ప్రజాధనం వృథాపై విపక్షాల ఆగ్రహం
. ఇది ‘షాక్ పాల్’… కాంగ్రెస్ ఎద్దేవా
. అవినీతి నిరోధక సంస్థను విచారించేదెవరు? టీఎంసీ
. ఆరేళ్లలో సాధించిందేంటి? ప్రశాంత్ భూషణ్
న్యూదిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ ‘లోక్‌పాల్’ సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. నిజాయతీకి మారుపేరుగా ఉండాల్సిన సంస్థ చైర్మన్, సభ్యులు విలాసాలను కోరుకోవటం విమర్శలకు దారితీసింది. ఒక్కొక్కటి రూ.70 లక్షలు విలువ చేసే ఏడు బీఎండబ్ల్యూ కార్లు తమకు కావాలంటూ లోక్‌పాల్ టెండర్లను ఆహ్వానించడంపై విపక్షాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇది లోక్‌పాల్ కాదు ‘షాక్’ పాల్, ‘షౌక్ (విలాసాలు) పాల్’ అన్న విమర్శలు వినవస్తున్నాయి. రూ.5 కోట్లు విలువ చేసే ఏడు బీఎండబ్ల్యూ కార్ల కొనుగోలుకు లోక్‌పాల్ సిద్ధం కావడంపై కాంగ్రెస్ అగ్ర నాయకులు జైరాం రమేశ్, పి.చిదంబరం, అభిషేక్ మను సింఫ్వీు, టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు, నీతి అయోగ్ మాజీ చైర్మన్ అమితాబ్ కాంత్ తదితరులు విమర్శలు గుప్పించారు.
అవినీతిపై భారత్ పోరాటం నేపథ్యంలో పుట్టిన లోక్‌పాల్ నిజ స్వరూపం ప్రజల ముందరకు వచ్చిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. లోక్‌పాల్ సభ్యులు భోగభాగ్యాలు కావాలనడం ఆశ్చర్యంగా ఉందని టీఎంపీ పేర్కొంది. అవినీతిపై విచారణ కోసం ఏర్పాటైన లోక్‌పాల్‌లో జరిగే అక్రమాలపై విచారణ చేపట్టేది ఎవరంటూ ప్రశ్నించింది. మోదీ ప్రభుత్వ లోక్‌పాల్‌ను మట్టిలో కాలిపేశారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేసుకొని మేకిన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లు ఎంచుకోవాలని నీతిఅయోగ్ మాజీ చైర్మన్ అమితాబ్ కాంత్ అన్నారు. మహింద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6 లేదా టాటాకు చెందిన హారియర్ ఈవీ కార్లను ఎంపిక చేసుకోవాలని, ఇవన్నీ ఉన్నతస్థాయి వాహనాలేనంటూ ఎక్స్ మాధ్యమంగా లోక్‌పాల్‌కు సలహా ఇచ్చారు. ఆరేళ్ల చరిత్రలో శిక్షలు విధించిన దాఖలాలే లేవని ప్రశాంత్ భూషణ్ దుయ్యబట్టారు.
‘ఈ కార్లు ఒక్కొక్కటి రూ.70 లక్షల వరకు ధర ఉంటుంది. ఇంతటి విలాసాలు కావాలని లోక్‌పాల్ సభ్యులు కోరడం ఆ సంస్థ ప్రతిష్ఠ`సమగ్రతను దెబ్బతీస్తున్నది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఇది లోక్‌పాల్ కాదు షాక్ పాల్, శోక్ పాల్, షౌక్ పాల్ అంటూ దుయ్యబట్టారు. ‘మన్మోహన్ సింగ్ హయాంలో అవినీతిపై భారత్ పోరు అంటూ అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారానికి తెర తీయగా, అందులో ఆర్ఎస్ఎస్ భాగస్వామి అయింది… అయితే లోక్‌పాల్ నిజరూపం ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. లోక్‌పాల్ ఇప్పటివరకు ఏయే వ్యవహారాలను విచారించింది? ఎంతమందిని అరెస్టు చేసింది? అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘సుప్రీం కోర్టు న్యాయమూర్తులకే సెడాన్ కార్లు ఇస్తుంటే లోక్‌పాల్ చైర్మన్, ఆరుగురు సభ్యులకు బీఎండబ్ల్యూ కార్లు ఎందుకు? ఈ కార్ల కోసం ప్రజాధనం ఖర్చు చేస్తారా? అంటూ పి.చిదంబరం నిలదీశారు. ఈ కార్లను తీసుకోమని లోక్‌పాల్ సభ్యుల్లో కనీసం ఒకరిద్దరైనా తిరస్కరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. లోక్‌పాల్ పార్లమెంటరీ కమిటీ మాజీ సభ్యుడు అభిషేక్ మను సింఫ్వీు స్పందిస్తూ లోక్‌పాల్ వద్ద 8,703 ఫిర్యాదులు పెండిరగ్ ఉన్నాయన్నారు. 24 కేసుల్లోనే విచారణలు జరిగాయని, ఆరు ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ అయ్యాయని గుర్తుచేశారు. ‘రూ.70లక్షలు విలువ చేసే కార్లు అవినీతి నిరోధక వాచ్డాగ్ సభ్యులకు అవసరమా? వీళ్లు ఏం చేశారని… ఫిర్యాదులు పేరుకుపోతుంటే విచారణ అంగుళం ముందుకు కదలని పరిస్థితి లోక్‌పాల్‌లో ఉంది’ అని సింఫ్వీు ‘లోక్‌పాల్ పార్లమెంటరీ కమిటీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నాను. అవినీతి నిరోధక వ్యవస్థ తమ సభ్యుల కోసం బీఎండబ్ల్యూ కార్లు ఆర్డర్ చేయడం ఆశ్చర్యకరం. నిజాయతీగా ఉండాల్సిన వీరు విలాసాలను కోరడం యాధృచ్ఛికం’ అని అన్నారు. లాయర్ ప్రశాంత్ భూషన్ కూడా లోక్‌పాల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌ను చాలా ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ఖాళీగా ఉంచిందని, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. విలాసాలు కోరుకునే వారిని లోక్‌పాల్ సభ్యులుగా నియమించిందని, ఇప్పుడు వాళ్లు రూ.70లక్షల కార్లు కోరుకుంటున్నారని ఎక్స్‌లో దుయ్యబట్టారు. టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ ‘లోక్‌పాల్ కోసం వార్షిక బడ్జెట్ రూ.44.32 కోట్లు. ఇప్పుడు ఏడు బీఎండబ్ల్యూ కార్లను తమ సభ్యుల కోసం కొనేందుకు రూ.5 కోట్ల వ్యయ అంచనా ఉంది. అంటే వార్షిక బడ్జెట్ కేటాయింపుకు 10 రెట్లు అధికంగా ఖర్చు జరుగుతున్నది. లోక్‌పాల్ అవినీతి నిరోధక సంస్థ… కానీ ఆ సంస్థ చేసే అవినీతిపై విచారించేది ఎవరు’ అని అన్నారు. ఓ తప్పుడు చట్టం ద్వారా లోక్‌పాల్ అనే అనవసర వ్యవస్థ ఏర్పడిరదని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు విమర్శించారు. ‘అరుణ్‌జైట్లీతో 20 ఏళ్ల పరిచయం. 2018 డిసెంబరో లేక 2019 జనవరిలోనో ఆయన నాకు ఫోన్ చేశారు. లోక్‌పాల్ అక్కర్లేదని, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చాలని, కొత్త వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ వనరుల వృథా చేయద్దని, సీవీసీ, సీబీఐని బలోపేతం చేసుకోవాలని, లోక్‌పాల్ చట్టం, 2013ను రద్దు చేయాలని జైట్లీతో చెప్పినట్లు నాటి సంభాషణను నాగేశ్వర రావు గుర్తు చేసుకున్నారు.
ఇదిలావుంటే, లోక్‌పాల్ చైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయవాది అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్ సహా ఆరుగురు సభ్యుల కోసం ఏడు బీఎండబ్ల్యూ కార్ల కోసం టెండర్లను ఇటీవల ఆహ్వానించారు. బిడ్లు అక్టోబర్ 17న మొదలు కాగా నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. కార్ల సరఫరా ఆర్డర్ ఇచ్చిన తేదీ నుంచి రెండు లేదా 30 రోజుల్లోగా జరగాలని… టెండర్ దక్కించుకున్న సంస్థే లోక్‌పాల్ సిబ్బంది, డ్రైవర్లకు ఈ కార్ల్లపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని, అది కనీసం ఏడు రోజులుండాలని కూడా లోక్‌పాల్ షరతులు పెట్టిన విషయం విదితమే.


