కేవీవీ ప్రసాద్
రాష్ట్రంలో మిర్చి రైతాంగం మరోమాటలో చెప్పాలంటే వివిధ పంటలు సాగు చేసే రైతులంతా నిరాశలో వున్నారు. మార్చి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రతినిధిబృందం గుంటూరులోని మిర్చి యార్డును సందర్శించి, మిర్చి అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించింది. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన రైతులు యార్డుకు మిర్చి తెచ్చారు. , వ్యాపారులు వచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వివరాల ప్రకారం 1,82,384 బస్తాల(టిక్కీలు)తో 72,953.60 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు చేరింది. యార్డు మొత్తం మిర్చి బస్తాలతో, రైతులతో నిండి వుంది. రైతుసంఘ ప్రతినిధి బృందం ఏ రైతును కదిలించినా మార్కెట్ స్థితి బాగాలేదు. గిట్టుబాటు కాదు. ఉత్పత్తి ఖర్చులు ఏ ఏటికాయేడు పెరుగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి సరుకు తెచ్చి తిరిగి తీసుకువెళ్లలేం కదా… ధర వచ్చిన కాడికి ఇచ్చిపోవటం తప్ప అంటూ నిరాశ వ్యక్తపరిచారు. మరో పక్క ప్రస్తుతం ధర కొంతమేర ఆశాజనకంగా వుంది. మరింత పెరిగే అవకాశం వుందంటూ వ్యాపార వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. యార్డులో కమీషన్ ఏజెంట్ల దోపిడీ మరొక రకం. మార్కెట్ నిబంధనల ప్రకారం రైతుల నుంచి కమీషన్ ఏజెంట్లు 2 రూపాయలు వసూలు చేయాలి. ఇక్కడ కమీషన్ ఏజెంట్లదే ఇష్టారాజ్యం. హమాలీ చార్జీలు, సరుకు దింపుడు కూలి, సరుకు కాపలా కూలి పేర్లతో నిబంధన ప్రకారం 29 రూపాయలు పేమెంట్ కింద ప్రతి బస్తాకు 4.23 రూపాయలు వసూలు చేయాలి. రైతుకు పై రేట్లు తెలియవు. అవి వ్యవసాయ మార్కెట్ కమిటి వారి ఫైళ్లలో నిక్షిప్తమై వుంటాయి. ఇవి కాక రైతు తమ సరుకు నింపుకుని తెచ్చే గోతం ఖరీదు బయట మార్కెట్‌లో 50 నుంచి 65 వరకు వుంటుంది. రైతుకు చెల్లించేది మాత్రం కేవలం 25.00 రూపా యలు మాత్రమే. ఈ రకంగా రైతులు అడుగడుగునా దగాకు గురవుతున్నారు. మచ్చు పేరుతో 7 రూపా యలు వసూలు చేస్తారు. అంటే ప్రస్తుతమున్న రేటులో అరకిలో కాయలు మచ్చు కింద పోతాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీవారు అందించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీన 96,123 బస్తాలలో 38,451 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. కామన్ వెరైటీల మోడల్ ధర రూ.12,200 నుంచి 13,700 వరకు పలికాయి. స్పెషల్ వెరైటీల మోడల్ ధర రూ. 10,700 నుంచి 14,000 వరకు పలికాయి. తాలు కాయలలో కామన్ రకం రూ. 5,000 నుంచి 7,000 వరకు, స్పెషల్ వెరైటీ రూ. 5,500 నుంచి 7,000 వరకు ధర పలికాయి. అదేవిధంగా మార్కెట్‌లోకి మార్చి 3న 1,82,384 బస్తాల్లో 72,953.60 క్వింటాళ్ల సరుకు వచ్చింది. కామన్ వెరైటీ రకాలు 12,000 నుంచి 13,900 రూపాయల వరకు, మోడల్ ధర, స్పెషల్ వెరైటీ రకాలు 10,700 నుంచి 14,000 రూపాయల వరకు ధర పలికాయి. తాలు వెరైటీలో కామన్ రకాల మోడల్ ధర రూ. 6,500 నుంచి 6,700, స్పెషల్ వెరైటీ రకాల మోడల్ ధర రూ. 6,000 నుంచి 6,800 వరకు ధర పలికాయి. మార్చి 3న మార్కెట్‌కు అదనంగా సరుకు వచ్చినా ధర తగ్గలే దని, నిలకడగా వుందంటున్నారు వ్యాపార వర్గాలు, మార్కెట్ కమిటీ అధికారులు. రైతులు మాత్రం ధరపై పెదవి విరుస్తూ నిరాశను వ్యక్తంచేస్తూనే వున్నారు.
మరోపక్క గత 2,3 సంవత్సరాల్లో మంచి ధర వస్తుందనే ఆశతో రైతులు కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేసుకున్న మిర్చి అమ్మకానికి పెట్టడం లేదు. మన మిర్చి ఎగుమతులు చేసే దేశాల్లో ఇటీవల వర్షాలు, వరదలు, తెగుళ్లవల్ల పంట దెబ్బతిన్నందున మన మిర్చికి అధిక ధర వచ్చే అవకాశాలున్నాయని కమీషన్ ఏజెంట్లు, ఎగుమతిదారులు, అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఆశలు కల్పిస్తున్నాయి. ఈ దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాకు 11,781 రూపాయలు రేటు నిర్ణయించి, అంతకు తగ్గితే రైతులకు మద్దతు ధర పథకం పేరుతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణాయక ధర రైతాంగానికి ప్రస్తుత దశలో ఏమాత్రం ఆమోదంగా లేదు. 202324 సంవత్సరాల్లో వున్న ధరలు, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల నష్టాలు బేరీజు వేసి కనీసం రూ.18,000 నుంచి 20,000 మోడల్ ధర వుండేలా ప్రభుత్వం ధర నిర్ణయించి, సిండికేట్‌గా వ్యవహరిస్తూ ధరలతో పాటు, యార్డులో వివిధ అంశాల్లో నష్టపరుస్తున్న వ్యాపార వర్గాల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలని రైతాంగం రైతు సంఘ ప్రతినిధి బృందం ముందు తమ ఆవేదనతో కూడిన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్‌కు సంబంధించి ఎటువంటి నిబంధనలు ప్రకటించలేదు. ప్రస్తుతం తాలుకాయ రకాలు మినహా అన్ని రకాలు ప్రభుత్వం ప్రకటించిన ధరకన్నా కొంతమేర పెరగటంతో పథకం ప్రయోజనం ఏమాత్రం లేదు. మన రాష్ట్రంలో పంట సాగు తగ్గడం, ఇతర దేశాలకు ఎగుమతి అవకాశాలున్నా రేటు పెరగాల్సినంత పెరగకుండా వ్యాపారుల సిండికేట్ అడ్డుకుంటున్నదనే వాదన లేకపోలేదు. ఈ స్థితిలో రైతులకు మంచి ధర లభించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలి. సకాలంలో జోక్యం చేసుకుని వ్యాపారులు, ఎగుమతిదారులతో సమీక్షలు నిర్వహించాలి. విదేశాల ఆర్డర్లు పొందే అవకాశాలు అన్వేషించాలి. రైతులకు ప్రయోజనం కలుగచేయాలి. లేకుంటే రైతులు పంట అమ్ముకున్న తర్వాత ఫలితాలు వ్యాపారులకు దక్కుతాయి. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్‌లో తమకు సరుకు అమ్మిన రైతుల వివరాలు 2024 డిసెంబర్ 1 నుంచి రైతు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తదితరాలు అందించాలని మార్కెటింగ్ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నట్లు కమీషన్ ఏజెంట్లు తెలిపారు. రైతులు సదరు వివరాలు అందించకపోవడం సమస్యగా వున్నందున వ్యవసాయ అధికారుల ద్వారా ఈ
క్రాప్ నమోదు పత్రాలు పొందాలే కానీ, తమను ఇబ్బంది పెట్టరాదని వారంటున్నారు. అనేక సంవత్సరాలుగా వున్న మిర్చియార్డు ప్రస్తుతం రైతాంగ అవసరాలకు తగినట్లుగా లేదు ఇరుకుగా ఉంటుంది. మార్కెట్‌యార్డులో షాపుల కోసం 683 మంది లైసెన్స్ హోల్డర్లు ధరఖాస్తు చేసుకుంటే 624 మందికి మాత్రమే మార్కెటింగ్ శాఖాధికారులు షాపులు కేటాయించారు. మరో 51 మంది ధరఖాస్తులు పెండిరగ్‌లోనే ఉన్నాయి. సరుకు అధికంగా వచ్చిన రోజుల్లో షాపులవారు, రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. కనీసం యార్డులో నడిచేందుకు కూడా ఖాళీ ఉండదు. బయట నుంచి మార్కెట్‌లోకి వచ్చిన వాహనాలు తిరిగేందుకు మిర్చిని లోడిరగ్, ఆన్‌లోడిరగ్ చేసి రవాణా చేసేందుకు తగిన సౌకర్యాలు లేవు. ప్రస్తుతం రైతుల, వ్యాపారుల ఆవసరాల రీత్యా విశాలంగా ఉండే విధంగా మార్కెట్ యార్డు నిర్మాణం చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు అనేక సంవత్సరాలుగా వాగ్ధానాలు చేస్తున్నా ఆచరణలో కొత్త యార్డు నిర్మాణం ఆలోచనలోనే నిలిచిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆర్భాటపు ప్రకటనలు మాని రైతులకు మంచి ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలి. ఏ పంట వేసినా ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుకు దక్కేది కష్టాలు కన్నీళ్లేననే భావన రైతాంగానికి వుంది.
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం