. కొరవడిన పారదర్శకత… జీవో 5 బేఖాతరు
. రిక్వెస్ట్ బదిలీల పేరుతో అధికార నేతల దందా
. దిక్కుతోచని ఉద్యోగులు… ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరింది. బదిలీకి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ తప్పనిసరిగా నిబంధన విధించడం వివాదాస్పదంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రజాప్రతినిధుల కింద ఉండే కార్యకర్తలు లాబీయింగ్‌కు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బదిలీలకు సంబంధించి ఈనెల 12వ తేదీన జీవో నంబరు 5 ద్వారా మార్గదర్శకాలు పొందుపరిచారు. ఇందులో ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. ఐదేళ్లలోపు ఉన్న వారంతా రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించారు. సచివాలయాల ఉద్యోగులు దీనిని ఆసరాగా తీసుకుని స్థానికంగా ఉన్న ప్రజాప్రతి నిధులను ఆశ్రయిస్తున్నారు. వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ బదిలీల డిమాండ్‌ను గుర్తించిన ఎమ్మెల్యేల అనుచరులు, అధికార పార్టీ కార్యకర్తలు బేరసారాలకు పాల్పడుతున్నారు. సిఫార్సు లేఖలు ఇప్పిస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఒక్కో సిఫార్సు లేఖకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా సామాజిక మాధ్యమాల్లో సిఫార్సు లేఖలు హల్‌చల్ చేయడం అధికార పార్టీకి చెడ్డపేరు తెస్తోంది. తాజాగా ఉండి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ సెక్రటరీస్ గ్రేడ్ 6 (డిజిటల్ అసిస్టెంట్స్) పోస్టులకు అక్కడి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకంగా 40 రిక్వెస్ట్ బదిలీలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయన లెటర్ ప్యాడ్ ద్వారా కలెక్టర్‌కు బదిలీలకు సిఫార్సు చేస్తూ లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా బదిలీలు కొనసాగడంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. అందులో లక్షా 25 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500పైగా సేవలందిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయిన దాదాపు 70 వేల మంది ఉద్యోగులు తమ బదిలీల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 90 వరకు సచివాలయాలను గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు. 2019లో మొదటి భర్తీ ప్రక్రియ, 2020 డిసెంబరులో రెండో విడత ప్రక్రియను పూర్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు, సర్వే డిపార్టుమెంట్, వైద్యారోగ్య, విద్యుత్‌శాఖ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ శాఖలున్నాయి. వార్డు సచివాలయాల పరిధిలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, రెవెన్యూ, హోంశాఖ, వైద్యారోగ్యశాఖ, విద్యుత్‌శాఖలున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, మత్స్య, పశుసంవర్ధకశాఖలు నడుస్తున్నాయి. ఇందులో వార్డు సచివాలయాల్లో జరిగే బదిలీలను ఆయా ప్రాంతీయ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయాల పరిధిలో పనిచేయాల్సి ఉంది. దీనికి ఇంచార్జిగా ఆయా హెడ్‌క్వార్టర్ మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తారు. ఇక్కడ బదిలీల మార్గదర్శకాలకు తిలోదకాలిస్తూ నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది.
జిల్లా అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు
ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనే అంశంపై ఆయా జిల్లా అధికారులపై రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తూ… తమకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో బదిలీ ప్రక్రియ పూర్తిగా విమర్శలపాలవుతోంది. దీంతో దిక్కుతోచక ఐదేళ్లు నిండిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులంతా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం జనరల్ బదిలీల కోసమే 70 వేల మంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి డిమాండ్‌కు అనుగుణంగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు… ముఠాగా ఏర్పడి లాబీయింగ్‌తో బదిలీల దందాకు తెగబడుతున్నారన్న విమర్శలున్నాయి. పారదర్శకంగా బదిలీలు నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీల్లో రాజకీయ జోక్యం విడనాడి, జీవో నంబరు 5 ఆధారంగా నిర్వహిస్తే… అందరికీ న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. రిక్వెస్ట్ బదిలీల కోసం ఆన్‌లైన్ల బదిలీల షెడ్యూలు ఈనెల 25వ తేదీతో ముగిసింది. ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూలు విడుదలైంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల బదిలీలకు షెడ్యూలు రాగా, మిగిలిన జిల్లాల్లో షెడ్యూలు కోసం కసరత్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలకు జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.