చైనాకు ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: ఇటీవలే దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయిన సంగతి విదితమే. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిసిన సందర్భంగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకుడంటూ కొనియాడారు. సమావేశం తర్వాత 10 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో తాజాగా ట్రంప్ చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌పై దాడిచేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఆ దేశ ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. సీబీఎస్ న్యూస్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సైన్యం పాల్గొంటుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ… ‘‘ఇక్కడ నేను ఎలాంటి రహస్యాలు చెప్పలేను. అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం మేం ఏమీ చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు’’ అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం దక్షిణ కొరియా వేదికగా ట్రంప్, జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. రెండు గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. చైనాపై టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. కానీ ఇంతలోనే ట్రంప్ స్వరం మారింది.
పుతిన్, జిన్‌పింగ్‌లు తెలివైన నేతలు…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లిద్దరూ బలమైన, తెలివైన నేతలని, వారిని తక్కువ అంచనా వేయకూడదని ట్రంప్ అన్నారు. పుతిన్, జిన్‌పింగ్‌లలో ఎవరితో వ్యవహరించడం కష్టం? అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. వారిద్దరూ చాలా కఠినమైన, స్మార్ట్ లీడర్స్ అని అభివర్ణించారు. ‘‘చూడండి, వారిద్దరూ చాలా బలమైన నాయకులు. వారితో ఆటలాడకూడదు. వాళ్లను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. వాళ్లు కఠినమైన, తెలివైన నాయకులు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే ఇంటర్వ్యూలో తాను ఎనిమిది యుద్ధాలను ఆపగలిగానని ట్రంప్ పునరుద్ఘాటించారు. కేవలం ఉక్రెయిన్ వివాదాన్ని మాత్రమే తాను ఆపలేకపోయా నని, అయితే అదీ కూడా త్వరలోనే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రష్యా, చైనా దేశాధినేతలతో అణ్వస్త్ర నిరాయుధీకరణ అంశంపై తాను చర్చించి నట్లు ట్రంప్ వెల్లడిరచారు. ఈ రెండు దేశాల వద్ద భారీగా అణ్వాయుధాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. ‘‘అణ్వస్త్ర నిరాయుధీకరణ కోసం మనం ఏదైనా చేయాలని నేను నమ్ముతున్నాను. ఈ విషయంపై నేను పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరి తోనూ చర్చించాను’’ అని స్పష్టం చేశారు.
నైజీరియాపై సైనిక చర్యకు సంకేతాలు
నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఆ దేశంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమన్నారు. వైమానిక దాడులు లేదా నేరుగా అమెరికా బలగాలను పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన కీలక సంకేతాలు ఇచ్చారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. నైజీరియాలో రికార్డు స్థాయిలో క్రైస్తవులను చంపుతున్నారని, దీనిని తాము ఎంతమాత్రం అనుమతించబోమని అన్నారు. సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని తన దళాలను ఆదేశించినట్లు వెల్లడిరచారు. ‘‘నా మదిలో చాలా ప్రణాళికలు ఉన్నాయి. వారు నైజీరియాలో క్రైస్తవులను రికార్డు సంఖ్యలో హత్య చేస్తున్నారు. అలా జరగడానికి మేము అంగీకరించం’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ‘ప్రత్యేక ఆందోళన కలిగించే దేశాల’ జాబితాలో నైజీరియాను చేర్చినట్లు ట్రంప్ గుర్తుచేశారు.
అమెరికా సాయాన్ని స్వాగతిస్తాం: నైజీరియా
అమెరికా హెచ్చరికలపై నైజీరియా కూడా స్పందించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడటానికి అమెరికా సహాయాన్ని స్వాగతిస్తామని, అయితే తమ దేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది. నైజీరియాలో క్రైస్తవులు, ముస్లింల మధ్య ఘర్షణలు 1950ల నుంచి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 2009 తర్వాత బోకో హరామ్, ఫులానీ పశువుల కాపరులు వంటి రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు క్రైస్తవ గ్రామాలను, చర్చిలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. నివేదికల ప్రకారం, ఈ హింసలో ఇప్పటివరకు 45,000 మందికి పైగా క్రైస్తవులు ప్రాణాలు కోల్పోగా, వేలాది చర్చిలు ధ్వంసమయ్యాయి.
తైవాన్‌పై దాడిచేస్తే తీవ్ర పరిణామాలు
- Advertisement -
RELATED ARTICLES


