డీఎస్సీ వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్
. 44కు పరిమితం చేయడంతో వేలాది మందికి అన్యాయం
. రోజుల వ్యవధిలో అర్హత కోల్పోతామని ఆందోళన
. ఆరేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీకి వయోపరిమితి విధించడంపై నిరుద్యోగులు కలవరం చెందుతు న్నారు. జనరల్ అభ్యర్థులు… 47 ఏళ్ల వరకు సడలిస్తారన్న ఆశతో ఉన్నప్పటికీ పాత పద్ధతిలో 44 ఏళ్లకే సరిపెట్టడంతో వారంతా డీలా పడుతున్నారు. ఈనెల 20న కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వయోపరిమితిని యథాతథం గానే ఉంచారుగానీ ఎలాంటి పెంపుదల లేదు. గతంలో జనరల్ అభ్యర్థులకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని యథాతథంగానే అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారననీ, ఇందులో కొత్తదం ఏమీ లేదని వాపోతున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు డీఎస్సీ ప్రకటించలేదు. చివరి దశలో 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు న్యాయపరమైన చిక్కులు తలెత్తడం… అనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌తో నిలిచిపోయింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతేడాది జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి… మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశారు. అప్పటి నుంచి నోటిఫికేషన్ విడుదలకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఆదివారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సంతకం చేసిన దాదాపు 11 నెలల తర్వాతగానీ ఈ డీఎస్సీ నోటిఫికేషన్ కార్యరూపం దాల్చలేదు. ఏడాదిపాటు అభ్యర్థులు వయోపరిమితి కుదించుకుపోయింది. అదే సమయానికి దాదాపు 44 ఏళ్లకు నెలలు, రోజులతో దగ్గరగా ఉన్న అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. వారంతా సీఎం సంతకం చేసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని, దరఖాస్తు చేసుకోవచ్చన్న ఆశతో నిమగ్నమయ్యారు. ఆ నోటిఫికేషన్ కాస్తా…11 నెలల జాప్యంతో రావడం వల్ల వయోపరిమితి నెలలు, రోజుల్లో ఉన్న వారంతా దరఖాస్తు చేసే అర్హతను కోల్పోతామన్న ఆందోళనతో ఉన్నారు.
నియామక ప్రక్రియపై అనుమానాలు…
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు వచ్చినప్పటికీ… వాటి భర్తీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా నోటిఫికేషన్‌ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతుందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీని చిత్తశుద్ధ్దితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. 11 నెలలుగా వాయిదాల మీద వాయిదాలు వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం వంటి సంఘటనలతో… ఇచ్చిన నోటిఫికేషన్ అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం నాటికి… అనగా జూన్ ఒకటో తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్‌లను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. ఈనెల 20న నోటిఫికేషన్, జూన్ ఆరు నుంచి జులై ఆరో తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడిరచింది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని షెడ్యూలులో స్పష్టం చేశారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు మేలో ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో 16,347 పోస్టులను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని వెల్లడిరచింది. దీని ఆధారంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడతాయి. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో పేరుకుపోతాయి. సెప్టెంబరు వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్థులు నష్టపోతారు. 11 నెలల కింద ప్రకటించిన 16,347 ఖాళీలతోనే డీఎస్సీ ప్రకటించడం తగదని, ఇటీవల అయిన ఖాళీలను వాటికి కలపాలని, డీఎస్సీ ఫలితాల తర్వాత పోస్టుల భర్తీ తేదీలనూ ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఏటా పడిగాపులే…
ప్రతేటా డీఎస్సీ కోసం నిరుద్యోగులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో బీఈడీ, డీఎడ్, భాషా పండిత కోర్సుల్లో అభ్యర్థులు శిక్షణ పొంది… డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వేచిచూస్తుంటారు. ఆయా ఉపాధ్యాయ కోర్సులు పూర్తయిన వెంటనే… ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్)కు సిద్ధమవుతారు. అందులో అర్హత సాధించిన వారంతా డీఎస్సీ పరీక్షలపై దృష్టి పెడతారు. ఒక లక్ష్యంతో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసిన వారిలో అత్యధికంగా…ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులే పొందాలన్న లక్ష్యంతో ఉంటారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ప్రతేటా డీఎస్సీ అనే హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని జాప్యం చేయడంతో వారి వయోపరిమితి మించి పోతోంది. 2018 డీఎస్సీ తర్వాత ప్రస్తుతం…2025లోనే డీఎస్సీ భర్తీ ప్రక్రియకు ప్రకటన వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ఇవ్వకపోవడం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడంతో దాదాపు ఆరేళ్లపాటు అభ్యర్థుల వయోపరిమితి కుందించుకుపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు వయోపరిమితి పెంచాలని నిరుద్యోగ సంఘాలు, అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీకి 47 ఏళ్ల వయోపరిమితి పెంచాలని ఇటీవల సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి…జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.