- రాజకీయ ప్రాధాన్యతకు కృషి
- కులగణనతోనే సామాజిక న్యాయం
- సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం
- పండుగ సాయన్న జయంతి సభలో సీఎం రేవంత్
విశాలాంధ్ర – హైదరాబాద్: ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తామని వెల్లడించారు. ఇతర కులాలకూ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రవీంద్రభారతిలో గురువారం పండుగ సాయన్న 174వ జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం… సాయన్న జీవిత చరిత్రను ప్రతిబింబించే పాటలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నిజాం పాలనలో భూస్వాములు పేదల భూములను ఆక్రమించుకుంటుంటే పండుగ సాయన్న వారికి ఎదురొడ్డి నిలిచారని పేర్కొన్నారు. దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలిచారని కొనియాడారు. ధాన్యం పంచడంతో పాటు, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం చేసిన గొప్ప వ్యక్తి సాయన్న అని గుర్తుచేశారు. నిజాం పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పుడు నాటి వనపర్తి మహారాణి పెద్ద మొత్తంలో నిధులు చెల్లించి విడిపించారని తెలిపారు. సాయన్నను అన్యాయంగా హత్య చేసినప్పటికీ, ఆయన మరణించి వందేళ్లు దాటినా నేటికీ నాట్లు, కోతల సమయంలో ఆయన పాటలు వినిపిస్తున్నాయని అన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న వంటి మహనీయుల చరిత్రను గత పాలకులు కనుమరుగు చేశారని విమర్శించారు. వారి సేవలకు గుర్తింపుగా ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కులగణన వల్లే వివిధ సామాజిక వర్గాలు తమ జనాభా, హక్కులపై బలంగా గొంతు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో సరైన గణాంకాలు లేకపోవడంతో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశం ముందుకు సాగలేదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వంటి సంక్లిష్టమైన అంశాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందని, బీసీ కులగణన కూడా చేపట్టిందని వివరించారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీహరి ముదిరాజ్‌కు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చానని, ఎమ్మెల్యే టికెట్‌తో పాటు మంత్రి పదవి కూడా కల్పించానని చెప్పారు. నీలం మధుకు ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజ్‌ల జనాభా ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించుకున్నామని, రాష్ట్ర సంస్కృతి, చరిత్రకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. పండుగ సాయన్న, గద్దర్, అందెశ్రీ వంటి వారు తమ జీవితాలను సమాజం కోసం అంకితం చేశారని కొనియాడారు. బహుజనుల జీవితాల్లో మార్పు రావాలంటే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పండుగ సాయన్న జయంతిని తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముదిరాజ్ సమాజం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ యువత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
ఆర్థికంగా ఎదిగిన ముదిరాజ్ కుటుంబాలు… సమాజంలోని ఇతరులకు కూడా మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. ముదిరాజ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే బీసీ-ఏలో ఉన్న నాయి బ్రాహ్మణులు, గంగపుత్రులు తదితర కులాల హక్కులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీసీ వర్గాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం అవసరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. సామాజిక సమానత్వం, ప్రజల హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కొమురం భీం, దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


