. ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్షేమంగా దిగిన ‘క్రూ డ్రాగన్’
. అంబరాన్నింటిన సంబరాలు
అంతా అనుకున్నట్లే జరిగింది…నాసా పక్కా ప్రణాళిక విజయవంతమైంది. సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉండిపోయిన శాస్త్రవేత్తలు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్
భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు.
న్యూదిల్లీ: అంతా అనుకున్నట్లే జరిగింది…నాసా పక్కా ప్రణాళిక విజయవంతమైంది. సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉండిపోయిన శాస్త్రవేత్తలు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లను భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. ఐఎస్‌ఎస్ నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3: 27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి… ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో ఐఎస్‌ఎస్ నుంచి బయల్దేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజిన్లను మండిరచి క్రూ డ్రాగన్‌ను భూవాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. దీని ల్యాండిరగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ విజయవంతంగా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. వ్యోమనౌక సేఫ్ ల్యాండిరగ్‌తో నాసా, స్పేస్-ఎక్స్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా పుడమిని చేరినట్లు నాసా ప్రకటించింది. దివి నుంచి భువికి చేరిన వారిలో సునీతా విలియమ్స్, విల్మోర్‌తో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. ఈ వ్యోమగాముల బృందానికి నాసా అభినందనలు తెలిపింది. ఈ యాత్ర సక్సెస్ కావడంలో స్పేస్‌ఎక్స్‌ది అద్భుత పాత్ర అని నాసా కొనియాడిరది. సునీతా విలియమ్స్, విల్మోర్‌లు సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. ప్రశాంత వాతావరణం అనుకూలించడంతో డ్రాగన్ కాప్సూల్ అన్‌డాకింగ్, ల్యాండిరగ్ ప్రక్రియ సజావుగా సాగిందని.. ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని వివరించింది.
ఉల్లాసంగా…ఉత్సాహంగా…
స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటికి వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. అందరికీ హాయ్ చెబుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించారు. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చాలా ఉత్సాహంగా.. ఆనందంగా ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంబరాన్నంటిన సంబారాలు
సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్‌లో అనేక చోట్ల ప్రజలు టపాసులు కాలుస్తూ… మిఠాయిలు పంచుకుని సంబరాలు చేశారు. సునీత పూర్వీకుల గ్రామం గుజరాత్‌లోని రaూలాసన్‌లో ఆమె బంధువులు, గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు, బాణసంచా కాల్చుతూ నృత్యాలు చేశారు. అంతకుముందు ఆమె సురక్షితంగా భూమిని చేరుకోవాలని గ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి యజ్ఞం చేశారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా… సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. మసాచుసెట్స్‌లో 1983లో హైస్కూల్ విద్య, 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో సునీత ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 1997లో మిలటరీలో చేరిన సునీత…30 రకాల విమానాలను 3 వేల గంటలు నడిపిన అనుభవం పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.
రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల అభినందన
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిని చేరుకోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ రంగాలకు చెందిన అనేకమంది హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజలంతా స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకోవటం చాలా సంతోషం. నాసా వ్యోమగాములు విజయవంతంగా భూమికి చేరటానికి కృషిచేశారు. సునీత, ఇతర వ్యోమగాముల పట్టుదల, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. వారి చారిత్రాత్మక యాత్ర సంకల్పం, టీమ్ వర్క్, అసాధారణ ధైర్యానికి ప్రతీక’ అని రాష్ట్రపతి అన్నారు. ‘వెల్‌కమ్ బ్యాక్ సునీత. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు పట్టుదల అంటే ఏంటో మరోసారి ప్రదర్శించారు. వారి అచంచలమైన సంకల్పం కోట్లాది మందికి స్ఫూర్తి. సునీతతో పాటు మిగిలిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన వారిపట్ల గర్వపడుతున్నాం. అభిరుచి, సాంకేతికత కలగలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో వారు చూపించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జితేంద్ర సింగ్ కూడా ఇదేవిధంగా స్పందించారు.
అపూర్వ విజయం: ఇస్రో
‘భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అభినందనలు. అంతరిక్ష కేంద్రం నుంచి 9నెలల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరటం అపూర్వ విజయం. అంతరిక్ష పరిశోధనల విషయంలో నాసా, స్పేస్‌ఎక్స్, అమెరికా నిబద్ధతకు ఈ మిషన్ నిదర్శనం. అంతరిక్ష పరిశోధనల్లో సునీతా విలియమ్స్ అనుభవాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం’ అని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు.
త్వరలో సునీత భారత పర్యటన
సునీతా కుటుంబ సభ్యులు జాతీయ మీడియాతో మాట్లాడుతూ… సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు చేరుకుందని తెలిపారు. అంతేకాకుండా త్వరలో సునీతా విలియమ్స్ భారత్‌లో పర్యటిస్తారని బంధువు ఫల్గుణి పాండ్యా వెల్లడిరచారు.
తిరిగి సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్తారా? లేదా? అనేది ఇంకా తెలియదు అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సునీతాదే ఫైనల్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. సునీతా అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. సునీతా తన 59వ పుట్టిన రోజు సెప్టెంబర్ 19న అంతరిక్షంలోనే జరుపుకుందని… అన్ని క్షేమంగా జరిగేలా చేసిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.