కె. సుబ్బరాయన్, సీపీఐ ఎంపీ
గత 11 సంవత్సరాల మా అనుభవం పాలక వర్గంలో ఉన్నవారు నమ్మదగినవారు కాదని పదే పదే నిరూపించింది. పహల్గాం దాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ ఆ తదనంతరం జరిగిన దాడి నేటి ప్రభుత్వం అస్సలు నమ్మదగినది కాదని రుజువు చేస్తున్నాయి. అధీకరణ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో ఎటువంటి టెర్రరిస్టు, ఉగ్రవాద దాడి జరగలేదని మోదీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నది. కానీ పహల్గాం దాడి ఈ ప్రభుత్వం నిజం చెప్పడం లేదని, ప్రజలకు తప్పుడు సమాచారం మాత్రమే అందిస్తోందని నిరూపించింది. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశానికి సంబంధించి నిఘావర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. అధికారంలో ఉన్న వారందరూ ‘సత్యమేవ జయతే’ అనే బోధనను నిజంగా పాటిస్తే, దాడికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి ఉండాలి. ఆయన రాజీనామా చేయాలి. కానీ, ఆయన రాజీనామా చేయలేదు. పహల్గాంలో టెర్రరిస్టు దాడికి ప్రతిగా భారతదేశం నిర్వహించిన ‘బలమైన,’ ‘విజయవంతమైన’ ‘నిర్ణయాత్మక’ ‘‘ఆపరేషన్ సిందూర్’’పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా జులై 30 ఉదయం అమిత్‌షా లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు సైతం ప్రజాస్వామ్యాన్ని బెదిరించే రీతిలో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లేలా హోం మంత్రి ప్రసంగం ఉంది. లోక్‌సభకు ఎటువంటి వివరణ ఇవ్వడానికి కేంద్ర హోం మంత్రి సభకు రాలేదు. వాదించడానికే ఆయన ప్రయత్నించారు. ఆయన ప్రసంగంలోని స్వరం, ఆయన ప్రసంగం సారాంశం ఈ విషయాన్ని నిరూపిస్తోంది.
ఈ దేశ ప్రజలను రక్షించే సామర్థ్యం మోదీ ప్రభుత్వానికిలేదు. వారి మాటలు, చేతలలోనే ప్రతిదీ స్పష్టమైంది. ప్రతిపక్ష పార్టీలలో బలహీనంగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకోవాలనే వారి కోరిక మనకు ప్రస్పుటమౌతోంది. ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి ఎన్నటికీ ఎటువంటి ఆందోళనాలేదు. మన దేశాన్ని వారు ఎన్నటికీ కాపాడలేరు. తమపై ఎవరి బలవంతంలేదని మన దేశ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి కూడా చెపుతున్నారు. అయితే, ట్రంప్ పదేపదే చెపుతున్నా ఎందుకు ఖండిరచడంలేదో వారికే తెలియాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు తెరిచి సరైన సమాధానం ఎందుకు ఇవ్వడంలేదో కమలం పార్టీ నేతలు చెప్పాలి. మోదీ మౌనంగా ఉండిపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇంత వరకూ ఏమీ చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఎవరికి భయపడుతోందీ, అందుకు కారణమేమిటి?. మోదీ ప్రభుత్వం మన పరిపాలనను అమెరికా పాలకులకు బానిసత్వంగా మార్చిందని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను.
పాకిస్తాన్‌లోని కొన్ని ఉగ్రవాద శిబిరాలపై దాడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, మోదీ ప్రభుత్వం అటువంటి ప్రతిపక్ష పార్టీలపై తీవ్రదాడి చేస్తోంది. ఆ పార్టీల దేశభక్తిపై తీవ్రమైన సందేహాన్ని లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తోంది. తమకు ఇబ్బందికరంగా ఉండే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు కాషాయపార్టీకి చెందిన వారు సహజంగానే ఇష్టపడరు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా పాకిస్థాన్ మద్దతుదారులుగా వారిపై ముద్రవేస్తున్నారు. ఇది అత్యంత విచారకరం. ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నంచేసి ఘోరంగా విఫలమయ్యారు. నేడు అధికారంలో ఉన్న వారు వలస పాలకులకు మద్దతు ఇస్తున్నారు.
వలసవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ద్రవిడ పార్టీలు మాత్రమే పోరాడుతున్నాయి. వీరంతా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని అసమాన త్యాగాలు చేశారు. వలసవాదం, వలస పాలనను వ్యతిరేకిస్తూ, దేశానికి స్వాతంత్య్రం కోసం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు పోరాడుతున్న సమయంలో సైతం వారు మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు దేశభక్తి గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉంది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ గురించి వారు మాట్లాడుతున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా మాట్లాడే నైతిక హక్కు వారికి ఏమాత్రంలేదు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా పండిత్ నెహ్రూ తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని కీర్తి శిఖరాలకు చేర్చారు. కానీ, వారు దుర్మార్గపు ఉద్దేశంతో నెహ్రు పరువుతీయడానికి, నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని నేను దృఢంగా చెప్పదలుచుకున్నాను.
వారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంపై చైనా దురాక్రమణ జరిపినప్పుడు, చైనా కమ్యూనిస్టు దేశమైనప్పటికీ, భారత కమ్యూనిస్టు పార్టీ చైనా చర్యను ఖండిరచిన విషయం విస్మరించలేనిది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశభక్తి ఇదే. మీరు మాకు దేశభక్తిని బోధించే ప్రయత్నం చేయకండి.
(పహల్గాంపై టెర్రరిస్టుల దాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో జులై 29న లోక్‌సభలో కమ్యూనిస్టు పక్ష నాయకుడు సుబ్బరాయన్ చేసిన ప్రసంగం సంక్షిప్తంగా)


