Homeవిస్తారంగా వర్షాలు

విస్తారంగా వర్షాలు

- Advertisement -

ఉత్తరాంధ్రలో పొంగుతున్న వాగులు, వంకలు

  • సీతమ్మధారలో కుండపోత వర్షం – కళింగపట్నం వద్ద తీరందాటిన తీవ్ర వాయుగుండం
  • కోస్తాజిల్లాల్లో నేడూ వర్షాలు – సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి / విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రెండు రోజులుగా తెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతం లో తీవ్ర అలజడి నెలకొంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు గాలుల తీవ్రతకు వణికిపోతున్నాయి. విశాఖలో అత్యధికంగా సీతమ్మధారలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇదే జిల్లాలోని వజ్రపుకొత్తూరులో 88.2మిమీ, లక్ష్మీనర్సుపేటలో 73.7మిమీ, ఎన్‌టీఆర్ జిల్లా పుట్రేలలో 67.6 మిమీ, రెడ్డిగూడెంలో 64.1 మిమీ, ఎ.కొండూరులో 62.8మిమీ, ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 57 మిమీ, కృష్ణా జిల్లా పెదయెరుకపాడులో 53.7మిమీ , ఎన్‌టీఆర్ జిల్లా కొర్లమండలో 50.7మిమీ, చందర్ల 49మిమీ, శ్రీకాకుళం జిల్లా మందసలో 44.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో అనేకచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. అల్లూరి జిల్లాలో అనేక ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ నగరం లో అనేక ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. కొండవాలు ప్రాంతాల్లో తీవ్ర అలజడి నెలకొంది. కొన్నిచోట్ల స్తంభాలు, చెట్లు నేల కులాయి. నగర శివారు ప్రాంతాల్లో, అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కళింగపట్నానికి సమీపంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో తీవ్ర వాయుగుండం తీరం దాటుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటే సమయంలో 50-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తీర పరీవాహక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్‌ ఆస్కారముందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వాయుగుండం తీరం దాటినప్పటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరో 48 గంటలుపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈదురుగాలులు పెద్దఎత్తున వీచే అవకాశం ఉన్నందున చెట్లు , హోర్డింగ్స్‌ వద్ద నిలబడరాదని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం శ్రీకాకుళంలో 3, అల్లూరి 2, విశాఖ 2, పోలవరం1, అనకాపల్లిలో ఒకటి మొత్తంగా 5 ఎస్‌డీఆర్‌ఎఫ్, 4 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలులి ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్‌లు 112, 1070, 1800 4250101 సంప్రదించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
సీఎం అత్యవసర సమీక్ష
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు… రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులతో అత్యవసర సమీక్ష జరిపారు. శ్రీకాకుళం-కవిటి మధ్య తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఆస్థి, ప్రాణ,పంట నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి, రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు