రేపు ఏలూరులో అంత్యక్రియలు
విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం/ఏలూరు : మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల నాని (56) విశాఖలో మంగళవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఏలూరు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆళ్ల నాని ఆకస్మిక మృతి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటు కార్యకర్తలను, అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. అనేక మంది రాజకీయ నేతలు ఆళ్ల నాని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రికి ఆళ్ల నాని భౌతికకాయాన్ని ఏలూరులోని శ్రీరామ్ నగర్ 10వ రోడ్డులో గల స్వగృహానికి తరలించారు. బుధవారం రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఆళ్ల నాని భౌతిక కాయాన్ని స్వగృహం వద్ద ఉంచుతారు. 17వ తేదీ గురువారం ఆయన భౌతిక కాయానికి ఏలూరులోనే అంత్యక్రియలు జరగనున్నాయి.
వైఎస్ అనుచరుడిగా… ఏలూరు ఎమ్మెల్యేగా విజయాలు…
యుక్త వయసులోనే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆళ్ల నాని 1994 లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాగడా గుర్తుపై పోటీ చేసి 5,300 పై చిలుకు ఓట్లు సాధించారు. ఆళ్ల నాని ఉత్సాహాన్ని గమనించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 1999 లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు కేటాయించగా టీడీపీ నేత అంబికా కృష్ణపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆళ్ల నాని పట్టు విడవకుండా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో పాలుపంచుకున్నారు. 2004 లో రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ఆళ్ల నానికి మరో అవకాశం కల్పించడంతో తొలిసారిగా ఏలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్లాది రూపాయలు నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఏలూరు మున్సిపాలిటీని 2005వ సంవత్సరంలో కార్పొరేషన్‌గా చేయించి… కేంద్ర నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా కార్పొరేషన్‌కు వచ్చేలా కృషి చేశారు. 2009 ఎన్నికల్లో ఆళ్ల నాని విజయం సాధించి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్ మరణాంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టారు. 2014 లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2017 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అటుతర్వాత 2019 లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచి… జగన్ హయాంలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా విశేష సేవలందించారు. తర్వాత 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తదనంతరం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆళ్ల నాని ఊహించని విధంగా ఫిబ్రవరి 2025 లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తర్వాత అత్యధిక సమయం విశాఖపట్నంలోని నివాసంలో ఉంటూ వచ్చిన ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గ ప్రజలకు దూరం కావడంతో పాటు ఎటువంటి అధికారిక పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. కేవలం ఆయన ఏలూరు వచ్చినప్పుడే తన అనుచరులు, అభిమానులు కలిసి వెళ్లేవారు.


