Homeఅంతర్జాతీయంపుతిన్‌ నిరాశపరిచారు

పుతిన్‌ నిరాశపరిచారు

- Advertisement -

రష్యాపై ఆంక్షలకు బ్రిటన్‌ అంగీకారం
చమురు కొనుగోళ్లు ఆగితేనే యుద్ధానికి తెర: ట్రంప్‌

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనను నిరాశపరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘ఆయన నన్ను బాగా నిరాశపరిచారు. అనేక మందిని చంపుతున్నారు. అంతకంటే ఎక్కువగా సొంత వాళ్లనూ కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌తో పోల్చుకుంటే రష్యా సైనికులే అధికంగా మరణిస్తున్నారు’ అని తెలిపారు. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడం అనుకున్నంత సులువు కాదని ట్రంప్‌ అంగీకరించారు. అయితే అధ్యక్షుడి స్థానంతో తాను ఉంటే యుద్ధం మొదలయ్యేదే కాదని మళ్లీ చెప్పుకున్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే దిశగా రష్యాపై ఆంక్షలు విధించేందుకు బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ అంగీకరించారని ట్రంప్‌ వెల్లడిరచారు. భారత్‌ మిత్రదేశమని, ప్రధాని మోదీ మిత్రుడన్నారు. ‘భారత్‌తో మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి కానీ నేను ఆంక్షలు విధించాను’ అని తెలిపారు. ట్రంప్‌ తన బ్రిటన్‌ పర్యటనను ముగించుకొని అమెరికాకు తిరిగి వెళ్లే క్రమంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘ఈయూ, నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం గురించి ప్రస్తావించినప్పుడు స్టార్మర్‌ కాస్త ఇబ్బందిపడ్డారు. కానీ నాతో ఏకీభవించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో సహా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు అంగీకరించారు’ అని వెల్లడిరచారు. ఉక్రెయిన్‌లో శాంతికి చమురు కొనుగోళ్లు నిలిపివేయడమే సరైన చర్యగా ట్రంప్‌ తెలిపారు. అలా జరిగితేనే పుతిన్‌ దిగివస్తారని, యుద్ధం ఆపేందుకు అంగీకరిస్తారని అన్నారు. అక్రమ వలసలపై స్టార్మర్‌తో చర్చించినట్లు తెలిపారు. వలసలను అరికట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలని సూచించినట్లు ట్రంప్‌ వెల్లడిరచారు. అదే సమయంలో లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ ప్రపంచంలోనే చెత్త మేయర్‌ అని విమర్శించారు. నేరాలు, వలసల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బ్రిటన్‌ విందుకు సాధిక్‌ ఖాన్‌ గైర్హాజరిపై విలేకరి ప్రశ్నించగా ‘లండన్‌ మేయర్‌ను ఆహ్వానించలేదు. ఆయనను రావద్దని చెప్పా, ఆయన రాకూడదనే అనుకున్నా’ అని ట్రంప్‌ సమాధానం ఇచ్చారు. ఇదిలావుంటే నాలుగేళ్ల కిందట వదిలేసిన అఫ్ఘాన్‌లోని వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవాలని, చైనాకు సమీపంలో అది ఉండటంతో అక్కడ అమెరికా సైన్యాన్ని మోహరించడం ముఖ్యమని ఆయనన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు