. ఈ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం
. విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం
. కుప్పం అభివృద్ధికి అద్భుత ప్రణాళిక
. ఏడాదిలో హంద్రీ-నీవా నీళ్లు పారిస్తాం
. కుప్పం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు
. వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభం, శంకుస్థాపనలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి / కుప్పం : విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేయిస్తూ.. సంక్షేమం, అభివృద్ధి యజ్ఞం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నాను. తప్పు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కులాలు మతాలు కాదు కావాల్సింది అభివృద్దేనని, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా పని చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గావించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం, తుంసీ ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో వివిధ పథకాల లబ్ధిదారులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిం చారు. కుప్పం అభివృద్ధి ప్రణాళికలను వివరించడంతోపాటు… రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
చివరి ఎకరానికీ హంద్రీ-నీవా నీళ్లు
కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చా. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తాం. రూ.3,890 కోట్ల వ్యయం చేసి హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నాం. కుప్పంలో ఇప్పటికే హంద్రీ-నీవా కాల్వల లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో రూ.42.07 కోట్లతో 30.14 కిలో మీటర్ల మేర హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వ పనులు పూర్తయ్యాయి. కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తాం. ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తాం. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన..? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ. గత ఏడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ‘‘గతంలో బ్రాండ్ కుప్పం అనేది లేదు. ఇప్పుడు బ్రాండ్ కుప్పం పేరుతో ప్రమోట్ చేస్తాం. కుప్పంలో ఎయిర్ పోర్టు రాబోతోంది. రూ.850 కోట్లను కుప్పం విమానాశ్రయానికి ఖర్చు చేయబోతున్నాం. స్వర్ణ కుప్పం-2029 విజన్ సిద్దం చేశాం. 10,393 మంది బంగారు కుటుంబాలు కుప్పంలో ఉన్నాయి. వీరందరికీ మార్గదర్శులను అనుసంధానం చేస్తాం.’’ అని కుప్పం అభివృద్ధి ప్రణాళికలను సీఎం వివరించారు.
పేదల కోసం అభివృద్ధి యజ్ఞం
‘‘సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా చేస్తున్నాం. వచ్చిన ఆదాయం పేదవారికి కేటాయించాలి, అదే సమయంలో అభివృద్ధి కూడా చేయాలి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని తలచుకుంటేనే భయం వేస్తోంది. రూ.10 లక్షల కోట్ల అప్పులు, అసలూ, వడ్డీలు కలిపి కట్టాలి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ పడకేసేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని కూడా వేరే వాటికి ఖర్చు పెట్టేసి వివిధ పథకాలను అస్తవ్యస్తం చేసింది. ప్రజల్ని కష్టపెట్టకూడదన్న లక్ష్యంతోనే సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాం.ఏ రాష్ట్రమూ ఏపీ ఇస్తున్నంత పెన్షన్ ఇవ్వడం లేదు. కుప్పం పక్కనే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి.. అక్కడా ఇలా పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. ఆగస్టు 15లోగా 15 లక్షల బంగారు కుటుంబాలకు లక్షల మంది మార్గదర్శకులను సిద్దం చేస్తాం. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు.
డ్వాక్రా మహిళలకు ఇసైకిళ్లు ఒక్క కుప్పంలోనే 400 మంది డ్వాక్రా మహిళలకు ఇ-సైకిళ్లను అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘ఎక్కువ శ్రమ లేకుండా సైకిల్ తొక్కవచ్చు.. వ్యాయామం కోసం కూడా సైకిల్ తొక్కాలి. అందుకే సైకిల్ ఈజ్ ది బెస్ట్, సైకిల్ తొక్కితే ఆరోగ్యం, ఆనందం, సైకిలే శాశ్వతం’ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారని... 22ఏ భూముల్ని ఇష్టానుసారంగా అమ్మేశారని చెప్పారు. రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా, ఆక్రమణలు లేకుండా కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. ‘రౌడీయిజం చేస్తే ఆటలు సాగనివ్వను. ప్రస్తుతం ఉన్నది సీబీఎన్-2014 కాదు.. సీబీఎన్-1995’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘ఇప్పుడు కొందరు రాజకీయాలను నేరమయం చేస్తున్నారు. బాబాయిని చంపి నాపై నేరం మోపారు. కారు కింద వారి కార్యకర్తల్నే తొక్కించి.. ..కుక్కపిల్లలా రోడ్డు పక్కన పడేశారు. ఇప్పుడు వారి కార్యకర్త మరణానికి కారణం ప్రభుత్వమేనంటున్నారు. కోడికత్తి, గులకరాయి లాంటి డ్రామాలాడి నాపైనే నెపం పెట్టారు. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుని, అటువంటివారిని రాజకీయాలను శాశ్వతంగా దూరంగా పెట్టాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పంలో నూతన లబ్ధిదారులకు పెన్షన్లను సీఎం అందచేశారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. దీపం 2.0 పథకం కింద కొత్తగా వేయి మందికి గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం వచ్చిన ముఖ్యమంత్రికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహా చిత్తూరు, కుప్పం స్థానిక నేతలు, జిల్లా కలెకర్ట్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.


