Tuesday, December 24, 2024
Homeభూకబ్జాలపై విచారణ

భూకబ్జాలపై విచారణ

. 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌లు
. రీసర్వేతో తలెత్తిన 2.29 లక్షల భూ సమస్యలు
. రెవెన్యూశాఖ సమూల ప్రక్షాళన
. సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీహోల్డ్‌ భూముల్లో 25,284 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ అవ్వగా, అందులో 7,827 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. వీటిలో జరిగిన అవకతవకల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహా ఎవరి పాత్ర ఉంది, కారకులు ఎవరు, తెరవెనుక ఉన్న వాళ్లు, బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని తేల్చాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. సమీక్షకు మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై అన్ని శాఖలకు సంబంధించి 1,74,720 అర్జీలు రాగా… అందులో 67,928 అర్జీలు కేవలం రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయి. మొత్తం అర్జీలలో 1,32,572 పరిష్కరించగా, ఇందులో 49,784 రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 13,59,805 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారని, వీటిలో 4,21,433 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫ్రీహోల్డ్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరిగిన మొదటి 10 మండలాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి… కారకులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 4,21,433 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూముల్లో జరిగిన నిబంధన ఉల్లంఘనలను కూడా తేల్చాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై సత్వర, పూర్తిస్థాయి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సీిఎం అన్నారు. వినతులు, సమస్యలపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఒక దరఖాస్తు వస్తే దాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని, మొక్కుబడి తంతు కుదరదని స్పష్టం చేశారు. ప్రజలు సులభంగా రెవెన్యూ సేవలు పొందేందుకు అవసరమైన ప్రక్షాళన చేపట్టాలని సీిఎం అభిప్రాయపడ్డారు. ఏ తరహా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారు, ఎంత సమయం తీసుకుంటున్నారు, ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతుందా లేదా అనే అంశాలపై థర్డ్‌ పార్టీ ద్వారా ఆడిట్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చేలా పూర్తిస్థాయిలో శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. పుట్టిన, చనిపోయిన, కుల, ఆదాయ సర్టిఫికెట్‌ వంటి సర్వీసుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా చేయాలన్నారు. రానున్న రోజుల్లో పీడీ యాక్ట్‌, యాంటీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను సమర్థవంతంగా ఉపయోగించి భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలన్నారు. సామాన్య ప్రజలను, పేదలను, బలహీనులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్లు హంతకులతో సమానమన్నారు. రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసి… తద్వారా ప్రజల ఆస్తులు, భూములకు రక్షణ కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు.
12న స్వర్ణాంధ్ర విజన్‌ విడుదల
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నంబర్‌ 1 గా నిలిపేందుకు ఉద్దేశించిన డాక్యుమెంట్‌ విజన్‌ను డిసెంబరు 12వ తేదీన ప్రజల సమక్షంలో విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అధికారులు సిద్ధం చేస్తున్న విజన్‌ డాక్యుమెంట్‌పై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది విజన్‌ డాక్యుమెంట్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం విజన్‌ డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సమీక్షలో సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు