Homeధరల మంట

ధరల మంట

- Advertisement -

ధరల మంటసామాన్యుడికి చుక్కలు చూపుతున్న నిత్యావసరాలు
నెలవారీ బడ్జెట్ పెరుగుదలతో ప్రజల బేజారు
పండగల సీజన్‌లో వినియోగదారులు ఉక్కిర్ఙిక్కిరి
ప్రభుత్వం నియంత్రించాలని వేడుకోలు

విశాలాంధ్రబ్యూరో – అమరావతి: శ్రావణమాసం… వరుస పండుగలు… ఇంట్లో పిండివంటలు, పూజా కార్యక్రమాలతో సందడి చేయాల్సిన సమయంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి, పంచదార, బియ్యం, వంటనూనెలు, పప్పులు, వెల్ల్లుి తదితర ధరలు పెరగడంతో కుటుంబ బడ్జెట్ భారీగా పెరిగింది. ఇప్పటికే నిత్యావసరాల ఖర్చు 20 నుంచి 30 శాతం వరకు పెరిగిందని వినియోగదారులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఆందోళన కల్గిస్తోంది. ధరల పెరుగుదలకు వ్యాపారులు ఎల్‌నినో ప్రభావాన్ని కారణంగా చూపుతున్నప్పటికీ, అన్ని రకాల సరుకుల ధరలు ఒకేసారి పెరగడంపై వినియోగదారులు ఉక్కిర్ఙిక్కిరి అవుతున్నారు. గత సీజన్లలో పండిన ధాన్యం అమ్మకాలు ఈ ఏడాది మే, జూన్‌లో పూర్తయ్యాయి. అధిక శాతం ధాన్యం తమ వద్దకు చేరిన సమయంలోనే ఎల్‌నినో ప్రభావం మొదలైందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో కిలో రూ.55 వరకు ఉన్న బియ్యం ధర రూ.65 నుంచి రూ.69కి చేరింది. కొన్ని బ్రాండెడ్ రకాల ధరలు మరింత పెరిగాయి. 26 కిలోల బస్తా గతంలో రూ.1,300 ఉండగా… ప్రస్తుతం రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సూపర్ఫైన్ బియ్యం కిలో రూ.73 వరకు పలుకుతోంది. ఫలితంగా ఒక్కో కుటుంబంపై బియ్యం రూపంలోనే నెలకు సగటున రూ.500 వరకు అదనపు భారం పడుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రైతుబజార్లు, మిల్లుల వద్ద తక్కువ ధరలకు బియ్యం విక్రయాలు ప్రారంభించింది. పంచదార ధరలు సైతం వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం కిలో రూ.50 లోపు ఉన్న పంచదార ధర ప్రస్తుతం రూ.71 వరకు చేరింది. బ్రాండెడ్ సంస్థలు కిలో రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయిస్తున్నాయి. బెల్లం ధర కూడా కిలో రూ.90 నుంచి రూ.100కు చేరింది. బెల్లం పొడి, బెల్లం పలుకుల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. శ్రావణమాసంలో పిండివంటలు, పండుగల నేపథ్యంలో చక్కెర, బెల్లం వినియోగం పెరగడంతో ఈ ధరల ప్రభావం కుటుంబాలపై మరింత పడుతోంది. ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.55 పలుకుతుండగా, నాణ్యమైన రకానికి రూ.60 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఏప్రిల్‌లో కిలో రూ.20గా ఉన్న ధర జులైలో రూ.37కి చేరి… ఆగస్టు చివరికి రూ.55కు పెరిగింది. సాధారణంగా కర్నూలు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి మార్కెట్‌లకు వస్తుంది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాధారణ విస్తీర్ణంలో మూడో వంతు మాత్రమే సాగు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో ఉల్లి గడ్డ దిగుబడి గణనీయంగా తగ్గింది. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రోజుకు సుమారు 100 లారీల ఉల్లి వస్తుండగా… ప్రస్తుతం నాలుగైదు లారీల సరకు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధరలు కనిష్ఠంగా రూ.2,351, గరిష్ఠంగా రూ.4,159 వరకు పలుకుతున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపైనా ధరల ప్రభావం పడుతోంది. వేరుశనగ ధరలు కూడా మండుతున్నాయి. కిలో రూ.185కు పైగా ఉండగా… నాణ్యమైన బ్రాండెడ్ రకాలు రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వేరుశనగ సాగు భారీగా తగ్గింది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కలిపి 3.45 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఇది కేవలం 35 శాతమే కావడంతో రానున్న రోజుల్లో వేరుశనగ ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెల ధరలూ సామాన్యుడికి భారంగా మారాయి. వేరుశనగ నూనె కిలో రూ.185 నుంచి రూ.190 మధ్య పలుకుతోంది. పొద్దుతిరుగుడు నూనె ధర రూ.180 నుంచి రూ.185కు చేరింది. పామాయిల్ కిలో రూ.160 వరకు పెరిగింది. గతంతో పోలిస్తే వంటనూనెల ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరిగాయి. కందిపప్పు కిలో రూ.164 వరకు చేరింది. వెల్ల్లుి కిలో రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. పండుగల సీజన్ ప్రారంభమైన వేళ నిత్యావసరాల ధరలు ఇలా వరుసగా పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఆదాయం పెరగకపోయినా వంటింటి ఖర్చులు 20 నుంచి 30 శాతం వరకు పెరగడంతో నెలవారీ బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారిందని వినియోగదారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలను గుర్తించి ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు