Saturday, February 22, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికా`రష్యా శాంతి చర్చలు

అమెరికా`రష్యా శాంతి చర్చలు

రియాద్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్‌ ధ్రువీకరించింది. యూరోపియన్‌ యూనియన్‌లో చేరడమన్నది ఉక్రెయిన్‌కున్న సార్వభౌమ హక్కుగా పేర్కొంది. కీవ్‌ను శాంతించే ఉద్దేశం మాస్కోకు లేదని తెలిపింది. ఉక్రెయిన్‌`రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు కొనసాగు తున్నాయి. ఇదే క్రమంలో అమెరికా, రష్యా ప్రతినిధులు మంగళవారం రియాద్‌లో భేటీ అయ్యారు. రెండు దేశాల ఉన్నత స్థాయి అధికారులు భేటీకి హాజరయ్యారు. సౌదీ రాజ కుటుంబానికి చెందిన దిరియా ప్యాలెస్‌లో సమావేశం జరిగింది. ఈ క్రమంలో క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ విలేకరులతో మాట్లాడుతూ యూరోపియన్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ చేరాలని అనుకుంటే మాస్కో అడ్డుచెప్పదన్నారు. ఉక్రెయిన్‌ సార్వభౌమ దేశమని, ఈయూలో చేరడం దాని హక్కు అని అన్నారు. ‘మనం మాట్లాడుకుం టున్నది ఏకీకరణ గురించి… ఆర్థిక ఏకీకరణ విధానం గురించి… ఇక్కడ ఏ దేశం మరొక దేశాన్ని శాశించలేదు. మేము కూడా అలా చేయబోం’ అని పెస్కోవ్‌ బదులిచ్చారు. అదే సమయంలో సైనికుల కూటముల్లో ఉక్రెయిన్‌ చేరే అంశంలో రష్యా వైఖరి మారుతుందని చెప్పారు. ఇది పూర్తిగా భద్రతా సంబంధితం కాబట్టి రక్షణ లేక సైనిక కూటముల్లో చేరడంపై రష్యా వైఖరి పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. ఇదిలావుంటే, అమెరికా తరపున మార్కె రుబియో, రష్యా తరపున సెర్గి లావ్రోవ్‌ చర్చల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై రష్యా ఆశలు పెట్టుకున్నది. ఆయనను సమస్యలను పరిష్కరించగల సమర్థుడిగా వర్ణించింది. పెద్ద సవాళ్లను వేగంగా, సమర్థంగా, విజయవంతంగా పరిష్కరించగలరంటూ రియాద్‌లో విలేకరులతో మాట్లాడిన రష్యా అధికారి కిరిల్‌ దిమిత్రీవ్‌ అన్నారు.
స్వాగతిస్తున్నాం: చైనా
శాంతి నెలకొల్పే దిశగా జరుగుతున్న కసరత్తులో భాగంగా రియాద్‌ వేదికగా రష్యా, అమెరికా ప్రతినిధులు చర్చలను స్వాగతిస్తున్నట్లు చైనా తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ‘శాంతి సాధన కోసం జరిగే అన్ని ప్రయత్నాలను మేము స్వాగతిస్తాం’ అని గువో అన్నారు. అన్ని వర్గాల ప్రతినిధులు ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో సమానుచితంగా వ్యవహరిస్తారని చైనా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు