- రూ.1,437 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
- నగరాలతో సమానంగా 29 గ్రామాల్లో సకల సౌకర్యాలు
- సగటు తాగునీటి ప్రమాణం 40 నుంచి 135 లీటర్లకు పెంపు
- జనవరికి ముందు రుణాలు తీసుకున్న రైతులకు లక్షన్నర మాఫీ
- శాఖమూరులో రూ.596 కోట్లతో లైబ్రరీ, భారీ ఆడిటోరియం
- చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాజధాని గ్రామాలకు మహరÝశ పట్టనుంది. అమరావతి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల స్వరూపాన్ని, రాజధానికి భూములిచ్చిన గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశ నిర్ణయాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాకు వెల్లడించారు. రాజధాని నగరంతో పాటు దాని పరిధిలోని 29 గ్రామాలలో అభివృద్ధి పనులను నూరు శాతం పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గ్రామాలు, నగర ప్రాంతాల మధ్య మౌలిక వసతుల్లో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజలకు రోజుకు సగటున 40 లీటర్లు మాత్రమే ఇస్తుండగా, ఇకపై తాగునీటి సరఫరాను నగర ప్రమాణాల ప్రకారం రోజుకు 135 లీటర్లకు పెంచుతున్నామని మంత్రి తెలిపారు. ఈ స్థాయిలో నీటిని నిరంతరాయం అందించడానికి ప్రస్తుతం ఉన్న పైప్లైన్ల సామర్థ్యం సరిపోనందున, కొత్తగా పెద్ద పరిమాణం కలిగిన పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు 29 గ్రామాల్లో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్లు, ఆధునిక వీధి దీపాల కల్పన పనులు వేగవంతం చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం గతంలో మంజూరు చేసిన రూ.904 కోట్లకు అదనంగా మరో రూ.533 కోట్లు కేటాయించామని, దీంతో మొత్తం 1,437 కోట్ల భారీ బడ్జెట్తో 29 గ్రామాలలో 100 శాతం మౌలిక సదుపాయాల కల్పన పూర్తవుతుందని చెప్పారు. రాజధాని నిమిత్తం తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా, కృతజ్ఞతగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగా భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతుల రుణమాఫీ అభ్యర్థనను చంద్రబాబు ఆమోదించారని వెల్లడించారు. ఈ ఏడాది జనవరికి ముందు బ్యాంకు రుణాలు పొందిన రైతు కుటుంబాలకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తింపజేసే ప్రతిపాదనకు సీఆర్డీఏ అథారిటీ అధికారికంగా ఆమోదముద్ర వేసిందని మంత్రి వెల్లడించారు. దీనితో పాటు రాజధాని నగర అనుసంధానతను మరింత పెంచేందుకు తాడికొండ, కంతేరు ప్రాంతాల మీదుగా వెళ్లే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ మీదుగా నగరం వరకు విస్తరించి ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ కింద స్వీకరించడానికి సీఆర్డీఏకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణం విషయంలో శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా వ్యూహాత్మక మార్పులు చేపట్టామన్నారు. గతంలో 54 అడుగులు, 40 అడుగుల రోడ్లలో సీసీ (కాంక్రీట్) రోడ్లు వేయాలని భావించామని, అయితే నల్లరేగడి నేలల స్వభావం, నగర నిర్మాణంలో భాగంగా నిరంతరం తిరిగే భారీ వాహనాల రాకపోకల వల్ల కాంక్రీట్ రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఐఐటీ ఖరగ్పూర్ న్యూఢిల్లీకి చెందిన సీఆర్ఆర్ఐ నిపుణుల కమిటీ సలహా మేరకు రోడ్ల దెబ్బతినకుండా బలాన్ని మరింత పెంచుతూ సీసీకి బదులుగా అధునాతన బీటీ రోడ్లు వేయడానికి సీఆర్డీఏ సమావేశం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. నగరంలో సంస్కృతి, సామాజిక వసతులు, ప్రైవేటు భాగస్వామ్యం పెంచడానికి భారీ కేటాయింపులు చేశారు. శాఖమూరు గ్రామంలో రూ.596 కోట్లతో అగ్రిమెంట్ వాల్యూతో సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, భారీ ఆడిటోరియం, హెచ్ఆర్ బిల్డింగ్స్ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. రాజధాని నగరంలో ప్రజా సామర్థ్యం, వ్యాపార కార్యకలాపాలు పెరిగేలా ‘మిక్స్¦ యూజ్’ పద్ధతిలో ఇళ్లు, ఆఫీసులు, కమర్షియల్ షాపులు కట్టుకోవడానికి వీలుగా పిచ్చుకులపాలెం (7.9 ఎకరాలు), తుళ్లూరు (5 ఎకరాలు), మందడం (12.38, 6 ఎకరాలు), కురగల్లు (6 ఎకరాలు) పరిధిలో గుర్తించిన మొత్తం 42 ఎకరాల స్థలాల్లో డెవలప్మెంట్ కోసం ఆర్ఎఫ్పీ పిలవడానికి అథారిటీ అనుమతించింది. దీనికి తోడు పొరుగునే ఉన్న మంగళగిరి కార్పొరేషన్ భవిష్యత్తు తాగునీటి అవసరాలు తీర్చేందుకు రాజధాని సిటీ నుండి 80 ఎంఎంఎల్డీ నీటిని పంపింగ్ చేసే విధంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ స్థాపన నిమిత్తం 8.5 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో పర్యావరణ రహిత గ్రీన్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఆర్డీఏకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హోటళ్లు, స్కూళ్లు, హాస్టళ్లు వంటి సంస్థలకు కేటాయించిన స్థలాల పక్కన మిగిలి ఉన్న చిన్నచిన్న భూమి బిట్లను ఆయా సంస్థలు కోరినట్లయితే, అమరావతిలోని బేసిక్ ప్రైస్ రూ.4.1 కోట్ల ఆధారంగా కనీసం 250 శాతం కంటే తగ్గకుండా (అంటే ఎకరానికి రూ.10.25 కోట్లకు తగ్గకుండా) నిర్ధారించి విక్రయించే పూర్తి అధికారాలను సీఆర్డీఏకి అప్పగిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.


