ప్రథమ ర్యాంకుతో సత్తా చాటిన శక్తి దూబె
న్యూదిల్లీ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా… హర్షిత గోయల్ (2), అర్చిత్ పరాగ్ (3), షా మార్గి చిరాగ్(4), ఆకాశ్ గార్గ్ (5), కోమల్ పునియా(6), ఆయుషీ బన్సల్(7), రాజ్‌కృష్ణ రaా(8), ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి(10) ర్యాంకుల్లో మెరిశారు.
మెరిసిన తెలుగు తేజాలు
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ.సాయి శివాని 11వ ర్యాంకుతో మెరవగా… బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్.చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేశ్‌రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో అదరగొట్టారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ… ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపిక చేయగా… వీరిలో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు. సివిల్ సర్వీసెస్ నిబంధనలు అనుసరించి 230 మందిని రిజర్వు జాబితాలో ఉంచింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలనుకొనేవారి కోసం యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్ష హాల్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. 2024 సివిల్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు… తమ పరీక్షలు, నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం లేదా స్పష్టత కావాలంటే పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా వచ్చి గానీ, 23385271, 23381125, 23098543 ఫోన్ నంబర్ల ద్వారా గానీ సంప్రదించవచ్చని సూచించింది. సివిల్స్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.