Homeఅంతర్జాతీయంసౌదీ విమానాశ్రయాలు, ఇంధన సముదాయాలే లక్ష్యం

సౌదీ విమానాశ్రయాలు, ఇంధన సముదాయాలే లక్ష్యం

- Advertisement -

హౌతీల హెచ్చరిక`
అరాంకోపై క్షిపణి దాడి

రియాద్: సౌదీ అరేబియాపై హౌతీల వరుస దాడులు కొనసాగుతున్నాయి. ధహ్రాన్ నగరంలోని చమురు దిగ్గజం అరాంకో కేంద్ర కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. రాజధాని రియాద్‌లో క్షిపణుల శకలాలు పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. కీలక ప్రాంతాలే లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తుండటంతో సౌదీలో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఎయిర్‌పోర్టులు, ఇంధన సముదాయాలే తమ ప్రధాన లక్ష్యాలుగా హౌతీలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధహ్రాన్‌లోని అరాంకో కేంద్రంతో పాటు రియాద్‌లోని రిఫైనరీ, కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. గత నెల పున:ప్రారంభమైన యెమన్ యుద్ధంలో యెమెన్ ప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు, పౌరులు, కార్మికులంతా కూడా విమానాశ్రయాలు, చమురు క్షేత్రాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలిపోవాలని హెచ్చరిక జారీచేశారు. అవి తమకు న్యాయమైన లక్షిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. అయితే రియాద్ వైపునకు హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని సమర్థంగా కూల్చినట్లు సౌదీ దళాలు తాజాగా ప్రకటించాయి. సౌదీ రాజధానిలో అనేక చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రియాద్‌పై వైమానిక దాడి జరిగే అవకాశమున్నట్లు అధికారులు అంతకుముందే ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. హౌతీల క్షిపణులు, డ్రోనను అడ్డుకునేందుకు క్షిపణి ఇంటర్సెప్టర్లను ప్రయోగిస్తుండటంతో.. వాటి శకలాలు పడి నష్టం వాటిల్లుతోందని అధికారులు తెలిపారు.
సౌదీ ప్రతీకారం…
యెమెన్ ఇంధన కేంద్రంపై దాడి
యెమెన్ రాజధాని సనా శివార్లలో 58 వేల టన్నుల ఇంధనాన్ని నిల్వ చేయగల అల్-సబాహా కేంద్రంపై సౌదీ ప్రతీకార దాడి చేసింది. ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు హౌతీలు తెలిపారు. కాగా, తమ దేశంలోని విమానాశ్రయాలు, ఇంధన సముదాలపై దాడులు చేసేందుకు అల్ సబాహా కేంద్రాన్ని హౌతీలు వాడుతున్నట్లు గుర్తించి, దానిని లక్ష్యంగా చేసుకున్నట్లు సౌదీ దళాలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు