Homeడ్రోన్లు, ఏఐతో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ

డ్రోన్లు, ఏఐతో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ

- Advertisement -

ఏపీ ట్రాన్స్‌కోలో కొత్త అధ్యాయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ ప్రసార వ్యవస్థ పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతికతకు శ్రీకారం చుడుతోంది. విద్యుత్ లైన్లలో తలెత్తే లోపాలను వేగంగా గుర్తించి ముందస్తుగా పరిష్కరించేందుకు డ్రోన్లు, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా 8,500 కిలోమీటర్ల ట్రాన్స్‌కో విద్యుత్ లైన్లపై డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రయోగం విజయ వంతమయింతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న సుమారు 33 వేల కిలో మీటర్ల విద్యుత్ లైన్లను ఇదే విధానంలో పర్యవేక్షించే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ టవర్ల తనిఖీల కోసం గ్యాంగ్‌మెన్‌లు టవర్లు ఎక్కి పరిశీలనలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విధానంలో కొన్ని లోపాలు గుర్తించకుండా మిగిలిపోతున్నాయని అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ల సాయంతో టవర్లు, విద్యుత్ లైన్లను అన్ని కోణాల్లో చిత్రీకరించడం ద్వారా సూక్ష్మమైన లోపాలను కూడా గుర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే టవర్లను పరిశీలించే పరిస్థితి ఉంది. ఒకసారి తనిఖీ చేసిన తర్వాత అదే ప్రాంతంలో మరోసారి సమగ్ర పరిశీలన చేయాలంటే మళ్లీ ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ వ్యవధిలో టవర్‌లోని బోల్టులు వదులవడం, విడిభాగాలు దెబ్బతినడం వంటి సమస్యలు గుర్తించకుండా ఉండిపోతున్నాయి. కొత్త విధానంలో డ్రోన్ల ద్వారా తరచూ పర్యవేక్షణ చేపట్టి ఇలాంటి సమస్యలను ముందుగానే గుర్తించనున్నారు. డ్రోన్లు టవర్లలోని బోల్టులు, యాంగ్యులర్లు, ఎర్త్‌బ్యాండ్లు, ఇన్సులేటర్లు, కండక్టర్ల స్థితిగతులను ఫొటోలు, వీడియోల రూపంలో నమోదు చేసి సర్వర్‌కు పంపిస్తాయి. ఈ చిత్రాలను ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థ పరిశీలించి ఏవైనా లోపాలు ఉన్నాయా, భవిష్యత్‌లో ప్రమాదం తలెత్తే అవకాశాలున్నాయా అనే విషయాలను గుర్తిస్తుంది. కండక్టర్లలో తీగలు దెబ్బతినే పరిస్థితి ఉందా, విడిభాగాలు బలహీనపడ్డాయా వంటి అంశాలను కూడా విశ్లేషించవచ్చు. డ్రోన్లు సేకరించిన సమాచారం మొత్తం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. తదుపరి తనిఖీల సమయంలో కొత్త ఫొటోలను పాత రికార్డులతో పోల్చి మార్పులను గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో టవర్ల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర డేటాబేస్ సిద్ధమవుతుంది. భవిష్యత్‌లో తలెత్తే సమస్యలను ముందుగానే అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకేసారి అనేక కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉండటంతో నిర్వహణ పనులు మరింత సమర్థవంతంగా మారనున్నాయి. ప్రారంభ దశలో సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తరచూ డ్రోన్ పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఈ సాంకేతికతను విజయవంతంగా వినియోగిస్తోంది. అదే తరహాలో ఏపీ ట్రాన్స్‌కో కూడా డ్రోన్లు, ఏఐ ఆధారిత పర్యవేక్షణను అమలు చేయడం ద్వారా విద్యుత్ ప్రసార వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు