కోవిడ్19 మరణాలకు సంబంధించి కేంద్రం తప్పుడు సమాచారం అందించి తప్పుదోవపట్టించిందని తాజా గణాంకాలు వెల్లడిరచాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త కోవిడ్ మరణాల డేటా మహమ్మారి సమయంలో భయపడిన దానిని నిర్ధారించే విధంగావుంది. ప్రభుత్వం వైపు నుంచి భారీ నిర్వహణ లోపం ఉన్నట్లు మే 7వ తేదీన విడుదలైన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్) నివేదిక స్పష్టంచేసింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన 2020 సంవత్సరంతో పోలిస్తే మహమ్మారి తీవ్రంగా విజృంభించిన 2021 ఏడాదిలో మృతుల సంఖ్య దాదాపు 21 లక్షలు ఎక్కువగా నమోదయ్యాయని సీఆర్‌ఎస్ నివేదిక వెల్లడిరచింది. కోవిడ్
19 మరణాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య కన్నా ఇది దాదాపు ఆరు రెట్లు అధికం. కోవిడ్‌తో 2021 సంవత్సరంలో 3.32 లక్షల మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అధికారికంగా ప్రకటించింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తన బాధ్యతలను ఏవిధంగా నేరపూరితంగా నిర్లక్ష్యం చేసిందో సీఆర్‌ఎస్ నివేదిక కళ్లకుకట్టినట్టు చూపింది. మానవ ప్రాణాలను కాపాడామని మోదీ ప్రభుత్వం డాంబికాలు పలికినప్పటికీ కోవిడ్ నిర్వహణలో దారుణంగా ఎలా విఫలమైంది మరోసారి స్పష్టమైంది. కోవిడ్ మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యను అంచనావేసి వాస్తవాలు మాట్లాడే వారి నోరునొక్కివేసినట్టు కూడా తేటతెల్లమైనది.
మరణాల సంఖ్యకు సంబంధించి వివిధ రకాలుగా చెప్పి గందరగోళపరచడంలో మోదీ ప్రభుత్వ దురుద్దేశాలను తాజా నివేదిక బయటపెట్టింది. నిరాటంకంగా హిందూత్వపాలన సాగించాలన్న తన అజెండాకు కరోనా మృతుల సంఖ్య అడ్డంకిగా ఉన్నందునే వాస్తవ సంఖ్యలను తొక్కిపెట్టిందని స్పష్టమౌతోంది. లేకుంటే మోదీ ప్రభుత్వం, దాని మద్దతుదారులు తాజా నివేదిక ప్రాతిపదిక లేదా ఆ నివేదిక వచ్చిన ముగింపును వివాదం చేసేవారు. కరోనా మృతుల సంఖ్యను తక్కువచేసి చెప్పడం ద్వారా యావత్‌జాతినేకాకుండా ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించిందన్న అపప్రదను మోదీ ప్రభుత్వం మూటకట్టుకుంది. దేశ జీడీపీ విషయమే ఇందుకు పెద్ద ఉదాహరణ. మొదటిది చెడు వార్తలను పాతిపెట్టడం అయితే, రెండోది శుభవార్త ప్రతిరూపాన్ని ప్రదర్శించడం. అయితే, మోదీ ప్రభుత్వం తన ముందు పాలకులకంటే మెరుగ్గా వ్యవహరించినట్టు ప్రచారం చేసుకునేందుకు పూర్తిగా శ్రమించింది. ఇది ఒక తెలివైన వ్యూహం, దీనిని సగటు ఓటరు మాత్రమే కాకుండా, ఒక నిర్దిష్ట విజయాన్ని చాటుకునే ఆధిపత్య మీడియా కథనం ద్వారా తీసుకున్న నిపుణులు కూడా తరచుగా పట్టించుకోరు.
దేశంలో కరోనా మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన వారి అధికారిక సంఖ్య 2025 మే నాటికి 5,33,665. అయితే, ఈ సంఖ్య మహమ్మారిలో వాస్తవ మరణాల సంఖ్య తగ్గుదల కంటే స్వల్పంగా అధికం. ఇటీవల, ప్రభుత్వం మరణానికి కారణాన్ని నిర్ధారించే వైద్య ధృవీకరణ నివేదిక, 2021ను విడుదల చేసింది, దీని ప్రకారం 2021లోనే మొత్తం మరణాలు మహమ్మారికి ముందు స్థాయిలతో పోలిస్తే 21 లక్షలకు పైగా పెరిగాయి. అయితే, అందులో 5 లక్షల మరణాలు మాత్రమే కోవిడ్ మహమ్మారి సంబంధిత మరణాలని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. మహమ్మారి సంబంధిత మరణాలను దేశవ్యాపితంగా తక్కువ చేసి చూపించారని నివేదికలు ఘోషిస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో కోవిడ్ మరణాలు 2021లో నమోదైన అదనపు మరణాలలో 5.2 శాతం మాత్రమే. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) డేటా అనేది మహమ్మారి సమయంలో సంభవించిన మరణాల సంఖ్య ఎంత తక్కువగా ఉందో తెలిపే మొదటి అధికారిక గణాంకం. రాష్ట్రాల వారీగా మారుతూ ఉండే ఈ వ్యత్యాసం, వాస్తవ కోవిడ్-19 మరణాల సంఖ్య గురించి అనిశ్చితిని కూడా సృష్టిస్త్తోంది, ఇది అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉందని ఇప్పుడు వెల్లడైంది. మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఎందరో సంఖ్య అధికారిక గణాంకాలలో కనిపించకుండా పోయింది. మహమ్మారి కారణంగా లక్షలాది మరణించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ప్రధానంగా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలు అధికారిక మరణాల సంఖ్య తక్కువగా పేర్కొంది.
ఒక సాధారణ, మహమ్మారిలేని సమయంలో దేశంలో ఏటా స్వల్పంగా 12 శాతం మాత్రమే పెరుగుతుంది. వృద్ధాప్యం, జనాభా పెరుగుదల వంటి జనాభా మార్పుకారణంగా ఈ స్వల్ప శాతం పెరుగుదల కనిపిస్తుంది. అయితే, ఆరోగ సంరక్షణ చర్యలు మెరుగుదల, తగ్గుతున్న మరణాల రేటు ద్వారా ఇది భర్తీ అవుతుంది. 2021లో మరణాల పెరుగుదల రేటు ఆకస్మికంగా 26 శాతం పెరుగుదల అసాధారణమైనది. మహమ్మారి లేదా విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. 2007, 2019 మధ్య, భారతదేశంలో సగటు వార్షిక మరణాలు 8.1 మిలియన్ల నుంచి 8.6 మిలియన్ల వరకు ఉన్నాయి, సగటున సంవత్సరానికి 8.35 మిలియన్ (83.5 లక్షలు) మరణాలు సంభవిస్తున్నాయి. 2022లో విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, 2020, 2021లో భారతదేశంలో ‘‘అదనపు’’ మరణాల సంఖ్య దాదాపు 47 లక్షలుగా ఉంది, ఇది ఆ రెండు సంవత్సరాలకు అధికారిక భారతీయ సంఖ్య 4.8 లక్షల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో తక్కువ లెక్కింపు జరిగింది. ఆ ప్రాంతాలలో, నివేదించిన కోవిడ్-19 మరణాల సంఖ్య మహమ్మారి వల్ల సంభవించిన వాస్తవ ప్రాణనష్టంలో ఒక భాగం మాత్రమే అధికారిక గణాంకాలలో చూపించారు. ఉదాహరణకు, మధ్యప్రదేశ్‌లో 2020తో పోలిస్తే 2021లో 1,78,000 మరణాలు పెరిగాయి. అయితే, కోవిడ్
19 మరణాలు అధికారికంగా 10,788 మాత్రమేనని చూపారు. అంటే అధికారిక కోవిడ్-19 మృతుల సంఖ్య మొత్తం అదనపు మరణాల కంటే దాదాపు 65 రెట్లు తక్కువ.అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో 2021లో 4,78,682 అదనపు మరణాలు నమోదయ్యాయి. అయితే, అధికారికంగా కోవిడ్ మహమ్మారి మరణాలు 23,743గా చూపించారు. ఈ వ్యత్యాసాలు కేసుల సంఖ్యను బాగా తగ్గించి చూపాయి. అవి కేసులను తక్కువ చేసి చూపడం, పేలవమైన డాక్యుమెంటేషన్ అనే విస్తృత సమస్యను ప్రతిబింబింపచేస్తాయి. ముఖ్యంగా 2021లో కోవిడ్ రెండో వేవ్‌లో దేశంలోని అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి చోటుచేసుకుంది.
ఈ దారుణమైన పరిస్థితిలో కేరళ అత్యంత ఆదర్శవంతంగా నిలిచింది. కోవిడ్ మరణాలకు సంబంధించి తన నివేదికలో అత్యంత కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. 2021లో రాష్ట్రంలో మరణాలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది, 3,39,648 మరణాలు సంభవించాయి, 2020తో పోలిస్తే ఇది 35.3 శాతం పెరుగుదల. కోవిడ్ వల్ల వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 72,139. దీని అర్థం మొత్తం అదనపు మరణాలలో కోవిడ్-19 మరణాలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి, ఇది 2021లో జరిగిన మరణాలలో 21.2 శాతంగా ఉంది.