Homeఅంతర్జాతీయంఫ్రాన్స్‌లో నిరసనల హోరు

ఫ్రాన్స్‌లో నిరసనల హోరు

- Advertisement -

. దేశమంతటా ‘బ్లాక్‌ ఎవిరిథింగ్‌’ నినాదం
. మాక్రాన్‌ రాజీనామాకు ప్రజల డిమాండ్‌
. అన్ని నగరాల్లో ఆందోళనలు, ప్రదర్శనలు
. వాహనాలకు నిప్పు` 200 మందికిపైగా అరెస్టు

నాంటెస్‌/మాంట్‌పెల్లియర్‌: ఫ్రాన్స్‌ ‘బ్లాక్‌ ఎవిరిథింగ్‌’ నినాదంతో బుధవారం హోరెత్తింది. దేశమంతటా ‘మాక్రాన్‌ రాజీనామా చేయాలి’ డిమాండ్‌ మార్మోగింది. అసమర్థ ప్రభుత్వం గద్దె దిగాలన్న నినాదం వినిపించింది. అన్ని చోట్ల భారీస్థాయిలో ర్యాలీలు జరిగాయి. రహదారుల దిగ్బంధనాలు కొనసాగాయి. టైర్లకు, చెత్తకు నిప్పు పెట్టి ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. దేశం మొత్తం 80వేల మందికిపైగా భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా, 200 మందికిపైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. అనేక చోట్ల పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ప్రణాళికాబద్ధంగా బడ్జెట్‌లో కోతలు పెట్టడానిని నిరసనగా ఫ్రాన్స్‌ దద్దరిల్లింది. పాలక పక్షంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నది. ‘బ్లాక్‌ ఎవిరిథింగ్‌’ ఉద్యమంలో భాగంగా అనేక నగరాల్లో లక్ష మందికిపైగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. చెత్త, టైర్లు తగలబెట్టారు. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు. వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజధాని పారిస్‌లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి రోడ్లపై కొన్ని వస్తువులకు నిప్పంటించారు. 132 మందిని పారిస్‌ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ నగరమైన నాటెస్‌లో రహదార్లపై టైర్లు, చెత్త డబ్బాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మాంట్‌పెల్లియర్‌లో మాక్రాన్‌ రాజీనామా కోసం డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు భారీ బ్యానర్‌ ప్రదర్శించారు. పోలీసులకు, ఆందోళనకారులకు ఘర్షణ జరిగింది. బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. మార్సెల్లె, లయాన్‌ నగరాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. ‘బ్లాక్‌ ఎవిరిథింగ్‌’ నిరసనల క్రమంలో పారిస్‌లో ఆరు వేల మంది పోలీసులను మోహరించగా, దేశమంతటా 80వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో వెల్లడిరచారు. ప్రదర్శనల్లో లక్ష మందికిపైగా పాల్గొన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిరచాయి. ప్రధాని ఫ్రాకోయిస్‌ బేరౌ ఇటీవల పదవి నుంచి తొలగించబడ్డ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. ఇలాంటి సమయంలో ప్రజలు నిరసనకు దిగడంతో దేశ పరిస్థితి జఠిలంగా మారింది. రెండేళ్లలో ఫ్రాన్స్‌కు ఐదుగురు ప్రధానమంత్రులు వచ్చారు. నూతన ప్రధానిగా సెబాస్టియన్‌ లెకోర్నూను అధ్యక్షుడు మాక్రాన్‌ మంగళవారం నియమించిన విషయం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు