Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యలపై పోరుబాట

ప్రజా సమస్యలపై పోరుబాట

- Advertisement -

. మోదీ హయాంలో ఆర్థిక విధ్వంసం
. స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం కండి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

విశాలాంధ్ర-పలాస (శ్రీకాకుళs): ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తున్న వారిని దిమాగీ నకస్ల్స్‌ అంటూ ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో జెన్జీ అయినా, జెన్ ఆల్ఫా అయినా దిమాగీ నకస్ల్స్‌ అన్నా… అన్నీ తామేనని, మోదీ సర్కారు భరతం పట్టడానికి సీపీఐ సిద్ధమైందని ఈశ్వరయ్య హెచ్చరిం చారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో సీపీఐ జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆయన ఆరోపించారు. 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే… మోదీ మాత్రం రూ.200 లక్షల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు. మోదీ హయాంలో రూపాయి విలువ భారీగా క్ష్మీణించిందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. భారీగా అప్పులు చేసినప్పటికీ దేశంలో అభివృద్ధి జరగలేద న్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయని, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. విమానాశ్రయాలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, టెలికాం, పోర్టులు వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ‘దిమాగీ నకస్ల్స్‌’ అంటూ విమర్శించడం సరికాదన్నారు. మోదీ ఏమనుకున్నా యువత, ప్రజలు అన్నింటికీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, సెప్టెంబర్ 1న తలపెట్టిన ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పవన్ కల్యాణ్, లోకేశ్ ప్రధాని మోదీని పొగడటానికే పరిమితమయ్యారని ఈశ్వరయ్య విమర్శించారు. డబల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పటికీ… నదీ జలాల వివాదాలు పరిష్కా రం కావడం లేదని, ఉత్తరాంధ్రను కరవు కోరల నుండి విముక్తి చేసే ఆలోచన చంద్రబాబుకు, లోకేశ్‌కు, పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడటం లేదన్నారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానానికి నిధులు అడగకుండా తమ కుర్చీలు కాపాడుకోవడానికే మోదీ భజన చేస్తున్నారని మండిపడ్డారు.
జిల్లాల విభజన తరువాత శ్రీకాకుళంలో ఐటీడీఏ లేదని, దీనిపై సీపీఐ ఉద్యమాలకు సిద్ధమవు తోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల గొంతుకగా సీపీఐ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్, జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా నాయకులు చాపర సుందర్ లాల్, ఎస్.నారాయణ స్వామి, కొన్న శ్రీనివాసరావు, పి.ఆరేలమ్మ, సనపల నరసింహులు, ఏఐ‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు