పతకమూరు దామోదర్ ప్రసాద్
ఇప్పటికే భారీ రుణభారంతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అప్పులు తేవడం మరింత భారమే. అయినా రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలవడానికి పోటా పోటీగా అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చేసి తీరవలసిందే. మార్కెట్ నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి భారీగా అప్పులు చేయక తప్పదు. ప్రతిపాదిత రూ.40,635 కోట్ల మూలధన వ్యయం నిధుల కొరత దృష్ట్యా ఏమేరకు సాధ్యమో వేచి చూడాల్సిందే.
నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీి కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్స రానికి ప్రతిపాదించిన రూ3,22,359 కోట్ల బడ్జెట్ భారీగా కనిపిస్తున్నా అమలుకు అవసరమైన వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత పాటిస్తూ ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో చెప్పినా రాష్ట్ర సొంత ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నందున, నిధుల సమీకరణకు చేసే ప్రయత్నాలు సఫలం కాకపోతే బాహుబలి బడ్జెట్ పూర్తిగా అమలు కావడం సందేహాస్పదమే. అప్పులు, వడ్డీలకే రూ.60 వేల కోట్లు చెల్లించవలసి ఉంటుంది. కార్పొరేషన్ల రుణాలు అదనం. నరేంద్ర మోదీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం కూడా గత 11 ఏళ్ల ఏలుబడిలో ఎడా పెడా రుణాలు దూసి తెచ్చి అప్పుల భారతాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అదే బాటలో నడుస్తూ అప్పులపై ఆధారపడిన భారీ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు అమలు చేయాలంటే లక్ష కోట్లకు పైగా రుణాలు తీసుకోక తప్పదని అంచనా. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి సాగించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, పునర్నిర్మాణం కూటమికి కత్తిమీద సామేనని భావిస్తున్నారు. స్వర్ణాంధ్ర -2047 దార్శనిక పత్రంలో పేర్కొన్న లక్ష్యాల సాధనకు కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ పునాది వంటిదే. కేంద్ర ప్రభుత్వ పథకాలు 95 అమలు నిలిపి వేయడం వల్ల రూ 40వేల కోట్లు కోల్పోవలసి వచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు దీటుగా నిధులు కేటాయించకపోవడం, కేంద్ర నిధులను మళ్లించడం వల్ల నవ్యాంధ్రకు రావలసిన లబ్ధి చేకూరలేదు. మూలధన చెల్లింపులు రూ 24,430కోట్లు కాగా మూలధన వసూళ్లు రూ1,04,382కోట్లు. రెవెన్యూ వసూళ్లు రూ2,17,976 కోట్లు, చెల్లింపులు 2,51,162 కోట్లు. ద్రవ్యలోటు 79,926కోట్లు, రెవెన్యూ లోటు రూ33,185కోట్లు. ఈ అంతరం ఆందోళన కలిగించేదే.
ఇప్పటికే భారీ రుణభారంతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అప్పులు తేవడం మరింత భారమే. అయినా రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలవడానికి పోటా పోటీగా అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు చేసి తీరవలసిందే. మార్కెట్ నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి భారీగా అప్పులు చేయక తప్పదు. ప్రతిపాదిత రూ40,635 కోట్ల మూలధన వ్యయం నిధుల కొరత దృష్ట్యా ఏమేరకు సాధ్యమో వేచి చూడాల్సిందే. రాష్ట్రానికి కీలకమైన సేద్యపు రంగాన్ని రూ 48,341 కోట్ల బడ్జెట్‌తో మెరుగుపరచాలని ప్రతిపాదించారు. జగన్ ప్రభుత్వం పట్టించుకోని బిందు, తుంపర సేద్యానికి కూటమి ప్రభుత్వం మళ్లీ సబ్సిడీలను పునరుద్ధరించడం పూలు, పండ్లతోటలు ఇతర ఉద్యాన పంటల అధికోత్పత్తికి, పండ్ల ఎగుమతులకు తోడ్పడగలదు. ఇటీవల అనంతపురం నుంచి ప్రత్యేక రైలులో విదేశాలకు ముంబై ద్వారా అరటిపండ్లు ఎగుమతి చేశారు. సరైన అరటి మొక్కలు రాష్ట్రంలోనే రైతులకు సరఫరా చేస్తే పండ్ల ఉత్పత్తిని పెంచి ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జనకు తోడ్పడగలదు. కొన్ని హైదరాబాద్ కంపెనీలు వైరస్ సోకిన అరటి పిలకలను సరఫరాచేయడం వల్ల అరటి గెలలు కోతకు ముందే నేలకూలి రైతులు లక్షల్లో నష్టపోయారు. నకిలీ, రోగగ్రస్థ మొక్కల కంపెనీలపై ఉద్యాన, వ్యవసాయ అధికారులు తగు నిఘా వుంచి అన్నదాతలను నష్టాలబారి నుంచి కాపాడాలి. బడ్జెట్‌లో వివిధ శాఖలకు, రంగాలకు చేసిన కేటాయింపులు అంకెల గారడీ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సంపద సృష్టించి అభివృద్ధి ఫలాలను పేదలకు అందించి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీస్డిపి)ని 2047 నాటికి రూ2.4 లక్షల కోట్లకు పెంచాలనే బృహత్ లక్ష్యం అమలుకు ఎన్నో అవరోధాలున్నాయి. ఇందుకు కేంద్రం, వివిధ సంస్థలు, అంతర్జాతీయ సహాయ సహకారాలతో నవ్యాంధ్రలో సేద్యం, పరిశ్రమలు, ఐటీి, ఫార్మా, సేవా, శాస్త్ర, విజ్ఞాన సాంకేతిక రంగాలను ఉత్తేజితం చేసి, పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పనను మెరుగు పరచాలి. భారత్‌కు స్వాతంత్య్రం లభించి 2047కు వందేళ్లు పూర్తయ్యే నాటికి భారత్ ను అభివృద్ధిచెందిన దేశంగా మార్చాలంటే రాష్ట్రాలు, కేంద్రం పరస్పర అవగాహన, సమన్వయంతో వ్యవహరిస్తేనే లక్ష్యాలను సాధించగలం.
ఆంధ్రప్రదేశ్‌కు 972 కి.మీ విస్తారమైన సముద్ర తీరం ఉండటం ఒక వరం. మౌలిక సదుపాయాలను వృద్ధి చేస్తూ, భారత ప్రభుత్వ సాగర మాల పథకం కింద విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయంపేట, నిజాంపట్నం, కృష్ణపట్నం రేవులను ఇతోధికంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి కేం ంద్రాలతో అనుసంధానించి గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేయాలి. సోదర తెలుగు రాష్ట్రం తెలంగాణాకు సముద్రతీరం లేనందున మచిలీపట్నం తదితర రేవులను తెలంగాణ సహకారంతో ఉభయ తారకంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలి. భారత ప్రభుత్వం ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ అనే ఉదాత్త కార్యక్రమం ప్రారంభించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి78 ఏళ్లైనా ఇప్పటికీ రక్షిత మంచినీరు సరఫరా లేని గ్రామాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. కనుక జలజీవన్ ద్వారా ఈ గ్రామాలకు రక్షిత నీటిని సరఫరా చేయాలి. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ6వేలకోట్లు కేటాయించారు. కేంద్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున వచ్చే మూడేళ్లలో పూర్తి చేసి గరిష్ఠ ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలి. నిర్వాసితులకు సహాయపునరావాసానికి కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి కృషి చేయాలి. వెనుకబడిన కరవు ప్రాంతాలలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నేటి బాలలే రేపటి పౌరులు గనుక సంపూర్ణ అక్షరాస్యత సాధనకు తల్లికి వందనం ఎంతో మేలు చేస్తుంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్, ఇతర సాంకేతిక సంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నవీకరించి, కృత్రిమ మేధ ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందిస్తే ప్రపంచంలో వారు ఎక్కడైనా రాణించి దేశ ప్రతిష్ట పెంచుతూ స్వయం ఉపాధి పొందగలరు. మన పల్లె సీమల్లో ప్రజల ఆదాయాలు పెరగాలంటే పాడిపశువులు, కోళ్లు, గొర్రెలు, చేపలపెంపకాన్ని ప్రోత్సహించి ఉపాధికి తోడ్పడాలి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ రోడ్ల నిర్మాణం వంటి కేంద్ర పథకాలను గరిష్టంగా ఉపయోగించు కోవాలి. కేంద్రం నుంచి పంచాయతీరాజ్ నిధులను రాబట్టి గ్రామసీమల రూపురేఖలు మార్చదానికి ఉపముఖ్యమంత్రి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ నిధులను రాబట్టాలి. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, నదులు, కాలువలు, ఏర్ల ఆక్రమణలు తొలగించి వాటిని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలను ప్రజా భాగస్వామ్యంతో చేపట్టాలి. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం ప్రాణవాయువు అందిస్తున్నదున అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించాలి. ప్రజాసేవ అంటే డబ్బు వెదజల్లి గెలిచి మళ్లీ ప్రజల నుంచి ప్రతి పనికి కమిషన్ లు గుంజే దోపిడీకి స్వస్తి చెప్పి ప్రజలకు మేలు చేసే పనులపై ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించి రాజకీయమంటే సేవచేసే పవిత్ర కర్తవ్య మనే భావనను పెంపొదిస్తే వారిపై గౌరవం పెరుగుతుంది. బడ్జెట్ అమలుపై ప్రజాప్రతినిధులు నిమగ్నమైతేనే సార్థకత.
సీనియర్ జర్నలిస్టు, 9440990381