Homeవిశ్లేషణచిన్న దేశమైనా… చెదరని విప్లవ స్ఫూర్తి

చిన్న దేశమైనా… చెదరని విప్లవ స్ఫూర్తి

- Advertisement -

కే. రామకృష్ణ

క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు అరుణ్ ఇటీవల క్యూబాలో పర్యటించారు. ఫిడెల్ కాస్ట్రో శతజయంతి వేడుకల్లో వారు భారత కమ్యూనిస్టు పార్టీల తరఫున పాల్గొన్నారు. ఫిడెల్ కాస్ట్రో, చేగువేరా పేర్లు ప్రపంచవ్యాప్తంగా విప్లవానికి, యువతలో పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయి. అమెరికా నుంచి 140 కి.మీ దూరంలో ఉన్న క్యూబా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి గుర్తుగా మారింది. కాస్ట్రో జన్మించి వందేళ్లు పూర్తైన సందర్భంగా 2026 ఆగస్టు 13న క్యూబా రాజధాని హవానాలో శతజయంతి వేడుకలు నిర్వహించారు. చేగువేరా, రౌల్ కాస్ట్రో వంటి వాళ్లంతా క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించారు. విప్లవానికి ముందు క్యూబాలో బాటిస్టా నియంతృత్వ పాలన ఉండేది. అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేసేది. దేశ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ప్రభావం ఎక్కువగా ఉండేది. క్యూబా విప్లవం 1959 జనవరి 1న బాటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైంది. తర్వాత క్యూబా తన స్వతంత్ర ఆర్థిక విధానాలను అమలు చేయడం ప్రారంభించింది. దేశ అవసరాలకు అనుగుణంగా సొంత ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. క్యూబా విప్లవం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని అనేక వామపక్ష ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడకుండా సొంతంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాలను ఎంచుకుంది. చిన్న దేశమైన క్యూబా అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ తన స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అందుకే ఫిడెల్ కాస్ట్రో, చేగువేరా ఇప్పటికీ విప్లవం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి ప్రతీకలుగా నిలిచారు. విప్లవం తర్వాత ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దాంతో ముందుగా భూసంస్కరణలు చేపట్టింది ప్రభుత్వం. వ్యవసాయ రంగాన్ని పునర్వ్యవస్థీకరించారు. క్యూబా అమెరికా ఆధిపత్యానికి దూరంగా స్వతంత్ర ఆర్థిక విధానాలను అనుసరించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా క్యూబాపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు పెట్టి దిగుమతులు, ఎగుమతులపై పరిమితులు విధించింది. దీనికి ప్రతిగా అప్పటి సోవియట్ యూనియన్ క్యూబాకు చమురు, అనేక అవసరమైన వస్తువులను సరఫరా చేస్తూ సపోర్ట్ చేసింది. వెనిజులా క్యూబాకు ఇంధన సరఫరాకు సహకరించింది. క్యూబా విప్లవం నియంతృత్వ పాలనలో ఉన్న చిన్న దేశాన్ని సోషలిస్టు దేశంగా మార్చేసింది. ఫిడెల్ కాస్ట్రోను సామ్రాజ్యవాద వ్యతిరేక నాయకుడిగా, మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతాలను అనుసరించిన ప్రముఖ విప్లవకారుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించుకున్నారు. క్యూబా విప్లవం తరువాతి కాలంలో వలసవాదం, సామ్రాజ్యవాదం, సైనిక నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. క్యూబా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా నాలుగు రంగాలపై ఆధారపడి ఉంది. అవి శక్తి, ఆహార ఉత్పత్తి, బయోటెక్నాలజీ, రవాణా, దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన కొరత, ఆంక్షల ప్రభావం ఉన్నప్పటికీ ఈ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో క్యూబా పురోగతి సాధించింది. ప్రతి 155 మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. సుమారు 4 లక్షల మంది వైద్య, ఆరోగ్య నిపుణులు 164 దేశాల్లో సేవలందించారు. ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు, అత్యవసర పరిస్థితుల్లో కూడా క్యూబా వైద్య బృందాలు ఇతర దేశాలకు వెళ్లి సేవలు అందించాయి.
వ్యవసాయంలో మార్పులు : గతంలో క్యూబా ప్రధానంగా చక్కెర, పొగాకు వంటి పంటలపై ఆధారపడేది. ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూసారం తగ్గిపోయింది. దీంతో వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఆహారోత్పత్తిని పెంచడం, దేశ ఆహార అవసరాల్లో స్వయం సమృద్ధి సాధించడం క్యూబా ముందున్న ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. క్యూబా ప్రభుత్వం వివిధ రంగాల్లో మొత్తం 176 సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పత్తిని పెంచడం, ప్రజల అవసరాలను తీర్చడం ఇప్పుడు దాని లక్ష్యం. వైద్యంతో పాటు బయోటెక్నాలజీ, విపత్తుల నిర్వహణ, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో క్యూబా అనేక విజయాలు సాధించింది. ఉన్న కొద్దిపాటి వనరులతోనే పరిశోధన, ప్రజారోగ్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
బయోటెక్నాలజీలో ముందడుగు : 2014లో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ బయోటెక్నాలజీ సదస్సుకు హాజరైనప్పుడు ఒక ప్రతినిధి క్యూబా శాస్త్రవేత్తల పరిశోధనల గురించి వివరించారు. క్యూబా శాస్త్రవేత్తలు ఊపిరితిత్తుల కేన్సర్, పిల్లల్లో న్యూమోనియా వంటి వ్యాధులకు వ్యాక్సిన్ల అభివృద్ధిపై పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్జీమర్స్‌ వ్యాధి చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత ఔషధాల అభివృద్ధిలో కూడా క్యూబా పరిశోధకులు ముందడుగు వేసినట్లు వివరించారు. క్యూబా బయోటెక్నాలజీ రంగంలో అభివృద్ధి చేసిన కొన్ని ఔషధాలు, వ్యాక్సిన్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. పరిమిత ఆర్థిక వనరులతోనే పరిశోధనలను కొనసాగించడం క్యూబా శాస్త్ర, వైద్య రంగాల ప్రత్యేకత. కోవిడ్ సమయంలో అంతర్జాతీయ వైద్య సహాయం కోవిడ్-19 మహమ్మారి సమయంలో క్యూబా వైద్య రంగం అంతర్జాతీయ సేవలు అందించింది. క్యూబా తన స్వదేశీ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, ఇతర దేశాలకు వైద్య సహకారం అందించింది. క్యూబా తన వైద్య సిబ్బందిని, కర్ఙేయన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు పంపి వైద్య సహాయాన్ని అందించింది. పాశ్చాత్య దేశాల కంపెనీలు వ్యాక్సిన్లను వ్యాపారంగా మారుస్తున్న సమయంలో, క్యూబా పేద దేశాలకు సహాయం చేసింది. అమెరికా ఒత్తిడికి లొంగేది లేదు అన్న క్యూబా విప్లవం విజయవంతమైనప్పటి నుంచి అమెరికా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను కొనసాగిస్తోంది. జాన్ ఎఫ్.కెన్నెడీ కాలం నుంచి మొదలైన ఈ ఆంక్షలు ట్రంప్ ప్రభుత్వం వరకు కొనసాగుతున్నాయి. ఇంధనంపై ఆంక్షలు, చమురు కొరత కారణంగా క్యూబాలో విద్యుత్ సరఫరా దెబ్బతింది. తరచూ విద్యుత్ కోతలు జరుగుతున్నాయి. ఇంధనం లేక రవాణా వ్యవస్థ సంక్షోభంలో ఉంది. నీటి సరఫరాపైనా ప్రభావం పడుతోంది. పాఠశాలలు, ఆసుపత్రులు ఇంధన కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పర్యాటక రంగంపైనా ఈ పరిస్థితి ప్రభావం చూపుతోంది. గతంలో సోవియట్ యూనియన్ క్యూబాకు చమురు సరఫరా చేసేది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత వెనిజులా క్యూబాకు ఇంధన వనరుగా మారింది. హ్యూగో చావెజ్ నాయకత్వంలోని వెనిజులా రోజుకు 1.10 లక్షల బ్యారెళ్ల చమురును క్యూబాకు సరఫరా చేసేది . అయితే వెనిజులా ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ సహాయం కూడా తగ్గిపోయింది. క్యూబా జనాభా 90 లక్షలు మాత్రమే. అమెరికాలోని మియామీకి క్యూబా 140 కి.మీ.దూరంలో ఉంది. ఇంత చిన్న దేశం అమెరికా వంటి అగ్రరాజ్యానికి దశాబ్దాలుగా ఎదురొడ్డి నిలబడింది. అమెరికా గతంలో క్యూబా విప్లవాన్ని బలహీనపరచడానికి, ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ‘నిన్న గాజా… నేడు ఇరాన్… రేపు క్యూబా’ అనే హెచ్చరికలకు,అమెరికా ఒత్తిళ్లకు క్యూబా ప్రజలు తలొగ్గేదే లేదని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను 51వ రాష్ట్రంగా మారుస్తామనడం, గ్రీన్ల్యాండ్‌పై ఆసక్తి చూపించడం, వెనిజులాపై జోక్యం చేసుకోవడం వంటివి అమెరికా విస్తరణవాదానికి అద్దం పడుతున్నాయి, అంతర్జాతీయంగా భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ట్రంప్ విధానాలపై విమర్శలు : క్యూబా విషయంలో అమెరికా ప్రస్తుత విధానాలను వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాలు అమెరికా ఒత్తిడికి లోబడుతున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీలు విమర్శిస్తున్నాయి. క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు, వాణిజ్య నిషేధాల విషయంలో భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరుతున్నారు. 2026 ఆగస్టు 7-8 తేదీల్లో హవానాలో 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల సమావేశం జరిగింది. 48 దేశాల నుంచి 68 రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా, వియత్నాం, నమ్ఙీయా, అమెరికా తదితర దేశాల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు. క్యూబాకు సంఘీభావం ప్రకటించడంతో పాటు అమెరికా ఆంక్షలను వారు ఖండించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు అరుణ్ పాల్గొని భారతదేశం నుంచి సేకరించిన మందులను క్యూబా వైద్య బృందానికి అందించారు. క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్-కానెల్ను భారత కమ్యూనిస్టు నాయకులు కలిసి అభినందించారు. క్యూబా ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డియాజ్-కానెల్ “ఆకలితో సార్వభౌమాధికారాన్ని సాధించలేము” అన్నారు. స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఆహారం, ఇంధనం, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలను అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంధన సంక్షోభం వంటి సమస్యలు ఉన్నప్పటికీ క్యూబా ప్రజలు తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటారని కమ్యూనిస్టు పార్టీలు పేర్కొన్నాయి. సామ్రాజ్యవాద జోక్యాలకు, రాజకీయ అస్థిరతకు తాము లొంగబోమని క్యూబా ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు