నాలుగు నెలల కిందట ఇరాన్ మీద ఇస్రాయెల్, అమెరికా జమిలిగా యుద్ధం ప్రకటించిన తరవాత ఇరాన్ ఎదురు దాడులకు తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి మంత్రం జపించడం మొదలుపెట్టారు. పాకిస్థాన్ను మధ్యవర్తిగా ఎంచుకున్నారు. మొత్తం మీద ఏదో ఓ రకంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి నెల కూడా తిరక్కుండానే అదీ ఇరాన్ అగ్ర నాయకుడు అలీ ఖామేనీ అంతిమయాత్ర సాగుతున్న సమయంలో అమెరికా మళ్లీ ఇరాన్ మీద భీకరమైన దాడులు ప్రారంభించింది. అమెరికా ఇలాంటి ఆగడాలకు పాల్పడుతుందని ముందే పసిగట్టిన ఇరాన్ పుట్టెడు శోకంలోనూ అమెరికా దాడులకు దీటుగానే సమాధానం చెప్పింది. కువైత్, బహ్రేన్లోని అమెరికా సైనిక స్థావరాల మీద ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌లోని 90 సైనిక స్థావరాల మీద దాడి చేశామని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. షహీద్ బెహెష్టీ, కలంతరి, చా బహార్ లాంటి చోట్ల అమెరికా మంగళవారం రాత్రి నుంచే బాంబుల వర్షం కురిపిస్తోంది. నెల కింద కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. తాము తలుచుకుంటే ఖామేనీ అంతిమయాత్రలో పాల్గొంటున్న లక్షలాది మందిని ఒక్క దెబ్బతో అంతం చేయగలం అని ట్రంప్ తన రక్త పిపాసను అనుమానరహితంగా వ్యక్తం చేశారు. హోర్మూజ్ జలసంధిలో కూడా ఇరాన్ స్థావరాలపై బాంబులు కురిపించారు. ఖామేనీ మృతదేహాన్ని సమాధి చేయాలనుకున్న మషహద్ మీద కూడా అమెరికా దాడులు చేసింది. ఇరాన్ ప్రభుత్వం సయ్యద్ అలీ ఖామేనీ అంతిమ యాత్రలో నిమగ్నమై ఉంటుందని తెలిసే అమెరికా దాడులు చేసింది. మాయోపాయంతో హోర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యం నెలకొల్పడానికే ట్రంప్ ఈ దాడులకు ఆదేశించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికా కుతంత్రాలు ముందే తెలుసు కనక ఇరాన్ తుపాకీ మీట మీద వేలు తొలగించలేదు. అంతిమయాత్రలో మునిగి ఉన్నప్పటికీ అమెరికా కుతంత్రాల విషయంలో అత్యంత అప్రమత్తంగానే ఉంది.
అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. కొంతమంది ఇరాన్ నేతలు తనకు ఫోన్ చేశారని ట్రంప్ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధం చెప్పారు. అమెరికా బాహాటంగా మళ్లీ దాడులు మొదలుపెట్టినా ఈ యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. కాల్పుల విరామ సమయంలో అమెరికా తన పెట్రోలియం నిలవలను పెంచుకోవాలనుకుంది. అమెరికా దగ్గర ప్రస్తుతం మూడు లక్షల గ్యాలన్ల పెట్రోలియం నిలవలు మాత్రమే ఉన్నాయి. ఇవి రోజు వారీ వాడకానికే సరిపోతాయి. నిలవలు ఇంతకన్నా తగ్గితే అమెరికాలోని పెట్రోలు బంకులు నిండుకుంటాయి. ఈ యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించగలిగిన స్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు. మొన్నటి దాకా అమెరికా ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తోందని ఆరోపించింది. ఇప్పుడు హోర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సడలించడం అణ్వస్త్ర వ్యవహారం కన్నా ప్రధానమైపోయింది. హోర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని ట్రంప్ వాదిస్తున్నారు. మినాబ్లో పాఠశాల మీద దాడి చేసి అమెరికా 150 మంది పసివారిని పొట్టన పెట్టుకోవడం ఏ అంతర్జాతీయ సూత్రానికి అనుగుణమైందో! కానీ ఇరాన్ మీద అన్యాయమైన, అక్రమమైన దాడికి దిగడం, ఇరాన్ అణ్వస్త్రాలు తయారుచేయబోమని ఎన్నిసార్లు చెప్పినా అదే మాటను పదేపదే అనడం చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతటి దుస్థితిలో ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. హోర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సడలించడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. హోర్మూజ్ మీద పట్టు కోసం అమెరికా ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తుందో యుద్ధం అంత ఎక్కువ కాలం కొనసాగుతుంది. ప్రస్తుతానికి హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. హోర్మూజ్‌ను దిగ్బంధం చేస్తామని, ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని, స్తంభింప చేసిన ఇరాన్ నిధులను విడుదల చేయబోమని ట్రంప్ బెదిరిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక సంకటంలో లేదని కాదు. కానీ ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే తత్వం ఇరాన్ ది కాదు అని ఇప్పటికే స్పష్టంగా రుజువైంది. ఇరాన్ వెనిజులా లాంటిది కాదని ట్రంప్‌కు ఎప్పటికి అర్థం అవుతుందో! ఇరాన్ సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉంది. యుద్ధం కొనసాగితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే మాట నిజమే. అందులో భాగంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత క్ష్మీణించక తప్పదు. దీనికి పూర్తి బాధ్యత ట్రంప్ మీదే ఉంటుంది. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రంగానే ఉన్నాయి. కువైత్, జోర్డాన్, బహ్రేన్లోని అమెరికా స్థావరాల మీద ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇంతకుముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద కూడా దాడులు చేసింది. తాజాగా అలాంటి దాడులు చేయడం లేదు. ఎమిరేట్స్, ఇరాన్‌కు మధ్య లోపాయికారీగా ఓ ఒప్పందం కుదిరింది. అందుకే ఎమిరేట్స్ పై ఇరాన్ ఈసారి గురిపెట్టలేదు.
ఈ ఒప్పందంలో భాగంగా తమ భూభాగాలను అమెరికా సైన్యాలు ఉపయోగించడానికి అనుమతించబోమని ఎమిరేట్స్ ఈ ఒప్పందంలో అంగీకరించింది. ఖతార్, సౌదీ అరేబియాతో కూడా ఇరాన్ ఇలాంటి ఒప్పందాలే కుదుర్చుకుంది. దీనితో పశ్చిమాసియా దేశాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు బోల్తా పడ్డాయి. ఇరాన్ యుద్ధతంత్రంలో అమెరికాకు తోడ్పడే దేశాల మీద దాడులు తప్పవన్న బలమైన హెచ్చరిక ఉంది. అమెరికా ఇంకా దాడులు కొనసాగిస్తే తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి విరమించుకుంటామని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. అప్పుడు ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేసినా ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు కాదు. అవసరమైతే ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయాలనుకుంటే సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి రష్యా, ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశం ఇవ్వడం అంటే తేనెతుట్టెను కదిలించినట్టే. అణ్వస్త్రాలు తయారు చేయకూడదని ఖామేనీ ఇదివరలో ఫత్వా జారీ చేసిన మాట నిజమే. కానీ అవసరమైతే ఈ ఫత్వాను రద్దు చేయడానికి ఇరాన్ మత నాయకత్వ వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఇరాన్ మీద విపరీతమైన ఆర్థిక ఒత్తిడి తీసుకు రావడం అమెరికా మొదటి నుంచీ అనుసరిస్తున్న వ్యూహం. చాలా కాలంగా ఇరాన్ మీద ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వ సన్నద్ధంగా ఉంది. నెల కింద కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్‌కు అనుకూలమైన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సారి మరింత ఒత్తిడి తెస్తే ఇరాన్ ఎదుట లొంగిపోవాల్సింది అమెరికానే.
ట్రంప్ రక్త పిపాస
- Advertisement -


