ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరకోస్తాలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా 26, 27, 28, 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం దక్షిణ, ఉత్తర కోస్తాలో ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడిరచింది. వాతావరణ కేంద్రం ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం ట్రింకోమలీకి 600 కిలోమీటర్లు, నాగపట్నానికి 880, పుదుచ్చేరికి 980, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని తెలిపింది. రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం… గడిచిన మూడు గంటల్లోనే 30 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.