా ఉన్నారు. సత్యాగ్రహులంతా బందా సరిహద్దులో గుమిగూడారు. వారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బందా సరిహద్దుకు చేరారు. అక్కడ భారీ సంఖ్యలో జనం ఉన్నారు. అనేకమంది పత్రికా రచయితలూ చేరారు. గోవా సరిహద్దుకు ఆవలి వైపున పోర్చుగీసు సైన్యం స్టెన్ గన్లతో సిద్ధంగా ఉన్నది. సత్యాగ్రహులు సరిహద్దు దాటగానే పోర్చుగీసు దళాలు కాల్పులు జరిపాయి. చిటాలేను హతమార్చడానికి సైనికులు తూటా వదిలారు. కానీ ఈ లోగా కర్నాల్ సింగ్ చిటాలేను కాపాడడానికి అడ్డు వచ్చారు. కర్నాల్ సింగ్ త్రివర్ణ ప్రతాకాన్ని తీసుకుని ముందుకు కదిలారు. అంతే తూటా ఆయన ప్రాణం తీసింది. కర్నాల్ సింగ్ మరణం చిటాలేను చాలా కాలం వేధించింది. షేక్ సనాఉల్లాకు కడుపులో బుల్లెట్ దిగింది. ఓక్‌కు మూడు బుల్లెట్లు దిగి నేలకూలాడు. ఈ లోగా మధ్యప్రదేశ్‌కు చెందిన సహోదరా దేవి త్రివర్ణ పతాకంతో ముందుకు సాగారు. తూటా పేలింది ఆమె అక్కడికక్కడే మరణించారు. భారీ సంఖ్యలో జనం సరిహద్దు వేపు పరుగెత్తారు.
గోవా విమోచనకోసం సత్యాగ్రహం చేయాలన్న ఆలోచన చిటాలేదే. 1955 జూన్-జులై నెలల్లో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఆయనకు గోవా అణువణువూ తెలుసు. గోవా విమోచనకు సత్యాగ్రహమే బలమైన ఆయుధం అని ఆయన భావించారు. అనేకమంది ఈ ప్రతిపాదనకు సమ్మతించలేదు. కానీ చిటాలే పట్టు వదలలేదు. 1955 మేలో గోవా విమోచన సమితి ఏర్పడిరది. అందులో సీపీఐతో సహా అన్ని పార్టీల వారూ ఉన్నారు. కాంగ్రెస్, జనసంఫ్‌ు, రైతుల ప్రతినిధులు కూడా ఆ కమిటీలో ఉండేవారు. ఈ కమిటీలో గోవా విమోచనకు అనుసరించవలసిన మార్గంపై విస్తృత చర్చలు జరిగాయి. చివరకు సత్యాగ్రహం చేయాలన్న చిటాలే ప్రతిపాదనపై అంగీకారం కుదిరింది. సత్యాగ్రహులను ఊచకోత కోయడానికి పోర్చుగీసు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సత్యాగ్రహులను వెనక్కు పంపించాలని గోవా విమోచన సమితి భావించింది. అది అంత సులభం కాలేదు. వారిని ఒప్పించే బాధ్యతను డాంగేకు అప్పగించారు. ఆయన వెనక్కు పంపడంలో సఫలమయ్యారు. తెరెఖోల్, సుర్లే, కాజిల్ రాక్ లాంటి చోట్ల సత్యాగ్రహులు గోవాలోకి ప్రవేశించగలిగారు. కానీ పోర్చుగీసు దళాలు వారి మీద భారీ స్థాయిలో అణచివేతకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది.
1955లో సత్యాగ్రహుల నాల్గో దళం సిద్ధమైంది. అప్పుడు చిటాలే హఠాత్తుగా అయిదుగురు సత్యాగ్రహులను పక్కకు పిలిచి జూన్ 18 గోవాలో విప్లవ దినోత్సవం అని చెప్పారు. అందువల్ల పనాజీలో సెక్రటేరియట్‌పై పోర్చుగీసు జెండా దించేసి త్రివర్ణ పతాకం ఆవిష్కరించాలని చెప్పారు. ఆ అయిదుగురు గుట్టుచప్పుడు కాకుండా పోర్చుగీసు కోటకు చేరుకుని త్రివర్ణ పతాకం ఎగురవేశారు. 1955 జూన్ 25-26 తేదీ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ అయిదుగురిని చిటాలే విజేతలైన పాండవులు అనే వారు.
సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం:
1956 ఆరంభంలో సంయుక్త మహారాష్ట్ర సమితి (ఎస్.ఎం.ఎస్.) బొంబాయిలో సార్వత్రిక సమ్మె నిర్వహించింది. చిటాలే పుణేలో సత్యాగ్రహం ప్రారంభించారు. ఆయన ఎస్.ఎం.ఎస్. ఉద్యమంలో చురుకైన నాయకుడిగా ఉన్నారు. ఆయనను ఆరంభంలోనే అరెస్టు చేసి 1957లో గానీ విడుదల చేయలేదు. 1957 సార్వత్రిక ఎన్నికలలో పుణే నుంచి చిటాలే బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. సంయుక్త మహారాష్ట్ర సమితి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. 1961 డిసెంబర్లో తప్ప గోవా విముక్తి సాధ్యం కాలేదు. గోవా విమోచన కాక ముందే 1961 మేలో 56 ఏళ్ల వయసులో చిటాలే మరణించారు.