చుట్టూ ఉన్న కోటాను కోట్ల జీవరాసుల మధ్య తనకు ఈ జీవితం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఆది మానవుడికి ఒక పట్టాన అంతు పట్టలేదు. మొదట ఆదొక నిగూఢమైన రహస్యం అనుకున్నాడు. తర్వాత కాలంలో తన ఊహకు అందని ఏదో అమోఘమైన శక్తి ఈ విశ్వాన్నంతా ఒకేసారి, ఉన్న ఫళంగా సృష్టించి ఉంటుందని భావించాడు. అదే ఇంత అద్భుతంగా తయారైందని విశ్వసించాడు. అందుకే, ప్రతి మతంలోనూ సృష్టి ప్రస్తావన కనిపిస్తుంది. దేవుడి పేర్లూ మతాలూ వేరువేరైనా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరూ నమ్మింది ఒకే విషయం! దేవుడే ఈ విశాల విశ్వానికి సృష్టికర్త-అని! ఆ భావం కొన్ని వేల సంవత్సరాల పాటు వర్థిల్లింది. సృష్టికి సంబం ధించిన విషయంలో మతాలు చెప్పిందే ఆయా సమాజాల్లో ‘సత్యం’గా చలామణి అయింది. మత గ్రంథాలు ప్రామాణికమయ్యాయి. అందువల్ల ఆ విశ్వాసాన్ని కాదని, ఆలోచించే వారే లేకపోయారు. ఎవరైనా వ్యతిరేకంగా నోరెత్తితే ఏకంగా మరణశిక్షలే ఉండేవి. అందువల్ల శాస్త్రీయ దృక్పథం అనేది ఊపిరి పోసుకోవడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. వివేకానికి మూర‰త్వం పెద్ద ప్రతి బంధకంగా నిలిచింది. మరో వైపు మత పెద్దల, మత న్యాయస్థానాల తీర్పులు జనాన్ని భయకంపితుల్ని చేశాయి. తెల్లవాడు నల్లవాణ్ణి, ఉన్నవాడు లేనివాణ్ణి, అగ్రవర్ణం వాడు నిమ్న వర్గం వాడిని, పురుషుడు స్త్రీని బానిసలుగా చూసే హీన సంస్కృతి రాజ్య మేలింది. పై స్థాయి వారు కింది స్థాయి వారిని ఎంతగా ప్రభావితం చేశారంటే- ‘తాము పాపులం గనక, ఆ దేవుడు-ఆ ప్రభువు తమను బానిసలుగా పుట్టించాడని. అంతా ఆ దేవుని ఇష్టప్రకారమే జరుగుతూ ఉందని, యజమానులకు సేవలు చేస్తూ తరించడమే తాము చేయాల్సి ఉందని అమాయకంగా నమ్ముతూ మోసపోయారు. అలాంటి పరిస్థితుల్లో మరో రకమైన ఆలోచన రావడానికే వీల్లేకపోయింది. బలప్రయోగాలు ఎల్లకాలమూ రాజ్యమేలలేవు కదా? స్థల కాలాల్ని, అందులోని పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించినా ప్రజలు ఆలస్యంగానైనా సరే, వివేకం పెంచుకుంటారు కదా ? పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాలలో కోపర్నికస్, గెలీలియో, బ్రూనో, న్యూటన్, లిల్, డార్విన్, హట్టన్ వంటి వైజ్ఞానికులు విశ్వనిర్మాణం, జీవ పరిణామం విషయాలలో కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. మత విశ్వాసాలకు బలమైన సవాళ్లు విసిరారు. ఎదుర్కోవడానికి స్థిరంగా నిలబడ్డారు. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సూత్రాలేమిటో నిశితంగా పరిశీలిస్తే, మనకు ఈ విశ్వంలోనే కనిపిస్తాయని నిరూపిస్తూ వచ్చారు. దీనితో జనంలో రెండు ప్రశ్నలు తలెత్తాయి. ఒకటి-మతం చెప్పింది విశ్వసించడమా ? రెండు-సైన్సు చూపిన మార్గాన్ని అనుసరించడమా ? ఇవి రెండూ ప్రజల చర్చకు దారితీశాయి. ఆనాడే కాదు, శతాబ్దాలు దాటొచ్చినా, ఈ చర్చ కొనసాగుతూనే ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ఆచారం పేర్లతో ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మూఢనమ్మకాల్లో మగ్గిపోతూ ఉన్నారు. అదే సమయంలో శాస్త్ర సాంకేతిక ఫలితాలను పూర్తిగా అనుభవిస్తున్నారు. వైజ్ఞానిక రంగం అందించిన అన్ని వసతుల్ని ఒక వైపు అనుభవిస్తూనే, ఇంకా ఎందుకు మూడు వేల నాటి పనికిరాని భావజాలాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారూ?’ అన్నది నేటి సైన్సు కార్యకర్తల ప్రశ్న. దేన్ని అనుభవిస్తున్నారో దాని పట్ల నిజాయితీగా ఉండనవసరం లేదా ? నిజాయితీ లేక అబద్దపు బతుకులు బతికే వారిని ఏమనాలో ? క్రీ.శ.1700 నుంచి వైజ్ఞానికులు భూమి పొరల్లో కొన్నికొన్ని చోట్ల శిలాజాలను గుర్తిస్తూ వచ్చారు. క్రమంగా ఏ శిలాజం ఏ జంతువుదో గుర్తించగలిగే నైపుణ్యాన్ని పెంచుకున్నారు. అందులో కొన్ని రకాల వృక్షాలు, జంతువులు తర్వాతి కాలాలలో జీవించి లేవని గుర్తించారు. ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జార్జి కువర్ (1769-1832) అనే ఫ్రెంచ్ ప్రకృతి పరిశోధకుడు గతంలో జీవించిన కొన్ని ప్రాణులు అంతరించిపోయాయని ప్రతిపాదించాడు. అందువల్ల ఈ ‘అంతరించిపోవడ’ మనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, అదొక ముఖ్యమైన అధ్యయన విషయమైంది. జేమ్స్ హట్టన్ స్కాట్ల్యాండ్ భూగర్భ శాస్త్రవేత్త. 1788లో భూసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి పొరలుపొరలుగా ఉందని దాని సారాంశం! అది నిజమే అని నిర్థారణ అయ్యింది. ఎందుకంటే ఒక్క పొరలో వృక్ష, జంతు శిలాజాలు లభ్యమవుతూ ఉండడం వల్ల-అవి ఏయే కాలాలలో జీవించి ఉండేవో లెక్కలు కట్టడానికి వీలయ్యింది. మత గ్రంథాల్లో చెప్పినట్లుగా ఒక్కసారిగా మహా ప్రళయాలు రావడం లేదని అవి క్రమేపి కొన్ని వందల, వేల యేళ్ల పాటు జరుగుతూనే ఉంటాయని బ్రిటీష్ భూ భౌతిక శాస్త్రవేత్త చార్లెస్ లిల్ (1797-1875) ఉదాహరణలతో సహా ప్రతిపాదించాడు. ఛార్లెస్ లిల్, జేమ్స్ హట్టన్ భూ సిద్ధాంతానికి ప్రాచుర్యం తెచ్చాడు. ఈ ఇద్దరి పరిశోధనా ఫలితాలు ఛార్లెస్ డార్విన్కు ఉపయోగపడ్డాయి. ఇవేకాక, జీవాలు ఇంకా ఇతర సిద్ధాంతాలెన్నో డార్విన్కు ఉపయోగపడ్డాయి. డార్విన్కు సమాంతరంగా ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ కూడా పరిణామ క్రమం పై పరిశోధనలు చేశాడు. విలియం స్మిత్-ఇంగ్లీషు జియోలజిస్ట్. తొలిసారి ఇంగ్లాండు-వేల్స్ల జియోలాజికల్ మ్యాప్స్ ప్రకటించాడు. దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎలాంటి మార్పులూ ఉండవని ప్రజలు నమ్మేవారు. యుగాంతంలో సర్వం నాశనమైపోయి, మళ్ళీకొత్త జీవులు పుడుతాయని విశ్వసించే వాళ్లు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిస్థితుల్ని గమనిస్తూ ప్రకృతి నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. కాని, కొందరు స్వార్థపరులు, కుట్రదారులు మనుషులు కలవకుండా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ‘ఎక్కువ మంది నమ్మే’ అబద్ధం ఏనాటికీ సత్యంగా మారిపోదు. తక్కువ మంది నమ్మే సత్యం ఎప్పటికీ అబద్దం కాదు. హేతుబద్ధంగా తనని తాను నిరూపించుకుని, తగిన కారణాల్ని చూపించినప్పుడే, విశ్లేషణలకు, వివరణలకూ అవకాశమిచ్చినపుడే అది వాస్తవమౌతుంది. సత్య నిరూపణ అంటే, సత్యశోధన అంటే ఇదే. ఛాందసులు నమ్మే సత్యశోధన, సత్యాన్వేషణ వేరు. వాటితో దానికి సంబంధం లేదు. ఏ నిరూపణలకూ నిలబడకుండా తమ విశ్వాసాల్ని గుడ్డిగా నమ్మమని బోధించేవి ఏవైనా సరే, అవి అబద్దాలవుతాయి. సత్యం సత్యమే! అసత్యం అసత్యమే! వీటిని నమ్మేవారి సంఖ్యతో పని లేదు. ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఈ సమాజంలో నువ్వేమిటి? నీ స్థానమేమిటి? అనేది తెలుసుకుంటే ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. అంతేగానీ, ఆత్మ-పరమాత్మ అంటూ ముకూక్క కళ్లూ మూసుకుని బోధించే వారి వల్ల-వినే వారి వల్ల ఈ లోకానికి ఎప్పుడు ఎక్కడా ఏ ఉపయోగమూ కలగలేదు. ఇక ముందు కూడా కలగదు. సైన్సుకు అందని అతీతమైన శక్తి ఉందని జనాన్ని ఊదరగొట్టేవారు, తాము చేసే పనులన్నింటికీ అతీతశక్తిని ఉపయోగించుకుని-జనానికి ఏవైనా మంచి ఫలితాలు చూపగలిగితే అప్పుడు ఆలోచిద్దాం? దీనికి ముఖ్యమైన షరతు ఏమిటంటే, వారు తమ దైనందిన జీవితంలో సైన్సు విజ్ఞానాన్ని గాని, సైన్సు పరికరాల్ని గానీ, సైన్సు ఉత్పత్తులను గానీ ఏ మాత్రం వాడకూడదు!
(మూఢ నమ్మకాల నిర్మూలనం కోసం కృషి చేస్తూ హత్యకు గురై, అమరుడైన డా॥నరేంద్ర దబోల్కర్ స్మృతిలో 20 ఆగష్టును జాతీయ వైజ్ఞానిక స్పృహ-దినంగా పరిగణిస్తున్నాం.)
సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్
హేతుబద్ధతను మించింది లేదు
- Advertisement -


