Friday, February 21, 2025
Homeసంపాదకీయంఅజ్ఞానాంధకారం

అజ్ఞానాంధకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్వేష రాజకీయాలకు పెట్టింది పేరు. కానీ విద్వేషపూరిత ప్రసంగాలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ మోదీ కన్నా రెండాకులు ఎక్కువే చదివారు. తమకు గిట్టని మతాన్ని ద్వేషించే వారు ఆ మతానికి చెందిన భాషనూ ద్వేషించగలరు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభా వ్యవహారాలు ఇంగ్లీషులో కాకుండా హిందీలో నిర్వహించాలన్న చర్చ వచ్చినప్పుడు యోగీ ఆదిత్యనాథ్‌ దాన్ని వాటంగా ఉర్దూ మీద ద్వేషం వెళ్లగక్కడానికి వాడుకున్నారు. నిజానికి శాసనసభలో ఇంగ్లీషుకు వ్యతిరేకంగా అనేకమంది అభిప్రాయాలు వెల్లడిరచారు. కానీ యోగీ ఆదిత్యనాథ్‌ దాన్ని ఉర్దూ ముస్లింల భాష మాత్రమే అనుకుని ఉర్దూ మీద విరుచుకుపడ్డారు. పిల్లలకు ఉర్దూ నేర్పాలంటారు. కానీ చాలా మంది నాయకుల పిల్లలను ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలకు పంపిస్తారు. లేదా ఇంగ్లీషులో చదువుకునే అవకాశం ఉన్న దేశాలకు పంపిస్తారని ఆదిత్యనాథ్‌ కడుపులోని విషాన్నంతటినీ వెళ్లగక్కారు. విద్యార్థులకు ఉర్దూ నేర్పాలనే వారు… వారిని మౌల్వీలుగా తయారు చేస్తారా, కట్ముల్లాలుగా (పాషండ మత నాయకులు) తయారు చేయాలను కుంటున్నారా అని ఆదిత్యనాథ్‌ దెప్పి పొడిచారు. శాసనసభ వ్యవహారాలు ఏ భాషలో నిర్వహించాలనేది ఆ ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషపై ఆధారపడి ఉండాలి. ఇంగ్లీషులోనే సభా వ్యవహారాలు నడపాలనడమూ సరైన వాదన కాదు. శాసనసభ వ్యవహారాలకు ఉర్దూ అనువాదాలు ఏర్పాటు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అడగడంతో ముఖ్యమంత్రి ఉర్దూ మీద విరుచుకుపడ్డారు. సభా వ్యవహారాల అనువాదం అవధి, భోజ్‌పురి, బ్రజ్‌ భాష, బుందేలీ భాషతో పాటు ఇంగ్లీషులో కూడా అందుబాటులో ఉంటాయని స్పీకర్‌ ప్రకటించారు. దేశవాసులను పాషండులుగా తయారు చేస్తారా అని ఆదిత్యనాథ్‌ ఆక్రోశంగా మాట్లాడారు. యోగీ ఆదిత్యనాథ్‌ కించపరిచే, మతతత్వ, రాజ్యాంగ విరుద్ధ భాష వాడుతున్నారని ప్రతిపక్షాల వారు దుయ్యబట్టారు. ఇది యోగి మానసికత అని విమర్శించారు. యోగి మాటలు ముస్లింలను అవమానించేవిగా ఉన్నాయి. సెక్యులర్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయి. రాజ్యాంగ విలువలను దెబ్బ తీసేలా ఉన్నాయి. విద్వేష రాజకీయం నడిపే వారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం! భాషకు, మతానికి సంబంధం లేదని, ఉండకూడదు అన్న జ్ఞానం యోగీ ఆదిత్యనాథ్‌కు ఉంటుందని అనుకోలేం. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన దాఖలాలే లేని బీజేపీ నేతలు వలసవాదుల మార్గాన్నే నడుస్తారు. బ్రిటిష్‌ వారు 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరవాత మత విభజనతో పాటు భాషా విభేదాలను కూడా సృష్టించారు. యోగీ ఆదిత్యనాథ్‌ లాంటివారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అన్న మాటను భగత్‌ సింగ్‌ ఎక్కువగా ప్రచారంలోకి వచ్చేట్టు చేసి ఉండొచ్చు. కానీ మొదట ఆ నినాదం ఇచ్చింది మౌలానా హస్రత్‌ మోహాని అని యోగికి ఎవరు చెప్పగలరు? ఉర్దూ కేవలం ముస్లింల భాష కానే కాదు. ఈ భాషను మన దేశంలోనే కాక పాకిస్థాన్‌, బ్రిటన్‌, అమెరికా సహా అనేక దేశాల్లో మాట్లాడతారు. ప్రపంచ స్థాయిలో చూస్తే అత్యధిక జనాభా మాట్లాడే వారిలో ఉర్దూ మాట్లాడేవారు పదో స్థానంలో ఉన్నారు. ఉర్దూ మన దేశంలో, మరీ కచ్చితంగా చెప్పాలంటే 12వ శతాబ్దంలో దిల్లీ పరిసర ప్రాంతాల్లో మొదలైంది. సైన్యంలో అనేక మతాల, భాషల వారు ఉంటారు కనక వారికోసం ఈ భాష అవతరించిందంటారు. అందుకే దాన్ని లష్కరీ భాష అని కూడా పిలుస్తారు. ఆ భాష మీద అరబిక్‌, పర్షియన్‌ భాషల ప్రభావం ఉన్న మాట నిజమే. డా. మన్మోహన్‌ సింగ్‌ మాతృభాష పంజాబీ. కానీ ఆయన ఉర్దూ లిపిలో పంజాబీ రాసే వారు. దేవీలాల్‌ కూడా అంతే. చాలా భాషలకు ఇప్పటికీ లిపి లేదు. ఇప్పుడు పంజాబీని గురుముఖిలో రాస్తున్నారు.
ఉర్దూ చాలా సుసంపన్నమైన భాష. ఇతర భాషల నుంచి వచ్చి చేర్చిన మాటలు ఏ భాషనైనా సుసంపన్నం చేస్తాయి. ఉర్దూకు ఆ లక్షణం దండిగా ఉంది. చియ్య (మాంసం) లాంటి తెలుగు మాటలు కూడా ఉర్దూలో చేరిపోయాయి. ఉర్దూ సాహిత్యానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ భాషలో లయ ఎక్కువ. కవిత్వానికి అనువైన పదబంధాలు, పదసంపద ఉర్దూలో అపారం. ప్రసిద్ధ రచయితలైన రాజేందర్‌ సింగ్‌ బేడీ, కిషన్‌ చందర్‌ హిందువులే అయినా ఉర్దూలోనే రాశారు. మున్షీ ప్రేంచంద్‌ కూడా హిందీతో పాటు ఉర్దూలోనూ రాశారు. నిజానికి హిందీ, ఉర్దూ ఒకే తల్లి వేరు నుంచి పుట్టింది. లిపి మాత్రమే వేరు. హైదరాబాద్‌ సంస్థానంలో మొదటి కవి వలీ దక్కనీ. ప్రముఖ సంగీతకారుడు బడే గులాం అలీ ఖాన్‌ హైదరాబాదీ వారు కాకపోయినా ఆయన సమాధి హైదరాబాద్‌లో ఉంది. దాగ్‌ సమాధి కూడా హైదరాబాద్‌లో ఉంది. ప్రధానంగా గమనించవలసిన వాస్తవం ఏమిటంటే మన దేశంలోనే చాలామంది ముస్లింలకు ఉర్దూ తెలియదు. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలలో కూడా ముస్లింలకు చాలా మందికి ఉర్దూ రాదు. వారు తెలుగులోనే మాట్లాడుకుంటారు. కేరళలోని ముస్లింలు, తమిళనాడులోని ముస్లింలూ మలయాళంలోనూ, తమిళంలోనూ మాట్లాడుకుంటారు. అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. రఘుపతి సహాయ్‌ అన్న పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన తన పేరును ఫిరాఖ్‌ గోరఖ్‌ పురి అని మార్చుకున్నారు. ప్రసిద్ధ సాహితీవేత్తలు నరేశ్‌ కుమార్‌ పేరును నరేశ్‌ కుమారు షార్‌ అంటారు. బ్రిజ్‌ నారాయణ్‌ పేరు వెనక కూడా చక్‌ బస్‌ అన్న ఉర్దూ మాట ఉంటుంది. పండిత్‌ రత్తన్‌ నాథ్‌ పేరు చివర షర్షార్‌ అని ఉంటుంది. సంజయ్‌ మిశ్రా షార్‌, కృష్ణ బిహారీ నూర్‌ లాంటి అనేకమంది పేర్ల వెనక ఉర్దూ మాటలు ఉంటాయి. గుల్జార్‌ అసలు పేరు సంపూర్ణ సింగ్‌ గుల్జార్‌ అని ఎంతమందికి తెలుసు? ఆయన సినీ, గేయ రచయితగా, మాటల రచయితగా, కవిగా చాలా ప్రసిద్ధుడు. స్వాతంత్య్రోద్య కాలంలో భాష విషయంలొ గాంధీ నెహ్రూకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. మొదటిది: ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయడం. రెండవది: అనుసంధాన భాషగా హిందుస్థానీని అమలు చేయడం. హిందుస్థానీ అన్నా హిందీ-ఉర్దూ భాషల సమ్మేళనమే. కానీ హిందుస్థానీని అనుసంధాన భాషగా మార్చలేకపోయాం. దక్షిణాది వారు దీనికి అడ్డు తగిలారు. విధి లేక ఇంగ్లీషునే అనుసంధాన భాషగా కొనసాగిస్తున్నాం. చరిత్ర తెలియని, ముస్లింల పొడ కూడా గిట్టని యోగీ ఆదిత్యనాథ్‌ లాంటి వారు ముస్లింలను ద్వేషించడానికి భాషను కూడా వాడుకుంటారు. ఉర్దూ కేవలం ముస్లింల భాష కాదన్న వాస్తవం చరిత్ర తెలియని వారికి తెలిసే అవకాశమే లేదు. అజ్ఞానాంధకారంలో ఓలలాడేవారి తీరు ఇలాగే ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు