Homeబందరులో షిప్యార్డ్

బందరులో షిప్యార్డ్

- Advertisement -
  • రూ.8వేల కోట్లతో నిర్మాణం
  • కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు
  • రూ.22,178 కోట్ల ఎస్‌ఐపీబీ పెట్టుబడులు
  • అమరావతిలో మౌలిక వసతులకు రూ.1,549 కోట్లు
  • ఉద్యోగులు, పెన్షనర్లకు 4,556 వేల కోట్ల డీఏ బకాయిల చెల్లింపు
  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అధ్వర్యంలో మచిలీపట్నం పోర్టులో రూ.8వేల కోట్లతో షిప్యార్డు నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సుమారు 400 ఎకరాల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుతో 3వేల మందికి ప్రత్యక్షంగా, 5వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 65 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశ నిర్ణయాలను సమాచార, గృహ నిర్మాణశాఖా మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణపనులు కొనసాగుతున్న బందరు పోర్టులో జీఎస్‌ఎల్ ఆధ్వర్యాన 8వేల కోట్ల పెట్టుబడులతో బ్రౌన్ఫీల్డ్ నౌకా నిర్మాణం, నౌకా మరమ్మత్తుల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రక్షణ, కోస్ట్గార్డ్ నౌకల నిర్మాణంతో పాటు వాణిజ్య, ఎగుమతి, దిగుమతి కేంద్రాల నిర్మాణాలు చేపడతారు. సుమారు 1.7కిలోమీటర్ల పొడవునా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తారు. ఇటీవల ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన వివిధ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు, 19,739 ఉద్యోగాల కల్పనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని మౌలిక వసతుల కోసం రూ.1,548.98 కోట్లు, శాసనసభ భవన నిర్మాణానికి రూ.661 కోట్లు మంజూరు చేసింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలు, ఇంధనం, ఫుడ్ప్రాసెసింగ్, ఐటీ-ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. మై హోమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ప్రాజెక్టు, కాటర్ఫిల్లర్, దాల్మియా సిమెంట్, అగర్వాల్ ఫౌండరీస్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ తదితర సంస్థల ప్రతిపాదనలకు అనుమతులు లభించాయి. విద్యుత్ రంగంలో 675 మెగావాట్ల సోలార్, విండ్-సోలార్ హైబ్రిడ్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది.
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలు 4,556కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 జూలై నుంచి 2.73 శాతం, 2025 జనవరి నుంచి 1.82 శాతం డీఏ/డీఆర్ మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 2026 జీతం నుంచి నగదు ప్రయోజనం అమల్లోకి రానుంది. బకాయిల చెల్లింపులకు విడతల వారీ విధానాన్ని ప్రకటించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ Uజానాపై మొత్తం ఆర్థిక భారం సుమారు రూ.4,556 కోట్లు పడనున్నాయి.
పోలవరం, హంద్రీ-నీవాకు నిధులు
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో 12 సూపర్ పాసేజీల నిర్మాణాన్ని ప్రస్తుత కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు సమావేశం నిర్ణయించింది. హంద్రీ-నీవా ఫేజ్-2 లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కాలువ లైనింగ్, టన్నెల్ పనులకు రూ.337.90 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్‌కు మరో రూ.125.65 కోట్లు మంజూరు చేసింది.
విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ హామీలు
ఏపీపీఎఫ్‌సీఎల్కు వివిధ రుణాల కోసం ప్రభుత్వం మూడు విడతలుగా 3,500 కోట్ల ప్రభుత్వ హామీలకు కేబినెట్ అంగీకరించింది. అలాగే ఏపీపీడీసీఎల్కు బొగ్గు సరఫరా కొనసాగించేందుకు ఏపీ జెన్కో ఇచ్చిన రూ.250 కోట్ల మధ్యకాలిక రుణానికి పోస్టు ఫాక్టో ఆమోదం ఇచ్చింది.
సోషల్ మీడియా ప్రభావశీలురకు ప్రత్యేక విధానం
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసేందుకు మీడియా ఇన్ప్లుయెన్సర్స్‌ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వేదికల కంటెంట్ క్రియేటర్లను గుర్తించి, ధ్రువీకరించి ఎంప్యానెల్ చేయనున్నారు. అమరావతి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో కొత్త హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, సోలార్, విండ్, బయోగ్యాస్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరుతోపాటు, అమరావతిలో ఎల్‌పీఎస్ రైతులకు కనీస వార్షిక భృతి నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. సహకార చక్కెర కర్మాగారాల ఆర్థిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 62 ఏళ్లకు పెంపునకు ముసాయిదా ఆర్‌డినెన్స్‌కు, కృష్ణా యూనివర్సిటీ మౌలిక వసతుల కోసం 102.85 ఎకరాల భూమి కేటాయింపు, తిరుపతిలో ఇస్కాన్ వేద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రానికి 8.25 ఎకరాల భూమి కేటాయింపులతో పాటు, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో పలు ఫుడ్ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు