Sunday, April 20, 2025
Homeపేదల భూములుతిరిగి ఇచ్చేయాలి

పేదల భూములుతిరిగి ఇచ్చేయాలి

భూ అక్రమాలపై ఐఏఎస్‌ అధికారితో విచారణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌
కబ్జాలను జిల్లా మంత్రుల దృష్టికి తీసుకువెళతాం

విశాలాంధ్ర బ్యూరో – శ్రీ సత్యసాయి జిల్లా : నిరుపేదలకు చెందిన భూములను వెంటనే వారికి తిరిగి ఇచ్చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం పెద్ద బాపనపల్లి తండాలో గిరిజన భూముల కబ్జా విషయం తెలుసుకున్న రామకృష్ణ మంగళవారం ఆ గ్రామం రచ్చబండ వద్ద భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు చెందాల్సిన 200 ఎకరాల భూమిని ముదిగుబ్బ మండల అధ్యక్షులు గోడ్డుమరి ఆదినారాయణ యాదవ్‌ కబ్జా చేశారని పెద్ద బాపనపల్లి తండా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ తాతల కాలం నుంచి ఉన్న భూములను తిరిగి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. రామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలు, అమాయక గిరిజనులకు చెందిన 200 ఎకరాల భూమిని ఆదినారాయణ యాదవ్‌ తమ తమ కుటుంబీకుల పేరుతో ఆన్‌ లైన్‌లో పట్టాలెక్కించుకొని, ఆ భూముల మీద బ్యాంకులో రుణం తీసుకున్నారని విమర్శించారు. ఈ భూములు నిరుపేదలవని, వారి భూములు వారికే చెందాలని అన్నారు. ఇక్కడ జరుగుతున్న భూ అక్రమాలను ఈనెల 7న జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ దృష్టికి తీసుకు వెళతామని తెలిపారు. అలాగే ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ దృష్టికి కూడా తీసుకువెళతామన్నారు. ఈ భూ అక్రమాలపై ఐఏఎస్‌ అధికారితో విచారణ చేపట్టి పేదల భూమి పేదలకే చెందేలా చేయాలన్నారు. భూ కబ్జాలకు సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ భూములు పేదలకు చెందే వరకు తమ పోరాటం ఆగదని, రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. సీపీఐ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రప్ప, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాటమయ్య, చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి, సీపీఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మహదేవప్ప, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, బత్తలపల్లి మండల కార్యదర్శి బండల వెంకటేశ్‌ తదితరులతో పాటు సీపీఐ ముదిగుబ్బ నాయకులు, మండల కార్యదర్శి డాబా రామకృష్ణ, గంగిరెడ్డిపల్లి నాయుడు, చల్లా శంకర, రాధాకృష్ణ, రామంజి, వై.రమేష్‌, మధు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు