Homeవిశ్లేషణగ్రీన్‌లాండ్‌పై అమెరికా దుర్నీతి

గ్రీన్‌లాండ్‌పై అమెరికా దుర్నీతి

- Advertisement -

సుంకవల్లి సత్తిరాజు

ఇతర దేశాలను కొనుగోలు చేయడం, వీలుకాకుంటే ఆక్రమించుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. అమెరికా చరిత్రను పరిశీలిస్తే ఈ వాస్తవం అవగతమవుతుంది. 50 రాష్ట్రాల అమెరికాలో అలాస్కా రాష్ట్రం అతి పెద్దది. అలాస్కాను 1867లో రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది. అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రమైన కాలిఫోర్నియాను గతంలో మెక్సికో పై దాడి చేసి అమెరికా వశపరచుకుంది. నెవాడా, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో వంటి రాష్ట్రాల భూభాగాలు మెక్సికో నుంచి అమెరికాకు బదిలీ అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి లూసియానా, స్పెయిన్ నుంచి ఫ్లోరిడాను అమెరికా అప్పట్లోనే కొనేసింది. తన సార్వభౌమత్వానికి, భద్రతకు సవాలుగా భావించే భూభాగాలను అమెరికా కొనేది లేదా సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేది.19వ శతాబ్ధంలో కొనసాగించిన రాజ్య విస్తరణ కార్యక్రమాన్ని 21వ శతాబ్ధంలో కూడా కొనసాగించాలని అమెరికా ఉవ్విళ్లూరుతున్నది. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించాలన్న అమెరికా ఆకాంక్ష ఇందులో భాగమే. డెన్మార్క్ ఒక సార్వభౌమత్వ దేశం.నార్వే, స్వీడన్ దేశాలతో పాటు డెన్మార్క్ కూడా స్కాండినేవియన్ దేశంగానే పరిగణించబడుతోంది. డెన్మార్క్ రాజ్యం స్వీడన్ జర్మనీతో భూసరిహద్దును, స్వీడన్, నార్వే దేశాలతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది. డెన్మార్క్‌లో అనేక ద్వీపాలున్నాయి. ఇందులో “గ్రీన్‌లాండ్…ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని గ్రీన్ లాండ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ట్రంప్ అనుచిత నిర్ణయమే ఇందుకు కారణం. ప్రపంచంలో అతి తక్కువ జనసాంద్రత గల గ్రీన్‌లాండ్ జనాభా సుమారు 57వేల వరకు ఉండవచ్చని అంచనా. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ప్రపంచంలో అతిపెద్ద ద్వీపంగా గ్రీన్ లాండ్ మనుగడ సాగిస్తున్నది. గ్రీన్‌లాండ్‌లో అధిక భాగం ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర అమెరికాలో భాగం. డెన్మార్ ఉత్తరయూరప్‌లో ఉంది. ఉత్తర అమెరికాలోని గ్రీన్‌లాండ్ ఉత్తర ఐరోపాలోని డెన్మార్క్‌లో ఒక స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల ద్వీపంగా కొనసాగుతున్నది. 1953వ సంవత్సరంలో గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌లో విలీన చేయబడి, 1979లో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా స్వీయపాలన చేసుకుంటున్నది. గ్రీన్‌లాండ్ రక్షణ బాధ్యత డెన్మార్క్‌దే. ఇందులో ఇతర దేశాలకు ఎలాంటి ప్రమేయం లేదు. 400లకు పైగా ద్వీపాలున్న డెన్మార్క్‌లో గ్రీన్‌లాండ్‌కు ప్రత్యేక స్థానముంది. గ్రీన్‌లాండ్ భూ`సరిహద్దులు లేని ద్వీపం. ఈ ద్వీపం కెనడా, ఐస్‌లాండ్, నార్వేతో సముద్ర సరిహద్దులను కలిగి ఉంది. రంగురంగుల రమణీయ ప్రకృతి దృశ్యాలతో అలరించే గ్రీన్‌లాండ్ ఒక అద్భుతమైన ద్వీపం. ఇక్కడ వేసవికాలంలో రాత్రి ఉండదు. 24గంటలూ పగలే. ఆర్కిటిక్ వలయంలో ఎనిమిది దేశాల భూభాగాలున్నాయి. అందులో అతి పెద్ద దేశం రష్యా. గ్రీన్ లాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, అమెరికాలోని అలాస్కా, డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్ ఆర్కిటిక్ వలయంలో భూభాగాలను కలిగి ఉన్నాయి. రష్యా ఆర్కిటిక్ వలయానికి దగ్గర్లో ఉన్న దేశం. అమెరికాతో పాటు ఇక్కడ రష్యాకు కూడా సైనిక స్థావరాలున్నాయి. 32సభ్య దేశాలున్న నాటోకు, 27దేశాల యూరోపియన్ యూనియన్‌కు “గ్రీన్ లాండ”ఒక వ్యూహాత్మక ప్రాంతం. గ్రీన్‌లాండ్ గగనతలం, ఆర్కిటిక్ సర్కిల్ అమెరికా భవిష్య భద్రతకు అవసరం. గ్రీన్‌లాండ్‌లోని ఖనిజ సంపద, ఇతర సహజ వనరుల దృష్ట్యా గ్రీన్‌లాండ్ పై అమెరికా కన్నుపడింది. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధి కలిగింది. అమెరికాకు నాటో దేశాలు ప్రస్తుతం మిత్రదేశాలుగా కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో గ్రీన్‌లాండ్ జలాల్లో నాటో విన్యాసాలు జరపకుండా కేవలం తమ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడమే అమెరికా ధ్యేయంగా కనబడుతున్నది. డెన్మార్క్ నాటో, ఈయూలో సభ్యత్వ దేశంగా కొనసాగుతున్నందున డెన్మార్క్‌లో అంతర్భాగమైన గ్రీన్ లాండ్‌ను సహజంగా నాటో, యూరోపియన్ దేశాల్లోను భాగస్వామిగానే పరిగణించవలసి ఉంటుంది. డెన్మార్క్ నియంత్రణ లోని గ్రీన్‌లాండ్ తన దేశభద్రతకు అత్యంత అవసరమని, గ్రీన్‌లాండ్‌ను అమ్మకానికి పెట్టాలని లేకపోతే సైనిక చర్య ద్వారా తాము గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించడం హాస్వాస్పదమైనా ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఒకవైపు రష్యా వలన గ్రీన్‌లాండ్‌కు ముప్పు పొంచి ఉందంటూనే, మరోవైపు గ్రీన్ లాండ్‌ను ఆక్రమించుకుంటామని ట్రంప్ హెచ్చరించడం అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నది. ఇతర దేశాల భూభాగాలపై బరితెగించి విరుచుకుపడడం అమెరికా తెంపరితనాన్ని, సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని చాటిచెబుతున్నది. గ్రీన్‌లాండ్ స్వాధీనానికి సహకరించని దేశాలపై 10శాతం సుంకాలను విధించడం ఈయూ దేశాలు తీవ్రంగా గర్హిస్తున్నాయి. అమెరికా చర్య పట్ల బ్రిటన్, ఫ్రాన్స్ ప్రధానులు బాహాటంగానే ట్రంప్ ను విమర్శించడం జరిగింది. ఇప్పటికే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తమ బలగాలను గ్రీన్‌లాండ్ రక్షణ కోసం అక్కడికి తరలించాయి. తన మిత్ర దేశాలపైనే ట్రంప్ మండిపడడం ప్రతీకార సుంకాలు విధించడం ఆశ్చర్యకరం. ట్రంప్‌తో చెలిమి నిప్పుతో చెలగాటమన్న నిజాన్ని నాటో దేశాలు గుర్తించాయి.అమెరికా లేకపోతే నాటో లేదని ట్రంప్ ఇదివరకే స్పష్టం చేసారు. నాటో లేకుండా చేయడమే ట్రంప్ ధ్యేయంలా కనిపిస్తున్నది. నాటో విచ్ఛిన్నత వలన రష్యా మరింత ఉత్సాహంతో ఉక్రెయిన్ పై విరుచుకుపడి స్వాధీనం చేసుకునే అవకాశాలను తోసిపుచ్చలేం. ట్రంప్‌లాంటి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అమెరికా పౌరులే కాదు, రిపబ్లికన్ పార్టీ సభ్యులే పశ్చాత్తాపపడుతున్నారు. అమెరికా గ్రీన్‌లాండ్ పై సైనిక చర్యకు పాల్పడి, ఆక్రమించుకుంటే ప్రపంచ పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేం. నోబెల్ శాంతి బహుమతి దక్కలేదనే అక్కసుతో రగిలిపోతున్న ట్రంప్ ఇక శాంతి ప్రయత్నాలు చేయబోనని పేర్కొనడం హాస్యాస్పదం. అడుగడుగునా సామ్రాజ్యవాదం, దురహంకారం వంటి మానసిక ఉద్వేగాలతో ఊగిపోతున్న ట్రంప్ శాంతిదూత కాదు, యుద్ధోన్మాది మాత్రమే.
సెల్ : 9704903463

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు