Homeస్మార్ట్ ‘ఎల్ఈడీ’ కాంతులు

స్మార్ట్ ‘ఎల్ఈడీ’ కాంతులు

- Advertisement -
  • కరెంటు ఖర్చు తక్కువ… వెలుతురు ఎక్కువ
  • రాష్ట్రంలో ‘స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్’
  • పట్టణాల్లో 10.5 లక్షల స్మార్ట్ దీపాల ఏర్పాటుకు కార్యాచరణ
  • విద్యుత్ బిల్ల్లుో కనీసం 30 శాతం కోత

విశాలాంధ్ర-సచివాలయం:
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఇకపై నూతన వెలుగులతో జిగేల్మననున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దశాబ్దాల నాటి సాంప్రదాయ వీధి దీపాల యుగానికి చరమగీతం పాడుతూ… అత్యాధునిక డిజిటల్ సాంకేతికతతో కూడిన ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్’ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఐఓటీ ఆధారిత ‘ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్’ కింద రాబోయే ఈ ప్రాజెక్టు… దేశంలోనే ఇప్పటివరకు చేపట్టని అత్యంత భారీ స్మార్ట్ వీధి దీపాల ప్రాజెక్టుగా రికార్డు సృష్టించబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కేవలం ఆరు నెలల కాలపరిమితిలోనే పూర్తి చేసి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. పనుల పురోగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలు, పురపాలక సంఘాల పరిధిలోని రహదారులను ప్రకాశవంతంగా మార్చడంతో పాటు, స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ సరికొత్త ఐఓటీ సాంకేతికత వల్ల ప్రతి వీధి దీప స్తంభాన్ని ఒక సెంట్రలైజ్¦ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విడివిడిగా నియంత్రించే అద్భుత అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ మున్సిపాలిటీలోని వీధిలోనైనా ఒక దీపం వెలగకపోయినా, సాంకేతిక లోపం తలెత్తినా… ఆటోమేటిక్‌గా కంట్రోల్ రూమ్‌కు క్షణాల్లో లొకేషన్‌తో సహా అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. దీనివల్ల లైట్లు పనిచేయడం లేదంటూ ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, రియల్ టైమ్లో సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే సరిచేసే వీలుంటుంది. అంతేకాకుండా సూర్యాస్తమయం కాగానే ఆటోమేటిక్‌గా వెలగడం, తెల్లవారగానే ఆరిపోవడం… అర్ధరాత్రి దాటాక రోడ్లపై రద్దీ తగ్గినప్పుడు లైట్ల తీవ్రతను స్వయంచాలకంగా తగ్గించుకునే సెన్సార్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండటం విశేషం. ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న సాధారణ వీధి దీపాలు ఒక వాట్ విద్యుత్కు కేవలం 100 ల్యూమెన్స్‌ సామర్థ్యంతో వెలుతురును ఇస్తే… ఈ సరికొత్త స్మార్ట్ ఎల్ఈడీ దీపాలు ఒక వాట్‌కు ఏకంగా 150 ల్యూమెన్స్‌ సామర్థ్యంతో అత్యంత ప్రకాశవంత వెలుతురును అందిస్తాయి. అంటే తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ వెలుతురు రావడం దీని ప్రత్యేకత. ఈ సరికొత్త సాంకేతికత వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక సంస్థలకు కనీసం 30 శాతానికి పైగా విద్యుత్ ఆదా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు భారీగా విద్యుత్ బకాయిలతో సతమతమవుతున్న తరుణంలో ఈ ప్రాజెక్టు ద్వారా కరెంట్ బిల్ల్లుో 30 శాతం కోత పడనుండటంతో స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడనున్నాయి.
ఈ రకమైన స్ట్రీట్ లైటింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఏటా దాదాపు రూ.5,400 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి మొత్తం 10.5 లక్షల స్మార్ట్ వీధి దీపాలను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో అమర్చేందుకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి కార్యాచరణను రంగంలోకి దించాయి. పట్టణాలు, నగరాల్లో రాత్రి వేళల్లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు సురక్షితంగా ప్రయాణించేలా ప్రకాశవంతమైన వీధి దీపాలు ఉండాలని, ఆరు నెలల గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీని దేశంలోనే నంబర్ వన్ డిజిటల్ స్టేట్‌గా నిలపాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు