డాక్టర్ జీకేడీ ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం తెలుగుభాషపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి మరిన్ని ప్రత్యేక నిధుల్ని సమకూర్చాలని తెలుగు భాషాభిమానులంతా కోరుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తెలుగు భాష నిరాదరణకు గురయిన సంగతి భాషాభిమానులందరికీ ఎరుకే. తెలుగు అధికార భాషాసంఘం, తెలుగు అకాడమీ, ప్రెస్ అకాడమీ స్థానంలో అవతరించిన రాఘవాచారి మీడియా అకాడమీ, సాహిత్య అకాడమీ, ఫిల్మ్, టెలివిజన్, రంగస్థల అభివృద్ధి సంస్థలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రభుత్వ సంస్థల్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. ఆయా సంస్థల అజెండాలను పక్కనబెట్టి జీతాలు తీసుకుంటూ పార్టీ అజెండాను భుజాన మోశారు. ఇదే నీతిమాలిన ఆచరణ అని మేధావి వర్గం గొంతు చించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోగ్య సమస్యలతో ఎక్కువకాలం విదేశాల్లో ఉండిపోయారు. ఎన్టీఆర్ పేరు తొలగించి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టిన సమయంలో ఆయన ఆరోగ్యసమస్యలను పేర్కొంటూ రాజీనామా చేశారు. ఈ సంఘం సభ్యులుగా నియమించిన వృద్ధులదీ అదే పరిస్థితి. జిల్లా కమిటీలు నియమించకుండా తెలుగుభాషకు తీరని ద్రోహం చేసింది ఈ సంఘం. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవిని పార్టీ కార్యకర్త దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి కట్టబెట్టారు. తర్వాత దీని పేరును సి. రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా మార్చారు. 2022లో రాజకీయ అవసరాల కోసం ఈ పదవిలో కొమ్మినేని శ్రీనివాసరావుని నియమించారు. ఆయనతో కూడా ప్రతిపక్షం మీద విమర్శలు చేయించారు. తర్వాత వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా ఆయన కొనసాగలేక రాజీనామా చేశారు. రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నటుడు పోసాని కృష్ణ మురళి నియామకం కూడా ఇటువంటిదే. ఇప్పుడు ఈయన మీద కూటమి ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. ఇదంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలు నాతో చేయించారని ఆయనే స్వయంగా మీడియా, పోలీసులు ముందు ఒప్పుకున్నారు. ఇది గత ప్రభుత్వంలో తెలుగు భాషాభివృద్ధికి చెందిన సంస్థల దుస్థితి. ఇప్పుడు తెలుగు భాషాభివృద్ధికి కొత్త గొంతులు కావాలి. స్వచ్ఛమైన ఆచరణ, ఆవిష్కరణలతో వికసింపజేయాలి.
బ్రిటీష్ పాలకులు ప్రాంతీయ భాషలు, సంస్కృతుల ప్రాధాన్యతను గుర్తించి స్థానిక విద్యావిధానాన్ని రూపొందించారు. వీరి సొంత ప్రయోజనాలు కూడా దీనిలో వున్నాయి. స్థానిక విద్య నాడు భారత ప్రజల సాంస్కృతిక పరిరక్షణ, సాధికారతకు ఒక సాధనంగా పరిణమించింది. 1878 వెర్నాక్యులర్ ప్రెస్ యాక్టు తర్వాత స్థానిక భాషలకు ప్రోత్సాహం లభించింది. చాలా మంది బ్రిటీష్ అధికారులు పట్టుదలగా భారతీయ భాషలను నేర్చుకున్నారు. సి.పి. బ్రౌన్ తెలుగు భాష నేర్చుకొని నిఘంటువు రాశారు. నాటి నుంచి మాండలిక, జానపద విజ్ఞానంతో పాటు తెలుగు భాషాపరంగాను, సాహిత్య పరంగాను ఎంతో వికాసం చెందింది. తెలుగు భాషా, సాహిత్యోద్యమాలు తెలుగు విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయి. తర్వాత వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంతో ఇంగ్లీషు భాష ఆధిపత్యంతో తెలుగుభాష రోజు రోజుకి మసకబారిపోతోంది. దీనికి తోడు గత వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెడుతూ తెలుగుభాష ప్రాభవాన్ని తగ్గించింది.
2008లో తెలుగు ప్రాచీన భాషా హోదా సాధించిన నాటి నుంచి ఏడాదికి కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులు నిర్మాణాత్మకంగా సద్వినియోగం జరిగిన ఫలితాలు కానరావడం లేదు. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించడంతో ముఖ్యంగా విద్యా, పరిశోధన రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావించింది. పురాతన గ్రంథాల సంరక్షణ, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్, అనువాదం, ప్రచురణ, డిజిటల్ మీడియా వంటి రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలకు అవకాశాలు సృష్టించింది. ఈ ఒరవడి సాంస్కృతిక గుర్తింపు, పరిశోధన, సంరక్షణ, పురాతన గ్రంథాలు, నాలెడ్జ్ హబ్‌ల వంటి వ్యవస్థల పునరుజ్జీవాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యాచరణలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం కూడా ప్రధానమైన అంశం. వీటన్నింటినీ నేటి ప్రభుత్వం గుర్తించి మరింత అభివృద్ధికి విధాన రూపకల్పన చేయాలి.
భారత ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో ప్రాంతీయ భాషల పరిరక్షణకు పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం ప్రశంసలు పొందింది. ఈ సందర్భంలో భారతదేశంలోని స్థానిక భాషా మాధ్యమ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చడం వల్ల నష్టాలు కూడా వున్నాయని కొన్ని అధ్యయనాలు హెచ్చరించాయి. మాతృభాషలో బోధన చేస్తే విద్యార్థులు భావనలను సులభంగా అర్థం చేసుకుంటారు. సుపరిచితమైన పదాలు, పదబంధాలు, మాండలికాలు ఉపయోగించి వివరించే అవకాశం వుంటుంది. దీంతో విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సులభమవుతుంది. దేశ వ్యాప్తంగా ఒక స్థాయి వరకు మాతృభాషలను బోధనలో కొనసాగిస్తే భారతీయ భాషల పునరుజ్జీవనం జరుగుతుందని నూతన విద్యావిధానం వివరిస్తుంది.
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తుర్వులు, జీవోలు, న్యాయస్థానాల తీర్పులు తెలుగులో ప్రచురించామని ప్రభుత్వం నుంచి ఏడాదికి ఒకసారి కొన్ని వార్తలు కనబడతాయి. తర్వాత దీని కార్యాచరణ ఎక్కడా కనిపించదు. ఎప్పటికప్పుడు వీటి తెలుగు అనువాద కాపీలను అందుబాటులోకి తీసుకొచ్చి తెలుగు భాష పట్ల అంకితభావాన్ని నిరూపించుకోవాలి. సక్రమంగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణతో మేధోమథనం చేపట్టాలి. తెలుగు పత్రికారచనతో నూతన ఆవిష్కరణలను సృష్టించాలి. తెలుగు సాహిత్యానికి తగిన గౌరవం కల్పించాలి. తెలుగు కళలకు జీవంపోసి ప్రాణప్రతిష్ట చేయాలి. ప్రతి విద్యార్థికి తెలుగు సాంకేతికతలో కంప్యూటర్ శిక్షణ అందించాలి. తెలుగు భాషకు డిజిటల్ సాంకేతిక సామర్థ్యాలను అనుసంధానం చేయాలి. ‘కృత్రిమ మేధ’ అనేది ప్రపంచ మేధావులు ఆవిష్కరించిన గొప్ప సాంకేతిక విప్లవం. దీన్ని ప్రాంతీయ భాషలకు అనుసంధానించి గొప్ప మార్పులు తీసుకురావచ్చు.
ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం,
మొబైల్: 9393111740
2008లో తెలుగు ప్రాచీన భాషా హోదా సాధించిన నాటి నుంచి ఏడాదికి కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులు నిర్మాణాత్మకంగా సద్వినియోగం జరిగిన ఫలితాలు కానరావడం లేదు. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించడంతో ముఖ్యంగా విద్యా, పరిశోధన రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావించింది. పురాతన గ్రంథాల సంరక్షణ, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్, అనువాదం, ప్రచురణ, డిజిటల్ మీడియా వంటి రంగాల్లో విస్తృతంగా ఉద్యోగాలకు అవకాశాలు సృష్టించింది. ఈ ఒరవడి సాంస్కృతిక గుర్తింపు, పరిశోధన, సంరక్షణ, పురాతన గ్రంథాలు, నాలెడ్జ్ హబ్‌ల వంటి వ్యవస్థల పునరుజ్జీవాన్ని ప్రోత్సహిస్తుంది.