చీకటి విక్రయాలపై స్పందించాలిప్రభుత్వ తాత్సారం దుర్మార్గం: రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
రాష్ట్రంలో ఎరువుల కొరత నివారించి, చీకటి విక్రయాలు అరికట్టి, రైతాంగానికి ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సోమవారం తలపెట్టిన నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎరువులను సక్రమంగా సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో రైతులను ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తున్నప్ప టికీ.. ప్రభుత్వం తాత్సార వైఖరి అవలంభించడం దుర్మార్గం. యూరియా, డీఏపీ సరఫరా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రైతులు రోడ్డెక్కారు. రైతులకు యూరియా, డీఏపీలు సక్రమంగా అందటం లేదన్నది వాస్తవం. అంతేకాకుండా ఎరువుల కొరతను అవకాశంగా మలచుకుని బ్లాక్ మార్కెటీర్లు విజృంభించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెటంగ్‌ను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎరువుల సమస్య పరిష్కారానికి పూనుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. వాస్తవాన్ని గుర్తించకుండా అవిగో వస్తున్నాయి, దిగుమతి చేస్తున్నాం, సక్రమంగా జరుగుతోందంటూ కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సులతో కాలయాపన చేస్తున్నారు. కింది స్థాయిలో ఎరువులు అందకపోవడం వలన రైతాంగం ఆందోళన బాటపట్టింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎరువులు సక్రమంగా పంపిణీ చేయాలి. సొసైటీలు, రైతు సేవా కేంద్రాల ద్వారా తగినంత ఎరువులు అందించాలి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలి. గత ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు సాగుసాయం రూ.20 వేలు వెంటనే ఇచ్చి ఆదుకోవాల’ని రామకృష్ణ డిమాండ్ చేశారు.


