గత ఏడాది మే మూడవ తేదీ నుంచి మణిపూర్ మెయితీలకు, కుకీల మధ్య కలహాల్లో అగ్ని గోళంగా మారినా మోదీ చలించలేదు. దాదాపు గత 21 నెలల నుంచి మణిపూర్‌లో అల్ల కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నా, దాదాపు 250 మంది కలహాలకు ఆహుతైనా, 70వేల మంది నిర్వాసితులైనా మోదీకి చీమ కుట్టినట్టయినా లేదు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను పావుగా వినియోగించుకుని మోదీ మెయితీ-కుకీ వర్గాల మధ్య తంపులు పెట్టి పబ్బం గడుపుకున్నారు. అధికారమే పరమావధి అయిన మోదీ హయాంలో రాజకీయాలు ఇంతకన్నా భిన్నంగా ఉంటాయని అనుకోవడం భ్రమ. 2002 గుజరాత్ మారణకాండ సమయంలో మోదీ ఎలా వ్యవహరించారో ఏడాది పై నుంచి మణిపూర్‌లో బీరేన్ సింగ్ కూడా అదే పని చేశారు. బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం మెయితీలకు-కుకీలకు మధ్య చిచ్చు పెట్టారు. ఆ రెండు వర్గాలూ పరస్పర హననంలో పోటీలు పడ్డాయి. నెత్తురు ఏరులై పారింది. మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. అత్యాచారాలకు గురైన మహిళలను నగ్నంగా ఊరేగించారు. దేశమంతా గగ్గోలు మొదలైంది. తరచుగా ప్రపంచాన్ని చుట్టబెట్టి వచ్చే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పదులకొద్దీ ఎన్నికల సభల్లో ప్రసంగించడానికి తీరిక దొరికే మోదీకి అగ్ని గుండంలా మారిన మణిపూర్ వెళ్లడానికి మాత్రం మనసొప్పలేదు. తీరిక దొరకలేదు. ప్రతిపక్షాలు అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించినా ఆయన కిమ్మనలేదు. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. కాదు ఆయన చేత అమిత్ షా రాజీనామా చేయించారు. బీరేన్ సింగ్ సమర్థుడా, అసమర్థుడా అన్న విషయం చర్చనీయాంశం కాదు. కానీ మోదీ, అమిత్ షాకు తెలియకుండా ఆయన ఇన్నాళ్లూ వ్యవహరించారనుకోవడం భ్రమ. ఇప్పుడు బీరేన్ సింగ్ చేత రాజీనామా చేయించడం మణిపూర్ లో కలహాగ్ని చల్లార్చడానికి కాదు. మోదీ పలుకుబడి దెబ్బ తినకుండా చూడడానికే బీరేన్ సింగ్‌ను బలి పశువు చేశారు. ఇటీవల బయటకొచ్చిన బీరేన్ సింగ్ టేపులు ఆయనను బోనులో నిలబెట్టాయి. ఆ సెగ అమిత్ షాకు, మోదీకి కూడా తగలక మానదు. మణిపూర్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రతిపక్షాలు ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ శాసనసభ్యులే ఆయన మీద గుర్రుగా ఉన్నారు. వారు అవసరమైతే తమ ప్రభుత్వం మీద వచ్చే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు బీజేపీ అసలు స్వరూపం బయట పడక తప్పదు. అగ్ర నాయకుడి పరువు పోవడం కన్నా ఒక బంటును బలిపెట్టడమే మేలనుకున్నారు. బీరేన్ చేత రాజీనామా చేయించారు. బీరేన్ టేపులు బీజేపీకి ప్రాణ సంకటంగా తయారైనాయి. ఆ టేపును మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ కు అందచేశారు. ఈ టేపును 2023లో బీరేన్ నివాసంలోనే రికార్డు చేశారంటున్నారు. ఈ టేపులను పరిశీలించిన ట్రూత్ లాబ్ అనే సంస్థ ఆ టేపులలో ఉన్న గొంతు బీరేన్ గొంతుతో 93 శాతం సరిపోలుతోందని తేల్చింది. మణిపూర్ హింసా కాండలో బాంబులను వినియోగించడాన్ని కూడా బీరేన్ అనుమతించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ టేపుల్లో ఉన్నది బీరేన్ గొంతేనని దీని మీద స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కుకీలకు సంబంధించిన మానవ హక్కుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రూత్ లాబ్ ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్.వెంకటాచలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆ ప్రయోగశాల నివేదికలను ఇంతకు ముందు కూడా న్యాయస్థానాలు ఆమోదించాయి. ఈ టేపుల్లో ఉన్న కంఠ ధ్వని 93 శాతం బీరేన్ గొంతుతో సరిపోలుతోందని ఆ ప్రయోగశాల నివేదిక ఇచ్చింది. ఈ టేపుల విషయాన్ని మరో మారు ఖరారు చేయడానికి గత మూడవ తేదీన సుప్రీంకోర్టు అనుమతించింది. ఈసారి ఈ టేపును పరీక్షించే బాధ్యత ప్రభుత్వ అధీనంలోని కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలకు అప్పగించారు.
మణిపూర్ కుంపటి ఆరకపోవడం, బీరేన్ సింగ్ మీద ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయన అధికారంలో కొనసాగడం దుర్లభం అయిపోయింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించాలనుకున్న అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలే మద్దతు ఇస్తే ఆ పార్టీ అగ్ర నాయకుల పరువు మంటగలిసేది. మోదీ ప్రతిష్ఠ చెక్కు చెదరకూడదంటే బీరేన్ సింగ్‌ను బలి పెట్టక తప్పదనుకున్నారు. ఇటీవల మరి కొంత మంది బీజేపీ నాయకులు కూడా బీరేన్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ లో అగ్గి రగులుతున్నా గత 21 నెలల నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనకు దన్నుగానే ఉంది. మెయితీలకు బీరేన్ నాయకుడిగా ఉన్నారు. వారి తరఫున ఆయనే మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్రంలోని రెండు జాతుల వారు కలహించుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు ఒక వర్గాన్ని వెనకేసుకొస్తే ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురవుతుందో మణిపూర్‌లో స్పష్టంగా రుజువైంది. బీరేన్‌ను మరి కొంతకాలం కొనసాగనిస్తే బీజేపీ కుటిల రాజకీయ బండారం బయట పడేది. బీరేన్ నిషేధంలో ఉన్న మెయితీ దళాల మద్దతు కూడా సమీకరించారు. ఆ రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును ఉపసం హరించిన తరవాత మెయితీలు మరీ రెచ్చి పోయారు. మెయితీ దళాలు పోలీసు వాహనాలను కూడా వినియోగించడం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులకు నిదర్శనం. ఇది అరాచకాన్ని ప్రోత్సహించడమే. రాష్ట్రంలోని కుకీల మీద కక్ష కట్టినట్టు ప్రవర్తించడమే. ఈ దళాలు రాష్ట్ర ఆయుధాగారాల నుంచి ఆయుధాలు లూటీ చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా అనుమతించింది. పార్లమెంటు నిండు కొలువులో కేంద్ర హోం మంత్రి ఇప్పటి దాకా బీరేన్ ను సమర్థిస్తూనే వచ్చారు. అంటే బీజేపీ కుత్సిత రాజకీయాల తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బీరేన్ ను వ్యతిరేకించే వారిని సాయుధులైన మెయితీలు బెదిరించారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం, బీజేపీ శాసనసభ్యుల్లో ఎక్కువ మంది మద్దతు ఉన్నంత కాలం బీరేన్ కొనసాగారు. కానీ బీజేపీలోనే బీరేన్ మీద వ్యతిరేకత పెరగడంతో ఆయన చేత రాజీనామా చేయించక తప్పలేదు. బీజేపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రతిపాదించదలచుకున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే దశకు వచ్చేటప్పటికి తమకే ఎక్కడ మోసం వస్తుందోనని భయపడ్డ బీజేపీ అధిష్ఠానం బీరేన్ చేత రాజీనామా చేయించింది. బీరేన్ తొలగినంత మాత్రాన మణిపూర్‌లో శాంతి నెలకొంటుందన్న ఆశ ఎటూ లేదు.