హైదరాబాద్: వైద్య వృత్తిలో నిరంతర అభ్యాసనం అవసరమని ముఖ్య అతిథి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్‌ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్, వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. అపోలో మెడికల్ కాలేజీ స్నాతకోత్సవం జూబ్లీహిల్స్‌లోని ఆర్‌ఎన్‌ఆర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చేతుల మీదుగా వైద్య విద్యార్థులకు పట్టాల పంపిణీ చేశారు. వంద మంది 2018 బ్యాచ్ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విద్యా సంస్థలలో ఒకటైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఉత్తీర్ణులు అవడం చాలా అదృష్టం అన్నారు. నలబై మూడు సంవత్సరాలుగా వైద్య రంగంలో ఉన్నానన్నారు. ఇప్పటికీ రోగుల నుంచి, విద్యార్థుల నుంచి, ఇంటర్నెట్, ఇతర వనరుల నుంచి నేర్చుకుంటున్నానని తెలిపారు. నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే, ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.