అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కేవలం కోతల మనిషి కాదు చేతల మనిషి అని తేలిపోయింది. అమెరికా పౌరసత్వం ఇక ట్రంప్ హయాంలో డబ్బిచ్చి కొనుక్కో వచ్చు. ఇప్పటిదాకా అమలులో ఉన్న ఇ.బి-5 వీసా బదులు రెండు వారాల్లో ‘‘గోల్డ్ కార్డ్’’ వీసా ప్రవేశ పెడ్తున్నట్టు ట్రంప్ తెలియజేశారు. అయిదు మిలియన్ డాలర్లు చెల్లించగలిగే విదేశీయులకు నేరుగా అమెరికా పౌరసత్వం దక్కుతుంది. అమెరికా పౌరసత్వం ట్రంప్ హయాంలో అంగడి సరుకు అయిపోయింది. అయిదు మిలియన్ డాలర్లు అంటే మన రూపాయిలో 43,57,26,000 అవుతుంది. అంటే 43 కోట్ల రూపాయలు చెల్లించగలిగితే అమెరికా పౌరులు అయిపోవచ్చు. ఇప్పటిదాకా అమలులో ఉన్న ఇబి-5 వీసా కింద వలసదార్లు 1,050,000 డాలర్లు పెట్టుబడి పెడ్తే సరిపోయేది. అంటే రూ. 9,15,07,237 చెల్లించ గలిగితే సరిపోయేది. ట్రంప్ నూతన విధానం ప్రకారం అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు చెల్లించవలసి వచ్చే సొమ్ము కన్నా ఇక ముందు కనీసం అయిదు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇబి-5 వీసా కింద అమెరికాలో పెట్టుబడులు పెట్టి, పౌరసత్వం సంపాదిం చాలనుకునే వారు తాము ప్రారంభించే సంస్థల్లో పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాదర బందీ ఉండకపోవచ్చు. ఇంతకు ముందు గ్రీన్ కార్డు మంజూరు అయిన తరవాత కొంతకాలానికి అమెరికా పౌరసత్వం వచ్చేది. ఇప్పుడు అయిదు మిలియన్ డాలర్లు చెల్లిస్తే గ్రీన్ కార్డు ఉన్నవారికి దక్కే సదుపాయాలన్నీ దక్కుతాయి. ఇది అమెరికా పౌరసత్వానికి రహదారిగా కూడా పని చేస్తుంది. గోల్డ్ కార్డ్ విధానం వల్ల సంపన్నులు తమ దేశానికి వస్తారని ట్రంప్ నిస్సిగ్గుగా చెప్పేశారు. తద్వారా అమెరికా ఖజానా నిపడం కూడా తమ ఉద్దేశం అని ట్రంప్ అన్నారు. ఇంతవరకు హెచ్1బి వీసా రానివారు ఇబి-5 వీసా మీద ఆధారపడే వారు. ఇప్పుడు భారీగా పెట్టుబడి పెట్టగలిగే సంపన్నులకు అమెరికాలో సునాయాసంగా ప్రవేశం ఉంటుందన్న మాట. అయితే నైపుణ్యం గల భారతీయ వృత్తి నిపుణులు దీర్ఘ కాలంగా గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నారు. గోల్డ్ కార్డు విధానం ఇలాంటి వారికి ఎంత మాత్రం ఉపయోగపడదు. గోల్డ్ కార్డు ప్రధానంగా అమెరికాలో ప్రవేశించాలనుకునే సంపన్నులను ఆకట్టు కోవడానికి ఉద్దేశించింది. నైపుణ్యం ఉన్న వారికి ఈ నూతన విధానం ఎంత మాత్రం ఉపకరించదు. అమెరికా వెళ్లి పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులకు ఇది ఇబ్బందికరమైందే. ఎందుకంటే భారీగా డబ్బు చెల్లించి గోల్డ్ కార్డ్ తీసుకోవలసి ఉంటుంది. అంటే డబ్బున్న ఆసాములకే ఇది ఉపకరిస్తుంది. బాగా సంపన్నులకే అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. 2024 డిసెంబర్ నాటికి ఉద్యోగాలు కల్పించగలిగే వారి 2,34,000 దరఖాస్తులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఒక్కో దేశానికి 25,620 వీసాలు మాత్రమే ఇవ్వాలన్న నియమం ఉంది. దీనివల్ల చాలా మంది భారతీయులు సుదీర్ఘ కాలంపాటు వేచి చూడవలసి వస్తోంది. నూతన గోల్డ్ కార్డు విధానం ఉపాధి, నైపుణ్యాల కన్నా సంపత్తిగల వారిని ఆకర్షించడం మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంది. వేచి ఉన్న వారి జాబితా నూతన విధానం ద్వారా తగ్గదు కానీ సంపన్న పెట్టుబడిదార్లు భారీగా సొమ్ము చెల్లించగలిగితే వారికి మార్గం సుగమం అవుతుంది.
గోల్డ్ కార్డ్ విధానం సంపద ఉన్న వారికి, నైపుణ్యం ఉన్న వారికి మధ్య తీవ్ర అఖాతంగా తయరవుతుంది. ఇది భారత-అమెరికా సమాజాల మధ్య అంతరం కూడా సృష్టిస్తుంది. గోల్డ్ కార్డు విధానం అమలులోకి వస్తే సమానత్వం, అంతర్జాతీయ సంబంధాల మీద కూడా తీవ్ర ప్రభావం పడొచ్చు. ట్రంప్ ప్రవేశ పెడ్తున్న గోల్డ్ కార్డ్ విధానం సంపన్నులకు పచ్చజెండా ఊపడానికి ఉద్దేశించిందే. కేవలం అత్యూన్నత స్థాయి వారికి మాత్రమే ఈ విధానం ఉపయుక్తంగా ఉండొచ్చు. ఇది మనుషుల మధ్య వారి నైపుణ్యంతో నిమిత్తం లేకుండా ఈ ఖరీదైన విధానంవల్ల తమ బడ్జెట్ లోటు పూడుతుందని కూడా డోనాల్డ్ ట్రంప్ తెగేసి చెప్పారు. 1990 వ సంవత్సరంలో ప్రవేశ పెట్టిన విధానం ఇబి-5 వీసా విధానంలో పది లక్షల డాలర్లు పెట్టుబడి పెడ్తే సరిపోయేది. ఆ పద్ధతిలో గ్రీన్ కార్డ్ సంపాదించిన వారికి కొన్నాళ్ల తరవాత పౌరసత్వం దక్కేది. దీనివల్ల ఏమ్రికన్లకు ఉపాధి అవకాశాలు కూడా ఉండేవి. ఇబి-5 వీసా కింద గ్రామీణ ప్రాంతాలలో, నిరుద్యోగం అత్యంత అధికగా ఉన్న ప్రాంతాలలో ఇబి-5 వీసాకు కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టడానికీ అవకాశం ఉండేది. అంటే 8,00,000 డాలర్లు చెల్లిస్తే వీసా దొరికేది. మౌలిక సదుపాయాలు కల్పించే వ్యాపారం చేసే వారికి కూడా ఈ సదుపాయం ఉండేది. ఇబి-5 వీసా విధానం కింద ఏటా 10,000 వీసాలు మాత్రమే జారీ అయ్యేవి. అందులో 3,000 వీసాలు నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగలిగిన వారికి వీసాలు ఇచ్చేవారు. ఇబి-5 వీసాల మంజూరు కారు చౌకగా ఉండేదని, ఇది అర్థ రహితమైందని, నమ్మబలికేదిగా, మోసపూరితంగా ఉండేది కనక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డ్ విధానం ప్రవేశ పెట్టబోతున్నారు. పాత పద్ధతి ప్రకారం అయితే డబ్బు పెట్టి వీసా పొందే వారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసుకోవడం కష్టంగా ఉండేదంటారు. ఇందులో ఆశ్రిత పక్షపాతానికి కూడా అవకాశం ఉండేదట. ఈ రుగ్మతలు ఇక మీదట తగ్గినా గోల్డ్ కార్డు వీసా చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోవడం మాత్రం ఖాయం. కోటి గోల్డ్ కార్డులు జారీ చేయడానికైనా ట్రంప్ సిద్ధమట. కోటి గోల్ద్ కార్డులు జారీ చేయగలిగితే మన రూపాయల లెక్కల్లో అమెరికా ఖజానాకు 4,36,77,00,00,00,00,000 చేరతాయి. ఇది భారతీయ పెట్టుబడిదార్లకు పెద్ద విఘాతమే. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నవారు ఇప్పటికే పది లక్షలకు పైగా ఉన్నారు. ఇవి అమెరికా ప్రభుత్వ లెక్కలే. స్పెయిన్, గ్రీస్ లాంటి దేశాల్లో ఇప్పటికే గోల్డ్ కార్డు లాంటి పథకాలు అమలులో ఉన్నాయి. మాల్దా, ఈజిప్ట్, జోర్డాన్‌లో పెట్టుబడి పెడ్తే నేరుగా పౌరసత్వం సంపాదించవచ్చు. గోల్డ్ కార్డు పొందే వారు అమెరికా చట్టాల ప్రకారం భారీగా పన్నులు చెల్లించవలసి రావొచ్చు. అమెరికాలో పన్నులు ఎగ్గొట్టడం సులభం కాదు. డబ్బిస్తే పౌరసత్వం ఇచ్చే దేశాలు ఇంతకు ముందే ఉన్నాయి.