Homeఆంధ్రప్రదేశ్సమర్థంగా ‘నియోజకవర్గాల అభివృద్ధి’

సమర్థంగా ‘నియోజకవర్గాల అభివృద్ధి’

- Advertisement -

ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన ఫలితాలు
అన్నిస్థాయిల్లో సాంకేతికతను వినియోగించుకోవాలి
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ పటిష్ఠంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్షించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు, యంగ్ ప్రొఫెషనల్స్‌, నాలెడ్జ్ పార్ట్‌నర్లతో సీఎం మాట్లాడారు. నియోజక వర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయడం దేశంలోనే ప్రథమంగా ఏపీలోనే అమలు చేస్తున్నామని తెలిపారు. దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని, ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్‌ను సమర్థంగా అమలు చేయాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్రఅని చెప్పారు. రూపొందించుకున్న కీ-పెర్ఫామెన్స్‌ ఇండికేటర్లకు అనుగుణంగా ఆయా రంగాల్లో వృద్ధి నమోదు చేసేలా పని చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల విజన్ ప్లానులో యంగ్ ప్రొఫెషనల్స్‌, నాలెడ్జ్ పార్ట్‌నర్లు, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని…ఆ మేరకు వీళ్లంతా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం…ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థానిక వనరుల లభ్యత ఆధారంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ అంశాల సమాచారం కోసం డేటా లేక్ సిద్ధం చేశామని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకోవడంతోపాటు పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారులకు కేవలం నగదు సాయం అందించడంతోపాటు వారిని ఆర్థికంగా నిలబెట్టి సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. పీ4 ప్రాజెక్టు ద్వారా పేదరిక నిర్మూలనకు పారిశ్రామికవేత్తలను సైతం ప్రోత్సహిస్తూ… ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామనే నమ్మకం కలిగించాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్యోగుల సామర్థ్యం పెరిగేలా ఇప్పటికే 1.50 కోట్ల ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్యం భారంగా మారుతున్నాయని… అందుకే సంజీవని, తల్లికి వందనం వంటి వినూత్న పథకాలను తెచ్చామని సీఎం వివరించారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు సాంప్రదాయ ధోరణి వీడి వినూత్నంగా ఆలోచించాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ప్లాన్‌ను వర్తింపజేస్తూ సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాలని కోరారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే.. ప్రజలే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ప్రచారం చేపట్టారని గుర్తుచేశారు. పారదర్శకంగా చేపట్టిన మెగా డీఎస్‌సీపై విమర్శలు చేస్తుంటే టీచర్లే స్వయంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్, ఏపీఎస్ డిపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు