Tuesday, May 13, 2025
Homeతెలంగాణఅందగత్తెలు ఫిదా!

అందగత్తెలు ఫిదా!

చార్మినార్‌ చూసి ముగ్ధులైన సుందరీమణులు

. అరబ్బీ మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేసిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు
. ప్రపంచ రాయబారుల రాకతో పులకించిన పరిసరాలు
. చరవాణిల్లో అందాలు బంధించిన అందగత్తెలు
. సాంస్కృతిక వైభవం చాటిన హెరిటేజ్‌ వాక్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్‌ సందర్శన …110 దేశాల మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్స్‌కు మధురానుభూతులను మిగిల్చింది. ఐదు శతాబ్దాలుగా హైదరాబాద్‌ మధ్య ఠీవీగా ఉన్న ఈ సొగసైన కట్టడంను చూసి సుందరాంగులు మంత్రముగ్ధులయ్యారు. సందర్శన కోసం చార్మినార్‌ వద్దకు పర్యాటక బస్సుల్లో చేరుకున్న మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు అధికారులు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం చెప్పారు. స్థానిక కళాకారులు వారికి సాంప్రదాయిక అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. మార్ఫా శబ్దాలు మమేకం చేస్తున్నట్లుగా కొందరు కంటెస్టెంట్స్‌ ప్రత్యేక స్టెప్పులతో నృత్యం చేస్తూ స్థానిక సంస్కృతిని అనునయించారు. ఈ అందాల రాయబారులతో చార్మినార్‌ పరిసరాలు ఒక సరికొత్త శోభను సంతరించుకున్నాయి. చార్మినార్‌ వద్ద ఫోటోషూట్‌ కు హాజరైన సుందరీమణులు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ తమ ఆనందం, సంతోషాన్ని వ్యక్తపరిచారు. చార్మినార్‌ అందాలను ఈ అందగత్తెలు తమ చరవాణిల్లో బంధించారు. అనంతరం ప్రపంచ అందగత్తెలు చార్మినార్‌ ముందు నిర్వహించిన హెరిటేజ్‌ వాక్‌ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. సందర్శనలో భాగంగా చార్మినార్‌ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్‌ (లాడ్‌ బజార్‌)లో కంటెస్టెంట్స్‌ గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువుల షాపింగ్‌ చేసి స్థానిక హస్తకళల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు. కొందరు గాజుల తయారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, నిపుణులైన కారిగర్లు (కళాకారులు), శిల్పులను ప్రశంసిం చారు. వారి శ్రమ, నైపుణ్యం ప్రపంచ స్టేజిపై గుర్తించదగినదని భావిం చారు. దీని ద్వారా హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వం… సౌందర్యం ప్రపంచానికి తెలియజేసినట్లయింది. మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్స్‌ సందర్శన కేవలం పోటీలలో భాగంగానే కాకుండా, ప్రపంచ శాంతి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకకగా నిలిచింది. ప్రపంచ సుందరీమణుల పట్ల లాడ్‌ బజార్‌ వ్యాపారులు తమ ఉదారత చాటుకున్నారు. ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్ల నుంచి వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు