Tuesday, February 4, 2025
Homeవిశ్లేషణసాయుధ పోరాట సేనానులు - 6

సాయుధ పోరాట సేనానులు – 6

ఆర్వీ రామారావ్‌

తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లో పూర్తిగా ఈడు రానివారు కూడా పోరాట యోధులకు కొరియర్లుగా పనిచేశారు. అలాంటి ఒక సందర్భంలో ఒక రోజు అడవి మార్గంలో వెళుతుండగా ఆయన వెనక ఉన్న ఈడురాని పిల్లలు ఆకలేసి ఏడవడం మొదలు పెట్టారట. వారిని ఒక చోట కూర్చోబెట్టి దగ్గరలో దీపాలు పెట్టి ఉండడం గమనించి ఆరుట్ల లక్ష్మీ నరసింహా రెడ్డి అక్కడికి నడుచుకుంటూ వెళ్లారు. ఆ గ్రామంలో ఇల్లిల్లు తిరిగి మిగిలిన ఆహార పదార్థాలను పోగు చేసి ఒక తట్టలో పెట్టుకుని వచ్చారు. ఏడుస్తున్న బాల కొరియర్లకు ఆ భోజనం ఒక తల్లి పిల్లలకు తినిపించినట్టుగా తలో ముద్ద తినిపించారు. ఈ విషయం నాకు రావి నారాయణ రెడ్డికి కొరియర్‌గా పనిచేసిన పత్రికా రచయిత, నా సహోద్యోగి పి.ఎ.స్వామి చెప్పారు. ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన కంట తడి పెట్టుకున్నారు.లక్ష్మీ నరసింహా రెడ్డి ఆ కాలంలోని ఇతర స్వాతంత్య్ర సమరయోధుల లాగే రాజకీయ కార్యకలాపాల కారణంగా వరంగల్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జైళ్లలో కఠినమైన జైలు శిక్ష అనుభవించారు. ఆయన 1918లో నేటి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని భువనగిరి తాలూకాలోని కొలనుపాకలో జన్మించారు. న్యాయవాదిగా శిక్షణ పొందారు. ఆయన తెలంగాణా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరవాత కూడా ఆయన రైతు సంఘం నాయకుడిగా చాలాకాలం పని చేశారు.
లక్ష్మీ నరసింహా రెడ్డి 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి సభ్యుడిగా ఆంధ్ర మహాసభ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషిని ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటారు. తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పేద వ్యవసాయ కార్మికుల విముక్తిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 1947లో నిజాం ప్రభుత్వం ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజులలో వందేమాతరం పాడినందుకు ఆయనను కాలేజీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ దశలో ఆయన మీద సత్యాగ్రహో ద్యమం, ఆర్య సమాజం ప్రభావం ఉండేది. కళాశాల నుంచి సస్పెండ్‌ అయినందు వల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో చదువుకోవడం వీలు కాక జబల్‌పూర్‌ వెళ్లి బి.ఎ. పూర్తి చేశారు. ఆయన తన స్వగ్రామం కొలనుపాకకు తిరిగొచ్చే నాటికి జాగీర్దార్ల ఆగడాలు పెచ్చరిల్లి పోయాయి. 1945లో విసునూరు దేశ్‌ముఖ్‌ ఆగడాల మీద లక్ష్మీ నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్‌ విచారణకు బయలుదేరారు. లక్ష్మీ నరసింహారెడ్డి కూడా ఆ విచారణకు హాజరు కావడానికి ఎడ్ల బండిలో బయలు దేరారు. విసునూరు దొర మనుషులు లక్ష్మీ నరసింహారెడ్డి మీద దాడిచేసి చితగ్గొట్టారు. మరణించాడ నుకుని వదిలేసి వెళ్లారు. కానీ లక్ష్మీ నరసింహారెడ్ది బతికి బయటపడ్డారు.వ్యష్టి సత్యాగ్రం మొదలైనప్పుడు మొట్ట మొదటి సత్యాగ్రాహి రావి నారాయణ రెడ్డి అయితే రెండవ సత్యాగ్రాహి బద్దం ఎల్లా రెడ్డి. మూడవ సత్యాగ్రాహి లక్షీ నరసింహా రెడ్డి. 1952లో సాయుధ పోరాటంలో పాల్గొన్న పెండ్యాల రాఘవ రావు రెండు శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పోటీచేసి మూడిరట్లోనూ గెలిచారు. ఒక స్థానానికే ప్రాతినిధ్యం ఉండాలి గనక రాఘవరావు హసన్‌పర్తి స్థానానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో లక్ష్మీ నరసింహా రెడ్డి పోటీ చేసి గెలిచారు. 1957 తరవాత ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. అమానుషమైన నిజాం నిరంకుశ పాలనపై తిరగబడాలని నిర్ణయించు కున్నారు. సాయుధ పోరాటం ఒక్కటే మార్గం అనుకుని ఆ పోరాటంలోకి దూకారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు