కొద్ది రోజుల కింద నరేంద్ర మోదీ దేశవాసులకు మరో సుందర స్వప్నం చూపించారు. వచ్చే 1000 సంవత్సరాలకోసం ఈ దేశం సిద్ధమవుతోందని ఆయన అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, విదేశాలలో దాచిన నల్ల ధనాన్ని నౌకల నిండా నింపుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తాం లాంటి మోదీ హామీలకు పట్టిన గతిని అనుభవ పూర్వకంగా చూసిన ఈ జాతి జనులు వెయ్యేళ్ల స్వప్నాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండే ఆశే లేదు. 2047 వరకు సాధించిన లక్ష్యాలను గురించి కూడా మోదీ కమ్మని కలలు అమ్ముతూనే ఉన్నారు. మోదీ హయాంలో ఆయన అనుకున్నదే చట్టంగా మారుతున్న పరిస్థితి. ఈ దేశంలో భిన్నమైన మతాలు ఉన్నాయని, వాటికి తమ మతాన్ని అనుసరించే, తమ మతం గురించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని మోదీ అంగీకరించరు. అందుకని ఆయన మదిలో ఉన్నదల్లా చట్టం అయిపోతుంది. వక్ఫ్ సవరణ చట్టమే దీనికి ఉదాహరణ. ఈ చట్టం పేద ముస్లింలకు బోలెడు ప్రయోజ నం కలగ జేస్తుందట. పేద ముస్లింల మీద, ముస్లిం మహిళల మీద మోదీ టన్నులకొద్దీ ప్రేమ కురిపిస్తుంటారు. ముమ్మారు తలాక్‌కు అవకాశం లేకుండా చేయడం, ఆ పద్ధతిని అనుసరించిన వారికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష విధించడం లాంటివన్నీ ముస్లిం మహిళల మేలు కోసమేనని మోదీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్ట మహదాశయం కూడా అదేనట. దేశంలోని వివిధ సంస్కృతుల అంశంపై రాజ్యాంగ నిర్ణాయక సభలో కూడా చర్చ జరిగింది. కానీ అవేవీ మోదీకి పట్టవు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని ఆపడానికి ప్రత్యేక చట్టం ఏమీ అక్కర్లేదు. వక్ఫ్ బోర్డుల్లో అవినీతి జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలూ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ముస్లింల, ముఖ్యంగా పేద ముస్లింల ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇవేవీ చాలవట. ఏకంగా వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ ఆస్తులు కాపాడతారట. ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తరవాత కేంద్ర ప్రభుత్వ, బీజేపీ అధికార ప్రతినిధుల వాదన విపరీతంగా ఉంది. ఈ సవరణ చేయడం మత వ్యవహారానికి సంబంధించింది కాదట. అది భూములకు సంబంధించిందట. వక్ఫ్‌కు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కాకుండా, అక్రమంగా అమ్ముకోకుండా మరిన్ని కట్టుదిట్టాలు కావాలట. అయితే గుడ్డిలో మెల్లగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు మీద లోక్‌సభలో, రాజ్యసభలో విస్తృతమైన చర్చకు అవకాశం ఇచ్చారు. ప్రతిపక్షాలు తమ వాదన వినిపించడానికైనా అవకాశం దక్కింది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసే ఔదార్యాన్ని కూడా మోదీ ప్రభుత్వం చూపింది. కానీ ఆ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నాయకత్వం వహించిన బీజేపీ నాయకుడు ఆ కమిటీ కార్యకలాపాల మీద కూడా బుల్డోజర్ నడిపారు. ఒక్కో అంశం మీద కూలంకశంగా చర్చ జరగడానికి అవకాశం లేకుండా చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన అసమ్మతి పత్రాలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికకు జత చేయకుండా జాగ్రత్త పడ్డారు. అసలు వక్ఫ్ బిల్లు అన్న పేరే సుదీర్ఘంగా ఉంది. దాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్మెంటు, ఎఫిసిషియెన్సీ అండ్ డెవలప్‌మెంటు బిల్లు అంటారట. దీన్నీ ఏ భాషలో తర్జుమా చేసినా అర్థంకావడం కష్టమే. వెయ్యేళ్ల సుందర స్వప్నం చూపించడం అంటే మతాన్ని, రాజకీయాన్ని కలగాపులగం చేయకూడదని, రాజకీయ ప్రయోజనాలకోసం మతాన్ని వినియోగించకూడన్న విధానానికి మంగళం పాడడమేనని ప్రజలు గ్రహించకుండా చూడడమే. తమను ప్రజలు ఎన్నుకున్నారు కనక తాము ఏం చేసినా చెల్లుతుందన్న విశ్వాసం మోదీకి అపారంగా ఉంది.
ఈ బిల్లు ముస్లింల మతానికి సంబంధించింది కాదని, ఇది వక్ఫ్ భూములకు సంబంధించిందని నమ్మబలకడంతో ఈ దేశ వైవిధ్యభరిత సంస్కృతికి గండి కొట్టినట్టైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అనుకూల తీర్పులు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారం సంపాదించడానికి ముస్లిం ఓట్లు అవసరమని తెలిసినా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యు), చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్.జె.పి., జయంత్ చౌదరి నాయకత్వంలోని ఆర్.ఎల్.డి. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాయో కూడా ఈ నేపథ్యం నుంచే అర్థం చేసుకోవచ్చు. ఈ నాలుగు పార్టీలు అనువైనప్పుడల్లా వల్లించే సెక్యులర్ పాఠాలకు కట్టుబడి ఉంటే ఈ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో గట్టెక్కి ఉండేదేకాదు. అసలు ఈ బిల్లును ప్రతిపాదించడానికే మోదీ సర్కారు సాహసించేది కాదు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలన్న వితండవాదం సునాయాసంగా నెగ్గేదే కాదు. వక్ఫ్ బిల్లుల ద్వారా వాటి ఆస్తులను, భూములను కాపాడడం మాటేమోగాని మసీదులు, దర్గాల పరిధిలోని ఆస్తుల మీద బీజేపీ కన్నేసిందనేది మాత్రం స్పష్టం. ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నదే మోదీ ప్రభుత్వ అసలు ఎత్తుగడ. ఇది హిందూత్వ ఎజెండాలో భాగమే. ముస్లింలను షరియాను, వారి మతాన్ని అనుసరించకుండా చేసే దాష్టీకంలో భాగమే. ప్రతిపాదిత బిల్లు రాజ్యాంగంలోని 14, 15, 16, 26, 29 అధికరణాలను ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను కూడా అధికారంలో ఉన్న పార్టీ, దానికి ఊతకర్రలు అందిస్తున్న పార్టీలు బుల్డోజర్ కింద నలిపేస్తున్నాయి. గత ఆగస్టులోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అప్పుడూ ప్రతిపక్షాలు ఇది ‘‘కిరాతక’’ చట్టం అని అభ్యంతరం వ్యక్తం చేశాయి. దానికి కంటి తుడుపుగానే సంయుక్త పార్లమెంటరీ కమిటీ లాంటి చర్యలు తీసుకున్నారు. ముస్లింలను ‘‘ఉద్ధరించే’’ పేరుతో మోదీ ప్రభుత్వం ముమ్మారు తలాక్ చట్టం తీసుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్ బిల్లు, వక్ఫ్ సవరణ బిల్లు, శత్రు ఆస్తుల బిల్లును మోదీ ప్రభుత్వం ఇప్పుడు ముస్లింల మెడ మీద కత్తుల్లా వినియోగిస్తోంది. మోదీ వ్యవహార సరళి చూస్తుంటే ప్రతిపక్షాల అభిప్రాయాలకు చోటే ఇవ్వని రీతిలో ఉంది. మోదీకి మద్దతిచ్చే ఎన్డీయేలోని పార్టీల వైఖరీ చూస్తే స్వచ్ఛందంగా మోదీ పాదారవిందాల కింద ఆత్మార్పణ చేస్తున్నట్టుగానే ఉంది. ఎన్డీయే ప్రభుత్వంతో సయ్యాట తెలుగు దేశానికి అలవాటే. అసలు మోదీ పేరును 2013 లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నితీశ్‌కుమార్ అధికారం పట్టుకుని వేలాడడానికి కనీసం రెండు సార్లు పిల్లి మొగ్గ వేశారు. వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం లోక్‌సభలో చర్చకు రావడానికి ముందు పది రోజులుగా తెలుగుదేశం, జేడీ(యు) నాయకులు చేసిన ప్రకటనలకు, తీరా పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ పక్షాలు ప్రదర్శించిన వైఖరికి మధ్య ఏ మాత్రం పొంతనే లేదు. మాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు అని బీజేపీ ప్రకటించి చాలా కాలం అయింది. అంటే 80:20 సిద్ధాంతానికే బీజేపీ కట్టుబడి ఉంది. మోదీ ప్రభుత్వ అసలు లక్ష్యం ముస్లింల ఆస్తులే.